తాడేపల్లి: సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్‌సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్‌జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది.