కర్నూలు: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలో ‘ఓటాన్ అకౌంట్’ ఒక ప్రొవిజన్ అని, బడ్జెట్‌ను అమలు చేయలేని సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాలకోసం ఓటాన్ అకౌంట్‌ను అమలు చేసే విషయం మాజీ మంత్రి యనమలకు తెలిసిందేనన్నారు. రాజకీయ దురుద్దేశంతో యనమల విమర్శలు చేయడం సబబు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విషయంలో ఎస్‌ఈసీ నుంచి స్పష్టత రాకపోవడం, కరోనా సమస్యతో బడ్జెట్ సమావేశాలు జరిపే అవకాశాల్లేకపోవడంతో ఓటాన్ అకౌంట్‌ను అమలు చేయాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు.