మంత్రులుగా చెల్లుబోయిన‌..సీదిరి అప్ప‌ల‌రాజు ప్రమాణం

రాజ్‌భవన్‌లో   కొత్త మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్‌

విజ‌య‌వాడ‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లో భాగంగా ఇద్ద‌రు మంత్రుల‌తో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్త మంత్రులుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజుతో గ‌వ‌ర్న‌ర్  విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌లో  పదవీ ప్రమాణం చేయించారు.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.
► పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన నేపథ్యంలో మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను గవర్నర్‌ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు.
► శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది.

Back to Top