ప్రతి సభ్యుడి హక్కులు కాపాడాని నిర్ణయం తీసుకున్నాం

అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి

తాడేప‌ల్లి: అసెంబ్లీలో ప్రతి సభ్యుడి హక్కులు కాపాడాని నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ సభా హక్కుల కమిటీ భేటీ అయింది. అనంతరం కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌పై ఇవాళ విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారి వివరణ కోసం పది రోజుల సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారని తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభలో చేసిన తీర్మానం ఆధారంగా రిఫర్ చేశారని కాకాణి తెలిపారు. ఈ అంశంపై చర్చించి వివరణ కోరామని, కమిటీ ముందుకు నాలుగు అంశాలు మాత్రమే వచ్చాయని, వాటిపై విచారణ జరిపామని తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, చినఅప్పలనాయుడు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌పై కమిటీ విచారణ చేపట్టింది. టీడీపీ ఫిర్యాదులు విచారించలేదన్నది అవాస్తవమని, కమిటీ సమావేశంలో టీడీపీ సభ్యుడు కూడా ఉన్నారన్నారు. ఆ సభ్యులు కూడా తమ నిర్ణయంతో ఏకీభవించారన్నారు. టీడీపీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేసిందని తమ దృష్టికి తెచ్చారని, స్పీకర్‌ ఎప్పుడు రిఫర్ చేస్తే అప్పుడు విచారిస్తామని పేర్కొన్నారు.

Back to Top