హైదరాబాద్ అయిదున్నరేళ్ల కాలంలో బీసీలను అణగదొక్కేలా ప్రవర్తించి ఇప్పుడు జయహో బిసీల సభ నిర్వహించే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త మార్గాని భరత్ మండిపడ్డారు. బీసీలంటే చంద్రబాబుగారి బిజినెస్ క్లాస్ గానే పరిగణిస్తున్నారని టీడీపీ వైఖరని ఎండగట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలకు అయిదు సంవత్సరాల్లో 50 వేల కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించారనీ , వాస్తవంలో మొత్తం అయిదేళ్ల కాలానికి కలిపి ఖర్చు చేసింది 15 వేల కోట్లు కూడా లేదంటేనే చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు నాయుడు ఏమొహం పెట్టుకుని జయహో బీసీ సభను నిర్వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమధానం చెప్పాలని సవాల్ చేశారు. బీసీలకు చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పిన తరువాతనే సభలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడికి బీసీల ఓట్లు కావాలి గానీ, సీట్లు మాత్రం ఇవ్వరని ఆయన ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో బిసిలకు మీ వాగ్దానం మేరకు సీట్లు ఇచ్చారా? అంటూ నిలదీశారు. జస్టీస్ ఈశ్వరయ్య లేవనెత్తిన మీ బిసి వ్యతిరేక విధానాలకు రాజమండ్రిలో సమాధానం చెప్పాలన్నారు. రజక,నాయిబ్రాహ్మణులను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పారనీ, కేంద్రంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి ఎందుకు చర్యలు చేపట్టలేదని భరత్ ప్రశ్నిచారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో బిసిలకిచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారో రాజమండ్రి సభలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అనేకానేక అంశాలతో దాదాపు 119 హామీలనిచ్చి బీసీలందరినీ మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్ పథకాన్ని నీరుగార్చి బీసీ విద్యార్ధుల అవకాశాలను నీరుగార్చారని, దాదాపు 2 కోట్ల మంది ఉన్న బిసీల్లో 50 వేల మందికి మాత్రమే ఆదరణ పథకం కింద ఎంతో చేశామని ప్రచారంతో మభ్యపెడుతున్నారన్నారు. మత్స్య కారులకు సబ్సిడీ పై డీజీలు ఇస్తామని, చేపల మార్కెటింగ్ , కోల్డ్ స్టోరేజిలు చేస్తామని ఏఒక్కటీ నెరవేర్చలేదనీ, గుజరాత్ కు వలస వెళ్లి, పొరపాటున పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి పాకిస్తాన్ జైల్లళ్లో మగ్గిపోతున్న వారి గురించి ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నిలదీశారు. అంతే కాకుండా చేనేత రంగాన్ని కూడా పూర్తిగా కూనారిల్లేలే చేసనది చంద్రబాబుప్రభుత్వమే అన్నారు. ఇలా బీసీల్లోని అన్ని వర్గాలను నిట్టనిలువునా ముంచిన చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లో ప్రకటించిన పథకాలను కాపీ కొడుతూ, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపుతూ మరోసారి వంచన చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన బాబు తీరుపై నిప్పులు చెరిగారు. అయిదేళ్ల కాలంలో బీసీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకుని పనిచేసిన ,ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల ముందు డ్రామాలను ఎవరూ విశ్వసించరన్నారు.