నా జన్మధన్యమైంది 

పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చా

ఈరోజు 30 లక్షల మందికిపైగా పేదలకు ఇంటి పట్టాలు అందిస్తున్నా

ఇంతకంటే దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది

4.95 కోట్ల జనాభాలో 1.24 కోట్ల మందికి మేలు చేస్తున్నాం  

రెండు దశల్లో రూ.50,940 కోట్లుతో 28.30 లక్షల ఇళ్లు కట్టిస్తాం

మనం నిర్మించేది ఇళ్లు కాదు.. ఊళ్లు

అర్హత ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాం

రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు రాబోతున్నాయి

రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాల్లో లేఅవుట్‌లు చేసి ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం  

224 చ.అ ఇంటి నిర్మాణాన్ని 340 చ.అడుగులకు పెంచుతున్నాం 

ఇళ్ల నిర్మాణంతో కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు

అమరావతిలో 54 వేలమంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకెళ్లి అడ్డుకున్నారు

అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది..?

పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీల మొహాలు ఎరుపురంగుకు మారాయి

త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.. మిగిలినవారికీ పట్టాలిస్తాం

కొమరగిరి సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తూర్పుగోదావరి: ‘‘క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఈ రోజే కావడం.. ఇలాంటి శుభ దినాన అక్షరాల 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామంటే.. ఇంతకంటే దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వు చూడగలుగుతున్నాను.. ఇంతకంటే నా జన్మకు ఏమీ అవసరం లేదని గర్వంగా చెబుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతుందని సగర్వంగా మీ బిడ్డగా చెబుతున్నానని సీఎం తెలిపారు. 

28.30 లక్షల ఇళ్ల స్థలాలు, మరో 2.62 లక్షల టిడ్కో ప్లాట్లు, మొత్తం కలిసి 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. 28.30 లక్షల స్థలాల్లో ఇళ్లు కట్టడానికి రూ.50,940 కోట్లు రెండు దశల్లో వెచ్చించబోతున్నాం. మొదటి దశ కింద 15.60 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ఈరోజే శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల వీటి విలువ రూ.28 వేల కోట్లు అని ప్రతి అక్కాచెల్లెమ్మకు తెలియజేస్తున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటితో పాటు 2.62 లక్షల టిడ్కో ఇళ్లను కూడా ఈ రోజే అక్కచెల్లెమ్మల పేరుతో సేల్‌ అగ్రిమెంట్‌ కూడా చేసి అందించబోతున్నాం అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం, కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణం వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..

ఇళ్ల స్థలాల లేఅవుట్‌లు చూస్తే.. వచ్చేవి వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊర్లు రాబోతున్నాయని అర్థం అవుతుంది. 16,681 ఇళ్ల స్థలాల్లో వైయస్‌ఆర్‌ జనతా బజార్, వైయస్‌ఆర్‌ క్లినిక్, బస్టాప్, అంగన్‌వాడీ కేంద్రాలు, ఫంక్షన్‌హాల్, ప్రైమరీ స్కూల్, హైస్కూల్, కమ్యూనిటీ హాల్, పార్కులు, లేఅవుట్‌ విస్తీర్ణం బట్టి డ్రైనేజీ, రోడ్లు, కరెంట్, నీళ్లు మాత్రమే కాకుండా మిగిలినవి కూడా యాడ్‌ చేయడం జరుగుతుంది. ఇక్కడ 16,681 ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. 

కొమరగిరిలో మనం ఇచ్చే స్థలానికి మార్కెట్‌ విలువ ఎంత ఉంటుంది అని కలెక్టర్‌ను అడిగితే.. ప్లాట్‌ విలువ కనీసం రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఇంతమంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నాడంటే.. ఇంతకంటే భాగ్యం ఉంటుందా.. గొప్పగా ఆనంద పడుతున్నాను. 

పక్కా ఇల్లు లేకపోవడంతో పడే బాధ బాగా తెలిసినవాడిని, 3648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా ప్రతి అడుగులో చూశా. ఇళ్లు అనేది లేకపోతే ఎండ, వాన, చలి మూడింటిని భరిస్తూ శతాబ్దాలుగా కొన్ని సామాజికవర్గాలు, పేదవర్గాలు ఏ పరిస్థితిలో బతుకుతున్నాయి.. వారి జీవితాలు ఎలా ఉన్నాయో.. చూశాను. అద్దెలు కట్టడం కోసం వారి సంపాదనలో 40 శాతం డబ్బులు వెచ్చించి చాలీచాలని జీతాలతో ఎలా బతుకుబండిని ఈడుస్తున్నారో నా కళ్లారా చూశా. ఇటువంటి పరిస్థితిని మార్చాలని గట్టి సంకల్పంతో.. స్వాతంత్య్ర వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇదే పరిస్థితా..? అని ఎన్నో సందర్భాల్లో బాధపడ్డాను. దీన్ని మార్చాలనే ఉద్దేశంతో ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చా. 

మేనిఫెస్టో అంటే ఎన్నికలు అయిపోయిన తరువాత చెత్తబుట్టలోకి వెళ్లే పేపర్‌ కాదు.. ఎన్నికల మేనిఫెస్టో అంటే 650 పేజీలు, వెయ్యి పేజీల డాక్యుమెంట్‌ క్రియేట్‌ చేసి అది చదవడానికి విసుగెత్తేలా ఉండకూడదని, కేవలం రెండే రెండు పేజీల్లో మేనిఫెస్టో రూపొందించాం. మేనిఫెస్టో నాకు ఖురాన్, భగవద్గీత, బైబిల్‌ లాంటిదని చెప్పి.. మేనిఫెస్టోను అమలు చేయడం కోసం జగన్‌ అనే వ్యక్తి అహర్నిశలు కృషి చేస్తాడని మొట్టమొదటి రోజు నుంచి భరోసా ఇస్తూ వచ్చా. 

ఇళ్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, వర్గాలు చూడం, అర్హత మాత్రమే చూస్తాం. ఐదేళ్లలో అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. గర్వంగా చెబుతున్నాను.. మీ బిడ్డ 25 లక్షల ఇళ్లు అని చెప్పి అంతకు మించి 31.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. 

అర్హత మాత్రమే ప్రాతిపదికన ఉండాలని అడుగులు ముందుకువేశాం. కలెక్టర్ల సమావేశం దగ్గర నుంచి గ్రామ వలంటీర్లకు దిశా, దశ నిర్దేశించాం. కులం, మతం, పార్టీ, రాజకీయం చూడకూడదు. చివరకు మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. వారికి అర్హత ఉంటే కచ్చితంగా ఇల్లు ఇవ్వాలని దిశా నిర్దేశం చేశాం. నిజంగా ఈ రోజు గర్వపడుతున్నాను. ఒక బాధ్యతగా పక్క ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 

గత ప్రభుత్వం చివరి రెండు సంవత్సరాల్లో మొక్కుబడిగా కొన్ని ఇళ్లు కట్టడం చూశాం. ఇప్పుడు మనం కడుతున్నది ఇళ్లు కాదు.. మనం ఊళ్లు కడుతున్నాం. ఈ రోజు ప్రారంభించి వచ్చే మూడేళ్లలో మనం కట్టబోతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు. దీని వల్ల లబ్ధి ఏ విధంగా జరుగుతుందని గమనిస్తే.. 

2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభా 4.95 కోట్ల మంది అని లెక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించబోతుందంటే.. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు (భార్య, భర్త, ఇద్దరు పిల్లలు) అనుకుంటే 1.24 కోట్ల జనాభాకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.95 కోట్ల జనాభా ఉంటే.. దాంట్లో 1.24 కోట్ల మందికి ఉజ్జాయింపుగా మేలు జరుగుతుంది. 

ఇదే తూర్పు గోదావరి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 51.54 లక్షలు మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 48.88 లక్షల మంది. ఈ రెండు జిల్లాలే కాదు.. కడప, శ్రీకాకుళం జిల్లా కలిపితే 1.24 లక్షల మందికి ప్లేస్‌మెంట్‌ వస్తుందంటే.. ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందో ఒకసారి  గమనించాలి. మన రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు రాబోతున్నాయి. ఈ కాలనీల్లో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా.. కాలనీల్లో రాబోయే రోజుల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ ఇంకా అనేక వసతులు కల్పించబోతున్నాం. దీనికి దాదాపుగా మరో రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. దానికి కూడా సిద్ధం అవుతున్నాం. కాలనీ విస్తీర్ణం పెద్దగా ఉంటే.. పార్కులు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్, కమ్యూనిటీ హాల్స్‌ ఇటువంటివన్నీ ఉండేట్లుగా ప్లానింగ్‌ చేయడం జరిగింది. 

లేఅవుట్‌లలో ఉచితంగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులు అయితే.. దాన్ని మార్చుతూ.. 340 చదరపు అడుగులకు పెంచుతూ కట్టించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల భూమిని లేఅవుట్‌లు చేసి.. ఇళ్ల పట్టాలుగా పంచబోతున్నాం. 68,361 ఎకరాల భూమి మార్కెట్‌ విలువ రూ.25,530 కోట్లు. ఇంత విలువైన భూములను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు పంచబోతున్నాం. 

పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 1.5 సెంట్ల వరకు ఎంత వీలైతే అంత ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. దానికి తగ్గట్టుగానే లేఅవుట్‌లు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 సెంట్‌ కచ్చితంగా ఉండాలని లేఅవుట్‌లు ప్లాన్‌ చేయడం జరిగింది. ఇవాళ మనం కట్టించబోయే ఇళ్లకు సంబంధించి.. ఉట్టి స్థలం ఇవ్వడమే కాదు.. ఇంటిని కట్టించేందుకు అన్ని రకాల బాధ్యత కూడా తీసుకున్నాం. ప్రతి లేఅవుట్‌లో మోడల్‌ ఇంటిని కట్టాలని సూచించాం. అదే మోడల్‌ ఇల్లును ఒక్క రూపాయి కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత నాది అని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెబుతున్నా.. 

ఇంట్లో ఒక బెడ్‌రూం, లివింగ్‌ రూం. కిచెన్, టాయిలెట్, పైన సింటెక్స్‌ ట్యాంక్‌తో పాటు రెండ్లు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, రెండు ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా 13 లక్షల మొక్కులు కూడా లేఅవుట్‌లలో నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం.. ఇందులో మొదటి దశ కింద 15.60 లక్షల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఈ రోజు మొదలవుతుంది. రెండో దశ అంటే మిగిలిన 12.70 ఇళ్లను వచ్చే ఏడాది నిర్మిస్తాం. వీటికి అదనంగా 2.62 లక్షల టిడ్కో ఇంటి ప్లాట్స్‌ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది కొన్ని, ఆ తరువాత సంవత్సరం మిగిలినవన్నీ పూర్తిచేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరుగుతుంది. 

స్థలంతో పాటు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు.. ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్‌ చార్జీలు మీ చేతికి ఇస్తుంది.. మీరే దగ్గరుండి ఇళ్లు కట్టుకోవచ్చు. రెండవది.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారుడు తెచ్చుకుంటే దానికి కూడా మీకే అవకాశం ఇస్తాం.. సామగ్రి తెచ్చుకోండి.. ఇల్లు కట్టుకోండి.. దశల వారీగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మూడవ ఆప్షన్‌... మీరే కట్టించి ఇవ్వండి అని చెప్పినా పర్వాలేదు.. దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామగ్రి సరఫరా చేయడంతో పాటు దగ్గరుండి మీ చెయ్యి పట్టుకొని అన్ని రకాల అవసరాలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. మీరు ఏ ఆప్షన్‌ తీసుకున్నా పర్వాలేదు.. గ్రామ, వార్డు వలంటీర్‌ ఇంటి స్థలం చూపిస్తారు.. అధికారులు వచ్చి అక్కడే ఇంటి నిర్మాణ పత్రాల ఇచ్చి ఫొటో కూడా తీస్తారు. మీరు టిక్‌ పెట్టిన ఆప్షన్‌ పేపర్‌ను తీసుకుంటారు. 

అవినీతికి, వివక్షకు తావులేకుండా సామాజిక తనిఖీ ద్వారా అత్యంత పారదర్శకతతో ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశాం. ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ చేశాం. ఈ రోజూ చెబుతున్నా.. అర్హత ఉండి ఇళ్ల స్థలం లేకపోతే దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి 90 రోజుల్లో ఇంటి స్థలం ఇప్పిస్తాం. పారదర్శకత ఆ స్థాయికి తీసుకెళ్లాం. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్న ఐదేళ్ల తరువాత అక్కచెల్లెమ్మలకు అనుకోని అవసరం వస్తే అమ్ముకోవాలన్నా.. తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకోవాలన్నా.. అన్ని హక్కులు ఉండే విధంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని నేను తాపత్రయపడ్డాను. 

కొందరు స్వార్థపరుల కుట్రల వల్ల అడ్డంకులు ఏర్పడి.. ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అర్హులైన అక్కచెల్లెమ్మలందరికీ డీ–ఫాం పట్టాలు పంపిణీ చేస్తున్నాం. దేవుడి ఆశీసులు, ప్రజల చల్లని దీవెనలతో అడ్డంకులు తొలగిన వెంటనే డీ–ఫాం పట్టాల స్థానంలో సర్వహక్కులతో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఏకంగా దీని కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో కొట్లాడుతుంది. 

ఇళ్ల పట్టాల పంపిణీ మొదట ఉగాది నాడు ప్రారంభించాలనుకున్నాం.. ఆ తరువాత శ్రీరామనవమికి వాయిదా వేశాం. న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు.. రకరకాలుగా కుట్రలు పన్నుతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఏరకంగా రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. తరువాత అంబేడ్కర్‌ జయంతి.. వైయస్‌ఆర్‌ జయంతి.. స్వాతంత్య్ర దినోత్సవం.. తరువాత గాంధీ జయంతి.. ఇలా వాయిదాలు వేయాల్సి వచ్చింది. దుర్బుద్ధితో కేసులు వేయడమే వాయిదాలకు కారణం. 

మన 18 నెలల పాలనలో ఏకంగా రూ.77 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేశాం. అవినీతికి ఆస్కారం లేకుండా నగదు బదిలీ ప్రక్రియ చేపట్టాం. దీన్ని చూసి ఓర్వలేని పసుపు పార్టీల ముఖాలు ఎరుపు రంగుకు మారిపోతున్నాయి. 

అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని కార్యాచరణ చేస్తే.. డెమోగ్రఫిక్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ వస్తుందని.. గత పాలకులు కోర్టుకు వెళ్లారు. ఆ పిటీషన్‌ చూసి కోర్టు స్టే ఇవ్వడం నాకు ఆశ్చర్యం అనిపించింది. 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే.. డెమోగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందంట.. 

డెమోగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ అంటే.. కుల పరమైన అసమతూల్యం. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కులాలు మారిపోతాయని పిటీషన్‌ వేశారు. ఆ పిటీషన్‌ మీద స్టే వస్తుంటే.. నిజంగా బాధ అనిపిస్తుంది. 

మానవత్వం లేనివారు ఎలా ఉన్నారంటే.. చంద్రబాబు, ఆయన సహచరులు కలిసి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. కేసులు వేసి స్టేలు తెచ్చారు. ఆ స్టేల వల్ల ఈ రోజు ఇవ్వాలనుకున్న 31.75 లక్షల ఇళ్ల పట్టాలకు గానూ.. 3.74 లక్షల ఇళ్ల పట్టాలు పేద అక్కచెల్లెమ్మలకు ఇవ్వలేకపోతున్నాం. అంటే 10 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది చంద్రబాబు వల్లే. 

ఇళ్ల పట్టాలతో పేదలకు మంచి జరుగుతుందని తెలిసి.. దీన్ని అడ్డుకోవడానికి నిన్న కూడా హైకోర్టులో పీఐల్‌ వేశారు. పులివెందులలో జగన్‌ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని ఇంకో పీఐల్‌ వేశారు. వీళ్ల దుర్బద్ధిని చూస్తుంటే.. వీళ్లు మనుషులేనా.. ఇటువంటి వాళ్లు ప్రజాజీవితంలో ఉండేందుకు అర్హులేనా..? దేవుడు కచ్చితంగా వీళ్లకు మొట్టికాయలు వేస్తాడు. త్వరలోనే ఈ ఇబ్బందులు తొలగిపోయి సుప్రీం కోర్టులో కేసులు పరిష్కారమై.. మిగిలిపోయిన 3.74 లక్షల అక్కచెల్లెమ్మలకు కూడా ఇళ్ల పట్టాలు కచ్చితంగా ఇస్తామని తెలియజేస్తున్నాను. 

అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలవారు ఉండగలిగితేనే అది రాజధాని అవుతుంది. ఎవరైనా రాజధానిలో ఈ కులం ఉండకూడదు.. ఈ పేద వారు ఉంటే కులాలు మారిపోతాయని పిటీషన్లు వేస్తే.. దాన్ని రాజధాని అంటారా..? అని ఆలోచించుకోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాల వారు అందరూ కలిసి ఉండగలిగితేనే అది రాజధాని అవుతుంది. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అవుతుంది.. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. అటువంటి సమాజాన్ని, అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి రాజధానిని దేవుడి దయతో కచ్చితంగా నిర్మించుకుంటామని తెలియజేస్తున్నాను. 

టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టి సగంలో వదిలేసి పోయింది. 2.62 లక్షల టిడ్కో ఇళ్లను కూడా పూర్తిచేసి త్వరలోనే వారికి అందించనున్నాం. ఈ ఇళ్లు పూర్తి చేయడం కోసం రూ.9,500 కోట్లు మనం ఖర్చు చేయబోతున్నాం. టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగులలోపు ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మన ప్రభుత్వం భరిస్తుంది. 

కేవలం ఒక్క రూపాయికే టిడ్కో ఇంటిని ఇచ్చే జగనన్న స్కీమ్‌ కావాలా..? లేక రూ. 2.65 లక్షల బ్యాంకు రుణం, 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేలు కట్టుకుంటూ పోతే.. వడ్డీతో సహా రూ.7.20 లక్షలు ఖర్చు అయ్యే చ్రందబాబు స్కీమ్‌ కావాలా..? అని రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో లబ్ధిదారులను అడిగాం. 2.62 లక్షల ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇళ్లు 1.43 లక్షలు. ఈ లబ్ధిదారులను జగనన్న స్కీమ్‌ కావాలా..? చంద్రబాబు స్కీమ్‌ కావాలా..? అని అడిగితే.. చంద్రబాబు స్కీమ్‌కు ఒక్కడు టిక్‌ పెట్టాడు. అయినా పర్వలేదు.. ఆయన కోరిక మేరకు చంద్రబాబు స్కీమ్‌ ఇస్తాం. మిగిలిన వారికి జగనన్న స్కీమ్‌ ఇస్తామని తెలియజేస్తున్నాను. 

365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల లబ్ధిదారులు కట్టాల్సిన ముందస్తు వాటా సొమ్ములో కూడా 50 శాతం మన ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్క రూపాయికే పేదవాడికి ఇళ్లు ఇచ్చేందుకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.3805 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం మన ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి.. దానికి ప్రభుత్వంపై పడే భారం మరో రూ.482 కోట్లు. టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వానికి పడే అదనపు భారం రూ. 4,287 కోట్లు అయితే.. ఈ భారాన్ని కూడా చిరునవ్వుతో మీ బిడ్డ స్వీకరిస్తున్నాడు. 

టిడ్కో విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తీర్చుతూనే.. ఈ సంవత్సరం కొన్ని, వచ్చే ఏడాది మరికొన్ని, మిగిలిన మరికొన్ని ఇళ్లను ఆ తరువాత సంవత్సరం పూర్తిచేస్తాం. 
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ ఇలాంటి మౌలిక వసతులకు సంబంధించి ఏమాత్రం ఖర్చు చేయలేదు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని తెలిసినా.. చిరునవ్వుతో భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటికి సంబంధించిన టెండర్లు కూడా వచ్చే నెలలో పూర్తి చేసి పనులు కూడా ప్రారంభిస్తాం. 

ఇంటి నిర్మాణం అంటే ముగ్గుపోసి పునాదులు తవ్వడంతో మొదలు పెడితే ఒక ఇల్లు పూర్తవుతుంది. ఈ స్థాయిలో 15.60 లక్షల ఇళ్లు కట్టడం.. 31.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం. చివరకు ఇళ్లు నిర్మించడం అంటే నిజంగా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందని ఆలోచన చేస్తే.. ఇటుకలు చేసేవారికి, సిమెంట్‌ మోసేవారికి, కంకర తయారీ చేసేవారికి, తాపీ మేస్త్రీలకు, కూలీలకు, వడ్రంగులకు, కరెంట్‌ పనిచేసే వారికి, వెల్డర్లు, టైల్స్, చివరకు ఆటో తోలేవారికి కూడా మేలు జరుగుతుంది. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 31 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే.. మొదటి దశలో 15.60 ఇళ్లకు 69.70 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్, 7.4 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్‌ టన్నుల మెటల్‌ ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ కార్యక్రమంతో వ్యవస్థలోకి ఎకనామిక్‌ బూస్టు వస్తుంది. రకరకాల ఉద్యోగాలు వస్తాయి. 

మనం కట్టించే ఇళ్లతో కొన్ని లక్షల మందికి ఉపాధి, ఆదాయం ఇస్తుంది. మనం ఇచ్చే ఇళ్లు బాధ్యతగా ఇస్తున్నాం. 1978లోనే జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఇల్లు అనేది లీగల్‌ రైట్‌. దీని కోసం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే.. రకరకాల సందర్భాల్లో కోర్టుకు వెళ్లడం.. స్టే ఇవ్వడం చూస్తుంటే.. పేదవాడి కోసం రాజ్యాంగమా..? ఎవరి కోసం రాజ్యాంగం అనే సందేహం కలుగుతుంది. 

తరతరాల అణచివేతతో మగ్గిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికవర్గాలే కాకుండా పేదరికంలో మగ్గిపోయిన అగ్రకులాలు కూడా ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణంతో వారందరికీ సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక స్థోమతను, ఆరోగ్యపరంగా, భద్రతా పరంగా, మెరుగైన వాతావరణం అన్నింటిని మించి.. మా సొంత ఇల్లు అనే భావాన్ని కలిగించేందుకు మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాను అని.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నాడు’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

తాజా వీడియోలు

Back to Top