నేడు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

 అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. 

ప్రారంభమైన కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌ ప్రక్రియ
రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట​​కు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చిత్తూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ) ఎన్నిక కానున్నారు. 

కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్‌, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్‌ చైర్‌ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైయ‌స్సార్‌సీపీ ఖాతాలోనే పడనున్నాయి. అన్నింటా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవటం దేశంలోనే ఇదే ప్రథమం.

Back to Top