నేను విలువైన రాజకీయాలే చేస్తాను

తాడేపల్లి: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలోనే ఖండించానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.  గురువారం సీఎం జగన్‌ను కలిసిన తర్వాత బాలినేని మాట్లాడుతూ..‘ ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో మాట్లాడాను. భూ ఆక్రమణల మీద మా నియోజకవర్గంలో చర్చ జరిగింది. ఇవన్నీ టీడీపీ నేతలు కావాలనే ప్రచారం చేశారు.  ఈ ఆరోపణలపై పోలీసు అధికారులతో మాట్లాడాను. వారిని అరెస్ట్‌ చేయమని చెప్తే కొంత ఆలస్యం చేశారు. అందుకని కోపం వచ్చి నా గన్‌మెన్లను సరెండర్‌ చేశాను. 

ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. 40 మందిని అరెస్ట్‌ చేశారు. పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను నేను అప్పుడే ఖండించా. పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలం మీద టీడీపీ వారు కోర్టుకు వెళ్లారు. 25వేల మందికి సరిపడా స్థలం ఇప్పుడు వేరేగా తీసుకుంటున్నాం. త్వరలోనే సీఎం జగన్‌ వచ్చి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. భూకబ్జాలు ఎవరు చేసినా అరెస్టులు చేయమని గట్టిగా చెప్పాం. నేను విలువైన రాజకీయాలే చేస్తాను. టీడీపీ నేత జనార్థన్‌ నాకు వ్యతిరేంగా వార్తలు రాయిస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద వార్తలు రాగానే ఫీలవుతున్నారు. మరి నా మీద వార్తలు రాయించినప్పుడు ఆ బాధ తెలీదా? అని ప్రశ్నించారు బాలినేని.

Back to Top