కొనసీమ జిల్లా: అడిగిందే తడువు..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, తొత్తరమూడి గ్రామానికి చెందిన గన్నవరపు ఝాన్సీరాణి కిడ్నీ పేషెంట్. 32 ఏళ్ల ఝాన్సీరాణికి పెళ్లయి.. ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగ్గంపేట మండలం, ఇర్రిపాక రాగా హెలిప్యాడ్ వద్ద ఝాన్సీరాణి.. ముఖ్యమంత్రిగారిని కలిసి తమ దీన పరిస్థితిని వివరించింది. ఎలాగైనా ఆదుకోవాలని.. ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేయగా.. అధైర్యపడొద్దని తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మాట్లాడి ఝాన్సీరాణికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగం ఇప్పించాలని సూచించారు. దీంతో కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమం ముగిసిన వెంటనే క్యాంపుకార్యాలయానికి ఝాన్సీరాణిని తీసుకెళ్లి ఆమె విద్యార్హతలు డిగ్రీ, డీఈడీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (పీజీడీసీఏ)ను పరిశీలించి.. వికాస సంస్థ సమన్వయంతో రూ. 14 వేల ప్రారంభ వేతనంతో ఇంటి నుంచి పనిచేసేలా కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందించారు.
దీంతోపాటు ఉచిత వైద్య పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేయాలని డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తను ఆదేశించారు. అడిగిందే తడవు తమ కుటుంబానికి ఆపన్నహస్తం అందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఝాన్సీరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
