విజయవాడ: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్ సోమయాజులు స్టే ఇవ్వడంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డారని, దీనిపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి సోమయాజులు స్టే ఇచ్చారన్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.ఈ కేసుల్లో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేసినట్ల అజయ కల్లం తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు అక్టోబర్ 8న అందించినట్లు తెలిపారు.నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.