హెల్త్ యూనివర్శిటీకి వైయ‌స్ఆర్ పేరు స‌మంజ‌స‌మే

అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి

ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది

ఎన్టీఆర్‌ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదు

చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదు

ఎవరూ అడగకపోయినా ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాం

ఏపీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి

రాష్ట్రంలో ఆసుపత్రుల రూపురేఖలు మారిపోతున్నాయి

వైద్య రంగంలో 40,500 మందికి ఉద్యోగాలిచ్చాం

బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం

ఆరోగ్యశ్రీ, 108, 104 అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు వైయస్‌ఆర్‌

వైద్య రంగంలో సంస్కరణల కర్త వైయస్‌ఆర్‌

ఖరీదైన వైద్యాన్ని అందించిన మానవతావాద మహాశిఖరం వైయస్‌ఆర్‌

మూడు మెడికల్‌ కాలేజీలు వైయస్‌ఆర్‌ హయాంలో వచ్చాయి

ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి

అమ‌రావ‌తి: హెల్త్ యూనివర్శిటీకి మ‌హానేత, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు పెట్ట‌డం స‌మంజ‌స‌మేని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారంటే అంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్‌మోహన్‌రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడు. యూనివ‌ర్సిటీ పేరు మార్చడానికి అనేక విధాలుగా ఆలోచించాక.. కరెక్ట్ అనిపించాక అడుగులు ముందుకు వేశానన్నారు. ఏపీలో అమలవుతున్న 108, 104 పథకాలకు సృష్టికర్త వైయ‌స్ఆర్‌,  పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, డాక్టర్ వైయ‌స్ఆర్‌. కుటుంబంలో వ్యక్తి వైద్యం అందక మరణిస్తే కుటుంబం ఎలా తట్టుకోలేకపోతుందో ఆయనకు తెలుసు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు మానవతావాద మహా శిఖరం వైయ‌స్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యరంగంలో వెలిగే సూర్యుడు వైయ‌స్ఆర్‌ . ప్రధానితో సహా అంతా కొనియాడే వ్యక్తి వైయ‌స్ఆర్‌ అన్నారు వైయ‌స్ జగన్. ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలు వున్నాయి. ఇందులో 8 కాలేజీలు టీడీపీ పుట్టకముందే వచ్చాయి. శ్రీకాకుళం, ఒంగోలు, కడప కాలేజీలు పెట్టింది వైయ‌స్ఆర్‌ . మొత్తం 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైయ‌స్ఆర్‌, ఆయన కొడుకు వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటవుతున్నాయి. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. తమ ప్రభుత్వం వుందని తమకిష్టమయిన పేరు పెట్టుకున్నారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? మాకు ఎన్టీఆర్ అంటే కల్మషం లేదు. ఆయన పై అభిమానం వుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. 

ఇంకా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 

ఈ రోజు హెల్త్‌ యూనివర్సిటీకి సంబంధించి గతంలో తెలుగు దేశం పార్టీ నేతలు ఎన్టీఆర్‌ పేరు పెట్టి..ఆ పేరు మార్చి వైయస్‌ఆర్‌ గారి పేరు పెట్టేందుకు తీసుకుస్తున్న అమైన్‌మెంట్‌ బిల్లుకు సంబంధించిన చర్చలో టీడీపీ సభ్యులు కూడా సభలో ఉండి ఉంటే బాగుండేది. సభలో గొడవ చేసి సస్పెండ్‌ అయి వెళ్లి పోవాలన్నదే టీడీపీ నేతల ఉద్దేశ్యం. ఎందుకు ఇలా చేస్తున్నాం..వాటి కారణాలు ఏంటి అన్నది చర్చలో పాల్గొని ఉంటే బాగుండేది. 
ఎన్టీఆర్‌ గారు అంటే చంద్రబాబు కంటే ఎక్కువ గౌరవం వైయస్‌ జగనే ఇస్తారు. ఎన్టీఆర్‌ అంటే నాకు ఎటువంటి కోపం లేదు. ఇప్పుడే కాదు..ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతో ఇంతో ఆయన మీద ఎఫెక్షనే ఉంది. ఆయన్ను ఎప్పుడు అగౌరవ పరచలేదు. నందమూరి తారక రామరావు అనే పేరు పలికితే చంద్రబాబుకు నచ్చదు.చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ పేరు పలికితే పైన ఉన్న రామారావుగారికి నచ్చదు. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు,గొప్ప పేరు ఉంది. గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా కూడా ఏడేళ్లు ఏపీని పరిపాలించారు. చంద్రబాబు వెన్నుపోటుపొడవకుండా ఉంటే భహుషా చాలా కాలం బతికి ఉండేవారు. ముఖ్యమంత్రిగా రెండో టర్మ్‌కూడా పూర్తి చేసేవారు. చంద్రబాబు కూడా ఎప్పటికీ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదు.
ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం, టీడీపీని స్థాపించడం చూశాం. 1995లో తన సొంత అల్లుడు వెన్నుపోటు, దానికి ఈనాడు రామోజీ రావు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డబ్బుల సంచులు మోయడంతో ఎన్టీఆర్‌ మానసిక క్షోభకు గురై అకాల మరణం పొందారు. 
ఎన్టీఆర్‌ మరణించి చాలా కాలం అయినా కూడా..మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా..దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ఎన్టీఆర్‌ను ఏనాడు కూడా ఒక్క మాటకూడా అనలేదు. నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా ఎన్టీఆర్‌జిల్లా పేరు పెడతానని చెప్పడం, ఆ మాట నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టాను.

నా చెల్లెలు మంత్రి రజని చంద్రబాబు, రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణను వీడియో ప్రదర్శన ద్వారా చూపించారు. 2019 ఎన్నికలకు ముందు ఏరకంగా వారిద్దరు మాట్లాడుకున్నారో మనం చూశాం. ఎన్టీఆర్‌ పేరు లేకుండా చేయాలని వారు మాట్లాడారు. ఎన్టీఆర్‌ను ఏమాత్రం గౌరవించకుండా వాడు, వీడు అంటూ సంభాషించారు. ఆయన పేరు ఎందుకు మార్చాలనుకున్నారో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన కూతురును గిప్ట్‌గా ఇస్తే..చంద్రబాబు ఎన్టీఆర్‌కు రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హింసించి, ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఆయన మరణానికి కారకులైన వారు ఈ రోజు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అంటూ నినాదాలు చేయడం ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?
చంద్రబాబు అనేక సార్లు ఆయనకు ఆయనే చెప్పుకుంటుంటారు.

కేంద్రంలో ఆయన చక్రం తిప్పిన రోజుల్లో కూడా మనందరికి గుర్తుకు రావాలని ఆయనంతట ఆయనే చెబుతుంటారు. ఎంతో మందిని రాష్ట్రపతులను, ప్రధానులను చేశానని, చివరికి మోదీ తన కంటే జూనియర్‌ అని చంద్రబాబు నోట్లో నుంచి వచ్చే సరదా మాటలు మనం వినే ఉంటాం. ఎన్నో గొప్ప విషయాలు చెప్పినా కూడా చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారో చెప్పరు. 
అధికారంలో చంద్రబాబు లేనప్పుడు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపొడిచేందుకు సహకరించిన ఈనాడు రామోజీకి కేంద్రం నుంచి అవార్డులు ఇప్పిస్తారు. ఎన్టీఆర్‌కుమాత్రం భారత రత్న అవార్డు ఇప్పించరు. లోపల ఒక మనస్తత్వం, బయట మరోరకంగా ప్రవర్తించే చంద్రబాబు లాంటి వ్యక్తులతో రాజకీయాల్లో చిత్తశుద్ధి కరువైంది.

ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టి వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పు బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. నన్ను నేను కూడా చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. అన్ని ఆలోచించి ఇది కరెక్ట్‌ నిర్ణయం అని అడుగులు ముందుకు వేశాం.

నాన్నగారు వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వతహాగా డాక్టర్‌. ఈ రోజు రాష్ట్రంలో అమలవుతున్న వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, 108, 104 ఈ పథకాలన్నింటికి కూడా సృష్టికర్త ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. నాన్నగారు చదువురీత్యా కూడా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. ప్రారంభంలో కూడా పులివెందులలో ఒక ఆసుపత్రి పెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. పేదరికంలో ఉండే వారి కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన డాక్టర్‌ మహానేత వైయస్‌ఆర్‌ గారు. బతికించిన తెలిసిన డాక్టర్, ప్రాణాల విలువ తెలిసిన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు. ఒక కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద ఆరోగ్యం అందక మరణిస్తే ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్తుందని పూర్తిగా తెలుసుకొని డాక్టర్‌గా ఎలా వైద్యం చేయాలో తెలుసుకుని ఆరోగ్యశ్రీని సృష్టించిన మహానాయకుడు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు. పేదల దగ్గరకు, వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం వైయస్‌ రాజశేఖరరెడ్డి. 
రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఆరోగ్యరంగంలో వెలిగే సూరుడు ఈ రోజు ప్రధాని నుంచి ఆరోగ్యశ్రీని రూపకల్పన చేసి మాట్లాడితే దానికి ఆధ్యుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలు ఏంటన్నది కూడా మనం ఆలోచన చేయాలి. 

ఈ రోజు మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. ఇందులో 8 మెడికల్‌ కాలేజీలు టీడీపీ పుట్టక ముందే వచ్చాయి. మిగతా మూడు కాలేజీలు శ్రీకాకులం, ఒంగోలు, కడపలో ఏర్పాటు చేసింది వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు.ఇప్పుడు మన ప్రభుత్వంలో అంటే వైయస్‌ఆర్‌ కొడుకు ప్రభుత్వంలో మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. 11, 17 కాలేజీల్లో 20 కాలేజీలు వైయస్‌ఆర్‌ వల్లనో, లేక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోఏర్పాటు అవుతున్నాయి. టీడీపీహయాంలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా కట్టలేదు. బలవంతంగా అధికారం ఉందని వారికి కావాల్సిన పేరు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలని అడగడం ధర్మమేనా? 28 కాలేజీల్లో 20 కాలేజీలు కడుతున్న తరుణంలో  వైయస్‌ఆర్‌ పేరు పెట్టకూడదు అనడం ధర్మమేనా? 

క్రెడిట్‌ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్‌ ఇవ్వకపోవడం «దర్మమేనా? .ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో ఎక్కడా కూడా కల్మషం లేదు. ఆయన గొప్ప వ్యక్తి అని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఎవరూ అడకపోయినా విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టాం. ఇంకా ఎక్కడైనా వారు కట్టి ఉంటే ఎన్టీఆర్‌ పేరు పెట్టేందుకు సానుకూలంగా స్పందిస్తాం.  

వైద్యరంగంలో రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు చూడని మార్పులు ఇవాళ జరుగుతున్నాయి. వైద్య రంగంలో నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కుమారుడిగా జగన్‌ నాలుగుఅడుగులు ముందుకు వేస్తున్నాడు. మన ప్రభుత్వం రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 ప్రోసిజర్స్‌ ఉంటే మనం వచ్చాక  2400 ప్రోసిజర్స్‌కు పెంచాం. ఈ అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ఏకంగా 3118 ప్రోసిజర్స్‌ను తీసుకువస్తున్నాం. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మార్చుతున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న పేషేంట్‌ ఎన్ని రోజులు రెస్టు తీసుకుంటారో అన్ని రోజులు నెలకు రూ.5 వేల చొప్పున, రోజుకు రూ.225 చొప్పున ఆరోగ్యఆసరా కింద అందించి తోడుగా ఉంటుంన్నాం. 

ఈ రోజు శిథిలమైన పరిస్థితిలో ఉన్న ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయి. 108, 104 అంబులెన్స్‌లు గతంలో ఫోన్‌ కొట్టినా వచ్చేవి కాదు. అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తున్నాం. 108, 104 అంబులెన్స్‌లను బెంజీ సర్కిల్‌లో జెండా ఊపి అందుబాటులోకి తీసుకువచ్చాం. గ్రామస్థాయిలో వైయస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కమ్యూనిటి హె ల్త్, డిస్ట్రిక్‌ హెల్త్‌ సెంటర్ల రూపురేఖలు మార్చుతున్నాం. మరో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు ఈ రోజు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు పెండింగ్‌ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీఎంపీకి సంబంధించిన మందులు మాత్రమే సరఫరా చేస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలోనే ఈ మూడేళ్లలో 40,500 మందికి ఉద్యోగాలు ఇచ్చి నియమించాం.

అక్టోబర్‌ 15 తరువాత ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత మంది డాక్టర్లు, నర్సులు ఉండాలో కచితంగా అక్కడ ఉండేలా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇదే ఆరోగ్య వైద్య రంగంలో ఉన్న హెల్త్‌ యూనివర్సిటీకి ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి పేరు పెట్టడం సమంజసమని మనస్ఫూర్తిగా భావిస్తూ ..ఎవరిని అగౌరవ పరచడం కాదని తెలియజేస్తూ..ఇంకా వాళ్లకు ఏదైనా క్రెడిట్‌ డ్యూ ఉంటే అడగమని చెప్పండి..అది కూడా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదించాలని కోరుతూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top