టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల కోసం శ్మశానాల్లో క్రీడా వికాస కేంద్రాలు కట్టారు 

శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి 

విజ‌యవాడ‌: లోకేశ్‌ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలను (కేవీకేలను) అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేవీకేలను గుట్టలు, శ్మశానాల్లో నిర్మించారని చెప్పారు.

 
దొంగ అంచనాలతో రూ.కోటి ఖర్చయ్యే భవనాన్ని రూ.2 కోట్లతో, అదీ నాసిరకంగా నిర్మించి ప్రజా ధనాన్ని దోచేశారని తెలిపారు. చాలా చోట్ల కేవీకేలు ఊరికి దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. ఓ అండ్‌ ఎం కింద ప్రైవేటు వ్యక్తులతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు న్యాయబద్ధంగా టెండర్లు పిలిచామన్నారు. పే అండ్‌ ప్లే విధానం గత ప్రభుత్వాల నుంచి ఉన్నదేనని చెప్పారు.

గతంలోనూ కొన్ని స్టేడియాల్లో క్రీడాకారుల నుంచి ఫీజు వసూలు చేసేవారని, ఆ డబ్బులకు లెక్కలు ఉండేవి కావన్నారు. దానిని స్ట్రీమ్‌లైన్‌ చేసి సెంట్రలైజ్డ్‌ అకౌంట్‌ ద్వారా పారదర్శకంగా ప్రతి రూపాయినీ క్రీడల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. లీజుకు ఇచ్చే కేవీకేల్లో 10% పేద క్రీడాకారులు ఉచితంగా శిక్షణ పొందవచ్చని తెలిపారు.

ఎక్కువ మంది సాధన చేసే కేవీకేలు, కోర్టులను ఓ అండ్‌ ఎం నుంచి మినహాయిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో క్రీడాకారులకు శిక్షణ పేరుతో టెన్విక్‌ కంపెనీకి రూ.50 కోట్లు దోచిపెట్టారన్నారు. క్రీడా సంఘాల్లో టీడీపీ నాయకులు జోక్యం చేసుకొని క్రీడలను నాశనం చేశారని, ఐదేళ్లలో ఒక్క స్టేడియాన్ని కూడా నిర్మించలేదని చెప్పారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం వాటిని చెల్లించి.. పతకాలకు ఇచ్చే మొత్తాలను కూడా పెంచిందన్నారు.
 
చరిత్రలో ఎన్నడూ లేదు.. 
ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2,500 మందికి సచివాలయాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దని చెప్పారు. 6 వేల జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. శాప్‌ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, ప్రభుత్వ సాయంతో పాటు సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుందన్నారు. కోచింగ్‌కు అవకాశం లేని చోట మాత్రమే ఓ అండ్‌ ఎంకు ఇస్తున్నామని, తద్వారా యువతకు కోచ్‌లుగా ఉపాధి దక్కుతుందని శాప్‌ ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు.  

Back to Top