అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం 

భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన స‌భ‌లో సీఎం వైయ‌స్ జగన్‌

 భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువు

ప్రతి ప్రాంతం.. ప్రతి గ్రామం.. ప్రతి ఇళ్లు బాగుపడాలనే తపన, తాపత్రయంతో అడుగులు 

ఉత్తరాంధ్ర  రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా మారుతుంది

ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన 

జూన్‌ నెలలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. 

మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి

చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు

చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది

విజయనగరం: అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామ‌ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశామ‌ని, భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంద‌న్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారనుంద‌న్నారు. ఇవాళ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నార‌ని అన్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారు. పైగా మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఇవాళ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్‌ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్‌కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ మారబోతోంద‌ని  సీఎం వైయ‌స్‌ జగన్ స్ప‌ష్టం చేశారు. బుధవారం  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి ప్రసంగించారు. 

 సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:

 ఈ రోజు దేవుడి ఆశీస్సులు కూడా ఎంత మెరుగ్గా ఉన్నాయంటే మంచి వర్షంతో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నట్టున్నాయి. దేవుడి దయతో ఈరోజు ఈ వేదిక నుంచి మరో మూడు మంచి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోబోతున్నాం. 
రెండు కార్యక్రమాలు ఈవేదిక పై నుంచి.. మరో కార్యక్రమం డేటా సెంటర్‌ పనులు ప్రారంభోత్సవం విశాఖపట్నం వేదికగా చేసుకుంటున్నాం.

ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేదిశగా...
ఈ రోజు ఇక్కడ నుంచి జరగబోయే కార్యక్రమాలు ఉత్తరాంధ్ర చరిత్రను రాబోయే రోజుల్లో మార్చాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. ఈ నాలుగు సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి అడుగు ప్రతి ప్రాంతం బాగుపడాలని  వేశాం. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి ఇళ్లూ బాగుపడాలని తపన, తాపత్రయంతో పని చేశాం. 

అభ్యుదయ చిరునామా – ఇకపై అభివృద్ధికి సైతం సంస్కృతి, సాంప్రదాయానికి, కవిత్వానికి, సామాన్యుల వాడుక భాషలో ఉద్యమానికి కూడా చిరునామా ఈ గడ్డ. ఈ కలింగాంధ్ర భావాలు విప్లవానికి గజ్జకట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామా అయిన ఈప్రాంతం ఇకమీదట అభివృద్ధికి కూడా రాబోయే రోజుల్లో చిరునామాగా నిలుస్తుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.

మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రాను బాగు చేయాలని, మనసా, వాచా, కర్మణా గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఈమధ్య కాలంలోనే ఒక నెల తిరక్క మునుపే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్ధాపన చేశాం. ఉత్తరాంధ్రకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతల మార్చబోతుంది. దశాబ్దాలుగా కలలు గన్న ఆ పోర్టు నిర్మాణాన్ని ఏరోజూ ఎవరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశాం. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే.. షిప్పులు కూడా వస్తాయి. 

ఎయిర్‌ పోర్టు – అభివృద్ధి కిరీటం.
ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారం అయితే.. నేడు మనం ఇక్కడ భూమిపూజ చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతుంది.

ఈ రోజు ఇక్కడ వస్తున్న ఎయిర్‌పోర్టు.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ మూడింటికి కూడా దాదాపు సమాన దూరంలో రాబోతుంది.

మరో రెండు మంచి కార్యక్రమాలకూ శ్రీకారం..
ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు కేంద్రబిందువుగా నిలవబోతుంది. ఈ కార్యక్రమంతో పాటు మరో రెండు మంచి కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నాం.
విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు తాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, భోగాపురం విమానాశ్రయానికి కూడా తాగునీటికి అందిస్తూ.. దాదాపుగా 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించే తారకరామతీర్ధసాగరం ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్తూ రూ.195 కోట్లు ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్ధాపన చేస్తున్నాం. 

ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబరు నాటికి పూర్తి చేసి... రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నాం. ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి చేస్తూ చింతపల్లిలో రూ.24 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి కూడా ఇవాళ శంకుస్ధాపన చేశాం.

వైజాగ్‌ –జాబ్‌ హబ్‌.
ఈ మూడు కార్యక్రమాల తర్వాత విశాఖలో ఆదానీ డేటా సెంటర్‌కు కూడా నేడే శంకుస్ధాపన చేస్తున్నాం. ఈ డేటా సెంటర్‌ ద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్‌ మెరైన్‌ కేబుల్‌ కనెక్టివిటీ.. విశాఖపట్నంకు రావడం మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు పోయే శ్రమజీవులుగా గుర్తింపు ఉన్న పరిస్థితి నుంచి.. ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్ధానికంగా, విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికే, ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడుతుంది. 
రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే, ఉద్యోగ ఉఫాధి అవకాశాల కోసం వచ్చే జాబ్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర మారబోతుంది. 

ఒకవైపున శ్రీకాకుళం జిల్లా మూలపాడు పోర్టు, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి. అంతేకాకుండా టూరిజం, మెడికల్‌ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా మనం సాధించాల్సిన ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రాబోయే రోజుల్లో కేంద్రబిందువుగా మారుతుంది. 

మూడేళ్లలో ఎగరనున్న విమానాలు....
ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు  మరో మూడేళ్లలో పూర్తైతే ... 2026 నాటికి ఇదే భోగాపురం నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మరలా మీ బిడ్డ, మీ అన్న ఇక్కడికే వచ్చి.. ఇదే ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తాడు. దేవుడి ఆశీస్సులతో అది కూడా జరుగుతుంది. 

ప్రజలందరి చల్లనిదీవెనలు, దేవుడి ఆశీస్సులు మీ బిడ్డకు ఉన్నంతకాలం ఎవ్వరు, ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేయలేరు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు ఇవాళ పునాదిరాయి వేస్తున్నామంటే.. జీర్ణించుకోలేని వ్యక్తులు అంతా టీవీలో మాట్లాడుతున్నారు. పేపర్లలో చూశాం.

టీడీపీ హయాంలో....
నిజంగా వాళ్ల హయాంలో ఈ స్ధాయి కనుక ఉండి ఉంటే.. ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు అని ప్రశ్నిస్తున్నాను?
సుప్రీం కోర్టులో కేసుల దగ్గర నుంచి హైకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూన్‌లో మొదలైన అనేక కేసులన్నింటినీ దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకునిరాగలిగాం. టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిచేసి.. ఈ రోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్ధాపన చేస్తున్నాం.

ఇవేవీ కూడా పూర్తి కాకుండా.. మరలా ఏమాత్రం సిగ్గు లేకుండా  గతంలోనే మేం శంకుస్ధాపన చేశామని చెప్పుకోవడం.. బహుశా ఇంతకన్నా దారుణమై పరిస్థితులు, రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు.

ఈ రోజు ఎయిర్‌పోర్టుకు అన్నిరకాలైన అడ్డంకులు అధిగమించి, భూసేకరణ పూర్తి చేసుకుని, అన్ని రకాల అనుమతులు తీసుకుని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయి.  వివిధ దశల్లో ఈప్రాజెక్టు పనులన్నీ వివిధ దశల్లో పూర్తవుతాయి.ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఎయిర్‌పోర్టు కూడా విస్తరిస్తూ పోతుంది.
 

అత్యంత ఆధునికంగా ఎయిర్‌ పోర్టు....
ఎయిర్‌పోర్టులో దాదాపుగా రూ. 5 వేల కోట్లతో 2026 నాటికి ఏకంగా 2 రన్‌వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్‌ అవుతుంది. రెండు రన్‌వేలు ఉండే ఎయిర్‌పోర్టులు చాలా అరుదుగా ఉంటాయి. 
7 ఏరో బ్రిడ్జిలు, ప్యాసింజర్‌ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్‌లు, విమాన నిర్వహణ మరమ్మతులు ఎమ్మార్వో యూనిట్, ఏవియేషన్‌ అకాడమీ, ప్లాంట్‌ క్వారంటైన్, యానిమల్‌ క్వారంటైన్‌ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్‌పోర్టు మొదటి దశ 2026 నాటికి రూ.5వేల కోట్లతో పూర్తవుతుంది. మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా సదుపాయాలు సమకూర్చి, ఆ తర్వాత ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల మందికి కూడా సరిపోయే విధంగా ఎయిర్‌పోర్టు డిజైనింగ్‌ జరుగుతుంది. 
ఇక్కడ విమానాశ్రయంలో ఏ–320,  ఏ –380 వంటి డబుల్‌ డెక్కర్‌ ప్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లైట్‌ వంటి భారీ విమానాలు సైతం సునాయాసంగా ల్యాండ్‌ అయ్యే విధంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రెండు రన్‌వేలు ఇక్కడ నిర్మంచబోతున్నాం.

రూ.6300 కోట్లతో ఫోర్‌ లైన్‌ హైవే...
ఈ ఎయిర్‌పోర్టే కాకుండా పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేస్తున్నాం. అంతేకాకుండా ఇదే భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు విశాఖపట్నం నుంచి 6లేన్ల రహదారిని ఏకంగా రూ.6300 కోట్లతో పనులకు మరో నాలుగు నెలల్లో  శ్రీకారం చుట్టబోతున్నాం.
దీనికి సంబంధించి కేంద్రమంత్రి గడ్కరీగారితో మాట్లాడాం.

గడువుకు ముందే పూర్తి చేయాలన్న లక్ష్యంతో...
ఈ భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల ఈ సీపోర్టు, ఈ ప్రాజెక్టులన్నింటి వల్లా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉత్తరాంధ్రాలోనే ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ రోజు ఎయిర్‌పోర్టు పనులను మొదలుపెట్టడానికి జీఎంఆర్‌ గ్రూపునకు సంబంధించిన మల్లిఖార్జునరావు గారు కూడా ఈ వేదిక మీదే ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది. మల్లిఖార్జునరావుగారు ఈ ప్రాంతపు వాసి. నేను వచ్చేముందు అడిగాను. 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ  ప్రాజెక్టు.. దీన్ని ముందుగా చేయగలుగుతామా ?అని అడిగాను. ఇంకా వేగంగా చేయగలుగుతారా ? అన్నాను. దానికి ఆయన నేను ఇక్కడే పుట్టా. ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. శాయశక్తులా కృషి చేస్తా... 30 నెలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తానన్నారు. నాకు నమ్మకం ఉంది ఈ రోజు మొదలైన ఈ ప్రాజెక్టు దేవుడి ఆశీస్సులతో 24 నుంచి 30 నెలల్లోపు పూర్తవుతుంది. ఇక్కడే విమానాలు తిరగడం మొదలవుతుంది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్రమోదీ గారికి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింధియా గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు. 

ఆకాశమంత మనస్సున్న రైతులకు నమస్కారం...
ఈ మొత్తం ప్రాజెక్టు ఒక రూపునకు వస్తుందంటే అందుకు కారణం.. ఇక్కడి రైతన్నలు. 
ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములిచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 

ఇప్పటికే నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి, గూడెపువలస వద్ద 50 ఎకరాలలో రూ.80 కోట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో రెండు పునారావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించి, తరలించింది. ఇవన్నీ నాలుగు సంవత్సరాల కాలంలో జరుగుతూ వచ్చాయి.

ఉత్తరాంధ్రా కోసం మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం వచ్చేలా నాలుగు మాటలు చెప్తాను.

ఉత్తరాంధ్ర అంటే బ్రిటిషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ.  ఆ విప్లవ వీరుడ్ని మర్చిపోలేదు. అందుకే ఉత్తరాంధ్రాలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేశాం. మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగుపరుస్తూ... ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు సరిపోరని.. మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేశాం. ఉత్తరాంధ్రను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేదిశగా అడుగులు వేస్తూ.. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకముందెన్నడూ జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ పనులను మొదలుపెట్టాం, పూర్తి కూడా చేశాం. 
ఈ జూన్‌ మాసంలో అంటే మరో రెండు నెలల్లోపే కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం చేయబోతున్నాం. ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నా...  పాలకులు వచ్చారు. చూశారు, వెళ్లారు. ఏ ఒక్కరూ చిత్తశుద్ధి చూపలేదు. కానీ నిజంగా ఆ కిడ్నీ సమస్యలకు పరిష్కారం లభించి ఉత్తరాంధ్రకు మంచి జరగాలని, ఇచ్చాపురం, పలాస ప్రాంతాలకు తాగునీటిని హిరమండలం నుంచి పైపులైన్‌ వేసి సర్పేస్‌ వాటర్‌ తీసుకునివచ్చే గొప్ప  కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

రూ.965 కోట్లతో తాగునీటి పథకాలు..
రూ.700 కోట్లతో తాగునీటి పథకాన్ని ప్రారంభించాం. మరో రెండు నెలల్లో ఈ జూన్‌లో ఆ రూ.700 కోట్లకు సంబంధించిన తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతున్నాం. అదే రోజున పాతపట్నం నియోజకవర్గానికి కూడా మంచి చేస్తూ.. మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నాం. దానికి కూడా శంకుస్ధాపన చేస్తాం.

చదువుల్లోనూ అగ్రగామిగా....
చదువుల్లో కూడా ముందుండాలని.. ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా చదవాలి, పేదవాడు చదవగలిగితేనే పేదరికం నుంచి బయటకు వస్తాడని నమ్మి ఉత్తరాంధ్రలో ఎప్పుడూ జరగని విధంగా గట్టిగా అడుగులు వేశాం. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతునాయి. పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం, విజయనగరంలలో కూడా మెడికల్‌ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయనగరం మెడికల్‌ కాలేజీను ఈ ఆగష్టు, సెప్టెంబరులో నేనే వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేస్తాను. ఈ నాలుగేళ్ల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఉత్తరాంధ్రలో నాలుగు కొత్త మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం.  

ట్రైబల్‌ యూనివర్సిటీ పనులు
ఒక ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కడుతున్నాం. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటికి కూడా ఈజూన్, జూలైలో శంకుస్ధాపన చేయబోతున్నాం. దాని కోసం మొత్తం భూసేకరణ పూర్తి చేశాం. అది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి.. కేంద్రమంత్రిని కూడా ఇన్‌వాల్స్‌ చేసి దానికి కూడా శంకుస్ధాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. సాలూరు ట్రైబల్‌ యూనివర్సిటితో పాటు విజయనగరం జిల్లాలో జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీని ఇప్పటికే నెలకొల్పాం. ఇవాళ నడుస్తుంది. 

ఈ రోజు శంకుస్ధాపన చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా మరో రూ.6300 కోట్లతో 6 లేన్ల రహదారికి కూడా మరో నాలుగు నెలల్లో శంకుస్ధాపన చేసి దాన్ని కూడా నిర్మించబోతున్నాం.

విశాఖపట్నం ఆమోదయోగ్య నగరం...
వీటన్నింటికన్నా మించి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్ధాయికి మాత్రమే కాకుండా.. రాజధానుల స్ధాయికి కూడా తీసుకెళ్లాలన్నది మనందరి ప్రభుత్వ విధానం అని ఇప్పటికే చెప్పాం. రాష్ట్రంలో అతిపెద్ద నగరమే కాకుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. 
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబరు నుంచి మీ బిడ్డ కాపురం ఉండబోయేది కూడా విశాఖపట్నమే. 

ఒక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా.. ఏ గ్రామం తీసుకున్నా... ఏ కుటుంబాన్ని తీసుకున్నా కూడా మీ బిడ్డ పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు, మనకు ఓటు వేసారా ? లేదా  ? అన్నది కూడా చూడకుండా పేదలకు అండగా నిలబడాలని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. 
కాబట్టి ఈ 47 నెలల కాలంలోనే ఏకంగా దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా చూడని విధంగా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు.

గతానికి, ఇప్పటికీ తేడా చూడండి. మీ జగన్‌కు గతంలో ఉన్న ఆ చంద్రబాబుకు తేడా ఏమిటంటే..

మీ గడప వద్దే అడుగుతున్నాం...
 నేను ఈ రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలను మీ ఇంటికి వచ్చి... మీ గడప ముందు నిల్చుని మనందరి ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ మీకు అందాయా ? అని ఏ కుటుంబాన్నైనా ప్రేమగా, ఆప్యాయతగా అడగగలను. 
చివరకి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని కూడా.. వారి గడప వద్దకు వచ్చి అంతే ఆప్యాయంగా వారిని అడగగలను. 
మనందరి ప్రభుత్వంలో మీ అన్న పాలనలో పథకాలు అందితేనే మీకు మంచి జరిగి ఉంటేనే ఆశీర్వదించండి.  చంద్రబాబు గారి ఐదేళ్ల పాలన కంటే మన ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి. నాకు తోడుగా నిలవండి అని నిజాయితీగా, చిత్తుశుద్ధితో అడగగలుగుతున్నాం.

ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా ఇదే మాట గర్వంగా చెప్పగలుగుతున్నాం. రైతన్నలను తీసుకున్నా, బడులకు పోయే పిల్లలను తీసుకున్నా, నా అక్కచెల్లెమ్మలను తీసుకున్నా, అవ్వాతాతలను తీసుకున్నా గర్వంగా వాళ్ల దగ్గరకివెళ్లి చెప్పగలుగుతాం. మీ ఇంట్లో మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, నాకు తోడుగా నిలవండి అని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి గర్వంగా చెప్పగలుగుతాం.

98.5 శాతం మేనిఫెస్టో హామీలు అమలు దిశగా...
మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి హయాంలో మాదిరిగా 600 పేజీల బుక్కులు ప్రింట్‌ చేసి  .. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితి కాదు. 
98.5 శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం కాబట్టే... మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండని, నాకు తోడుగా నిలవండి అని అడగగలుగుతున్నాం.  ఆ అడిగే అర్హత, నైతికత కానీ మీ బిడ్డ.. మీరిచ్చిన ఈ అధికారం, దేవుడు దయతోమెండుగా చేయగలిగాడు.

మరి ఇదే మాట చంద్రబాబు నాయుడుగారు అడగగలరా ? ఇదే మాట అనగలడా ? ఇదే చంద్రబాబు నాయుడు మీకు మొహం చూపించగలడా ? అని అడుగుతున్నాను.

28 ఏళ్లలో బాబు వల్ల జరిగిన మంచేంటి ? 
1995లో అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబువల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి మంచి జరిగిన మంచి ఏమిటి ? అని అడిగితే, చెప్పడానికి ఈ పెద్ద మనిషి దగ్గర ఏం లేదు. అదే 2019లో దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల సీఎం అయిన మీ బిడ్డ, మీ జగన్‌ వల్ల మీకు మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటంటే.. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ కుటుంబాన్ని అడిగినా మా జగన్‌ మాకు ఈ మంచి చేశాడని చెప్పే పరిస్థితి ఈ రోజు ప్రతి ఇంట్లోనూ ఉంది.

మరి ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరందరికీ ఒక దత్తపుత్రుడు వీరంతా ఎందుకు మద్ధతిస్తున్నారు అంటే, దానికి కారణం... మనందరి ప్రభుత్వంలో మీ జగన్‌ ఇక్కడ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో బటన్లు లేవు, నొక్కేది లేదు.

బాబు హయాంలో దోపిడీ...
ఆయన హయాంలో జరిగిందేమిటంటే... జన్మభూమి కమిటీల దగ్గర మొదలై ఒక ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, టీవీ5కి ఇంత, దత్తపుత్రుడికి ఇంత అని దోచుకో, పంచుకో, తినుకో అని ఈ గజదొంగల ముఠా డీపీటీ ద్వారా రాష్ట్రప్రజలను, రాష్ట్రాన్ని దోచేశారు.
అందుకే  ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఇంతగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉన్నారు.  ఓ దత్తపుత్రుడు అండదండలు ఇస్తూ ఉన్నాడు. 

నా నమ్మకం మీరే...
మీ బిడ్డ దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను నమ్ముకున్నాడు. చంద్రబాబు నమ్ముకున్నది ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని.  వారి పునాది అబద్ధం, మోసం.
నాలుగేళ్లుగా ఇంటింటికీ మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపు ఉంటే.. నలభై ఏళ్లుగా ఏ మంచీ చేయని ఈ పెద్దమనిషి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ రాష్ట్ర ప్రజలను దోచుకున్నవారంతా కూడా మరోవైపున ఉన్నారు. 

ఒకవైపున పేదవాడి ప్రభుత్వం ఉంటే... మరోవైపున పెత్తందార్లకు మద్ధతు తెలిపే పార్టీలు ఉన్నారు. పేదవాడికి ఇంగ్లిషు మీడియం చదువులు చెప్పించాలని తపన పడే మనం ఒకవైపున ఉంటే... పేదవాడికి ఇంగ్లిషు చదువులు రాకూడదని అడ్డుకునే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. 

పేదవాళ్లకు, నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా నేరుగా బటన్‌ నొక్కి మంచి చేయాలని తపన పడే మీ జగన్‌ ఒకవైపున ఉంటే.. మరోవైపున ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆ అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వకూడదు, వారికి మంచి జరిగినా, ఇళ్ల పట్టాలిచ్చినా ఏకంగా సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాళ్లంతా ఒకవైపు ఉన్నారు. ఆలోచన చేయండి.

నేడు మారిన గ్రామాలు....
ఈ రోజు గ్రామాలు మారాయి. ఏ గ్రామం లో నాలుగు అడుగులు వేస్తే.. గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏ గ్రామంలో చూసినా 50 మందికి ఒక వాలంటీర్‌ కనిపిస్తాడు.  సచివాలయ వ్యవస్ధలో మన పిల్లలే చిక్కటి చిరునవ్వుతో లంచాలు తీసుకోకుండా, వివక్ష చూపకుండా మంచి పనులు చేస్తున్నారు. మరోనాలుగు అడుగులు వేస్తే.. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, నాడు నేడు ద్వారా రూపురేఖలు మారి కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌ లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ను మన గ్రామానికి తీసుకొచ్చి నడిపిస్తున్నాయి. ఇంకో నాలుగు అడుగులు వేస్తే రైతన్నను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే కనిపిస్తుంది. రైతన్నలకు మేలు చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్ధ ఇది.
మరో నాలుగు అడుగులు దూరంలో డిజిటల్‌ లైబ్రరీలు కొన్ని గ్రామాల్లో కడుతున్నాం.. మరికొన్ని గ్రామాల్లో కట్టబోతున్నాం. మన పిల్లలకు వర్క్‌ ఫ్రం హోం ద్వారా ఇంటి దగ్గర నుంచే పనిచేసే వ్యవస్ధ ఏర్పాటు కాబోతుంది. ఇవన్నీ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి అక్కడ నుంచి రాజధాని స్ధాయి వరకు ప్రతి అడుగులోనూ మార్పు కనిపిస్తోంది. 

ఇదే ప్రభుత్వం, ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు చూస్తే.. అప్పట్లో చంద్రబాబునాయుడు గారు చేసిన అప్పులు శాతం కన్నా మీ బిడ్డ అప్పులు ఇంకా తక్కువే చేస్తున్నాడు. మరి ఈ పనులన్నీ మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. ఎందుకు గతంలో చంద్రబాబునాయుడు గారు చేయలేకపోయారు ? ఆలోచన చేయండి. ఇటువంటి ఆలోచనలు చేయడమే కాకుండా.. వీటన్నింటినీ గ్రామస్ధాయిలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని మిమ్నల్ని కోరుతున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనలు మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మంచి జరగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. 

కాసేపటి క్రితం
నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ.. 
మరికొన్ని పనులు కావాలని అడిగారు. కందివలస గెడ్డ మీద బ్రిడ్జి నిర్మాణం, దీనికి అనుబంధంగా చింతపల్లి, మెంటాడ మధ్య రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చవుతుంది.. ఇది కావాలన్నారు.  దాన్ని మంజూరు చేస్తున్నాను. దారపురెడ్డి పాలెంవద్ద చంపావతి నదిపై కాజ్‌వే నిర్మాణం కోసం రూ.2 కోట్లు కావాలన్నాడు.  అదీ మంజూరు చేస్తున్నాను. బట్టి కాలువ మరమ్మతులు కోసం మరో రూ.1.50 కోట్లు కావాలన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. తుమ్మలపేట– గరికపేట బీటీ రోడ్డు కోసం మరో రూ.2.50 కోట్లు, కొండవెలగాడ– రాళ్లవాకకు బీటీ రోడ్డుకు మరో రూ.2.50 కోట్లు, భోగాపురం మరియు పూసపాటిరేగ మండలాలలో 46 తీర ప్రాంతా గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కోసం రూ. 35 కోట్లు ఖర్చవుతుందన్నాడు. ఇది చాలా అవసరం అన్నాడు. ఇవన్నీ మంజూరు చేస్తున్నాం. అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top