వైయస్‌ జగన్‌పై పుస్తకం ఆవిష్కరణ

 హైదరాబాద్‌:వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం, 14 నెలల పాటు ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి రాసిన ‘‘అడుగడుగునా అంతరంగం’’ పుస్తకాన్ని వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షులు   వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. వైయస్‌ జగన్‌ రాజకీయ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లు, అనూహ్య మలుపులను జర్నలిస్టు శ్రీహరి ఈపుస్తకంలో చర్చించారు. 14 నెలల పాటు 3వేల648 కిలోమీటర్లు కొనసాగిన ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జరిగిన సంఘటనలను రచయిత పొందుపరిచారు. 268 పేజీల ఈ పుస్తకంలో వైయస్ఆర్ మరణం తర్వాత వైయస్‌ జగన్‌ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, సొంత పార్టీ స్థాపన, తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి చేసిన ప్రయత్నాలు, ఆ సమయంలో తాను ఆ నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ కూడా ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. దీనితో పాటు వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం, రోజువారీ ఆయన దినచర్య తదితర విషయాలు పుస్తకంలో ప్రముఖంగా కనిపిస్తాయి. 2003లో వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం, 2013లో ఆయన తనయ వైఎస్‌ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పాదయాత్ర గురించి పుస్తకంలో పరిచయం చేసిన శ్రీహరి, జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్రను సవివరంగా వివరించారు. పాదయాత్ర సమయంలో జరిగిన దాదాపు అన్ని ముఖ్య రాజకీయ ఘట్టాలను, పరిణామాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రకు ప్రత్యక్షసాక్షిగా ఉంటూ యాత్ర వివరాలన్నింటినీ అక్షరంలోకి మార్చారు. 

Back to Top