కార్మికుల పొట్టగొట్టిన నీచుడు అచ్చెన్నాయుడు

అవినీతిపరుడిని స్వాతంత్య్ర సమరయోధుడిగా చిత్రీకరించడం సిగ్గుచేటు

రూ.150 కోట్ల స్కామ్‌కు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్పా..? 

ఈఎస్‌ఐ స్కామ్‌లో హస్తం ఉన్న పెద్దపాములూ దొరుకుతారు

అవినీతి పరుడికి కులం కార్డు అంటగట్టడం దారుణం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ

సచివాలయం: ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు అరెస్టును కులానికి అంటగట్టడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు అవినీతి పరుడని, కార్మికుల పొట్టకొట్టి రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తిని స్వతంత్య్ర సమరయోధుడిగా చిత్రీకరిస్తూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో మంత్రి శంకర్‌నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.20 వేల కంటే తక్కువ జీతం పొందేవారు ఈఎస్‌ఐ కిందకు వస్తారని, వీరిలో అధికభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని, ఈ విధంగా చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్మికుల పొట్టకొట్టినట్లు కాదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

న్యాయబద్ధమైన విచారణ అనంతరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ నివేదిక అందించిందని, నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేశారన్నారు. టెండర్లు కూడా పిలవకుండా అచ్చెన్నాయుడు, చంద్రబాబుల బినామీ కంపెనీలకు నామినేటెడ్‌ పద్ధతిలో టెండర్లు కట్టబెట్టి అందినకాడికి రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు తేలిందని, ఈ రోజు చిన్న చిన్న పాములు దొరికాయి.. రాబోయే రోజుల్లో ఈ స్కామ్‌లో హస్తం ఉన్న పెద్ద పాములు కూడా దొరికిపోతారన్నారు.  

అవినీతికి పాల్పడిన వ్యక్తికి కులం కార్డు అంటగడుతున్నారని, అచ్చెన్నాయుడు ఏమైనా జ్యోతిరావు పూలేనా, మహాత్మాగాంధీనా..? బీసీలకు మంచి కార్యక్రమం చేసినా వ్యక్తా..? చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కార్మికుల పొట్టగొట్టి దోచుకోవడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసిన ద్రోహం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. 

ఓడిపోయినప్పుడు బీసీలపై అత్యంత ప్రేమ చూపించే చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశాడని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే రూ.20 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి బీసీలకు ప్రయోజనం చేకూర్చిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినవ జ్యోతిరావుపూలే, అభినవ అంబేడ్కర్‌గా ప్రజలంతా భావిస్తున్నారన్నారు. 
 

Back to Top