సీఎం వైయస్‌ జగన్‌ లేఖకు స్పందించిన కేంద్రం  

కోవాగ్జిన్‌ టెక్నాలజీ బదిలీకి ముందుకొచ్చిన కేంద్రప్రభుత్వం 

సీఎం వైయస్‌ జగన్‌ చూపించిన చొరవపై అభినందనల వెల్లువ 

తాడేపల్లి: వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి రాసిన లేఖతో కోవాగ్జిన్‌ టెక్నాలజీని బదిలీ చేయడానికి కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు  కోవాగ్జిన్‌ ఫార్ములాను అనుభవం ఉన్న సంస్థలకు బదిలీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈనెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం  తెలిసిందే. ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ కాబట్టి పేటెంట్‌ విషయంలో ఎటువంటి వివాదాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ( ఎన్‌ఐవీ), భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకా   ఉత్పత్తి సామర్థ్యం దేశీయ అవసరాలకు సరిపోనందున వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఇతర సంస్థలకు టెక్నాలజీ బదిలీ చేయాలంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. తద్వారా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయవచ్చన్నారు. 

కోవిడ్‌–19ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వేగంగా వ్యాక్సిన్‌ వేయడం ఒక్కటే మార్గమని, ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం తప్ప మరోమార్గం లేదని వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్రం అదే దిశగా అడుగులు ముందుకు వేయడంతో సీఎం వైయస్‌ జగన్‌ చూపించిన చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌ తయారీకి ఆసక్తి ఉన్న సంస్థలు మూడు వారాల్లో ముందుకు రావాలని కేంద్రం పేర్కొనడంతో పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top