విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైయస్ఆర్‌సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైయస్ఆర్‌సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైయస్ఆర్‌సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు. ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.