చట్టాన్ని మీరి వ్యవహరించ‌వద్దు

వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు
 

అమరావతి : తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. కోర్టు ధిక్కరణ కేసులో సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో పాటు తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

కూల్చివేతకు సంబంధించి.. కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. గురువారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. 

తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉ‍న్న వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ కట్టడం అని సీఆర్డీయే పేర్కొంది. అయితే దానిని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. దీంతో.. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. 

అయినా కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల సాయంతో సీఆర్డీయే జూన్‌ 22వ తేదీ వేకువజామున కూల్చివేతలు జరిపింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. దీంతో సీఆర్డీఏ, మున్సిపల్‌ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Back to Top