తిరుమల తరహాలో సింహాచలం క్షేత్రం అభివృద్ధి 

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
 
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి

ఆధ్యాత్మిక భావాలున్నవారికి పాలకమండలిలో చోటు

అమ‌రావ‌తి:  సింహాచలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
అభిప్రాయపడ్డారు.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశాక, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

ప్రజలంతా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా, గిరి ప్రదక్షిణలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సింహాచలంలోని పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని సీఎం వైయ‌స్‌ జగన్ ఇప్పటికే ఆదేశించారని గుర్తుచేశారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పునరుద్ఘాటించారు. ఆధ్యాత్మిక భావాలున్న వారు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేసే వారికే పాలకవర్గంలో చోటు కల్పించాలని సీఎం సూచించారన్నారు. 

Back to Top