దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు మూలా నక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం  పంచెకట్టు, తలపాగా చుట్టి దుర్గ‌మ్మ స‌న్నిధికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంను వేదపండితులు ఆశీర్వ‌దించి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. అనంతరం దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ 2021 క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

కొండచరియలు విరిగిన ప్రాంతం పరిశీలన
అంతకు ముందు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కొండ మీదకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. కొండచరియలు విరిగి ప‌డిన‌ ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. దుర్గ గుడి మాస్టర్‌ప్లాన్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Back to Top