నెల్లూరు: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కాంలో కుట్రపూరితంగా ఎంపీ మిథున్‌రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరు నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జరగని కుంభకోణంలో ఆధారాలు ఎలా సృష్టించాలో అర్థం కాక సిట్ అధికారులే తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఒక పథకం ప్రకారం స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ లిక్కర్ స్కాంను టీవీ సీరియల్ మాదిరిగా అల్లుకుంటూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో వైయస్ఆర్‌సీపీని అడ్డుకోవాలని అనుకోవడం చంద్రబాబు, లోకేష్‌ల తెలివితక్కువ తనమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఏడాది పాలనతోనే వచ్చిన ప్రజా వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ప్రజా సమస్యలపై మాజీ సీఎం వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి కూటమి నాయకులు ఓర్వలేకపోతున్నారు. అందుకే మాజీ మంత్రి వైయస్ జగన్‌కి అండగా ఉంటున్నారనే కారణంతో జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతున్నారు. లిక్కర్ లో రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ఆ తర్వాత అంచలంచెలుగా రూ30 వేల కోట్లు, రూ. 20 వేల కోట్లు, రూ. 5 వేల కోట్లు, రూ. 3 వేల కోట్లంటూ తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.2 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు అధికారులను బెదిరించి తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు తప్ప లిక్కర్ కుంభకోణం జరిగినట్టు నిరూపించే ఆధారాలు ఆధారం ఒక్కటీ లేదు. ఇందులో భాగంగానే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ శాఖతో ఎంపీ మిథున్ రెడ్డికి కానీ, ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ ఎలాంటి సంబంధం లేదు. లిక్కర్ కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు నిరూపించే ఆధారం కూడా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారమూ లేదు. పెద్దిరెడ్డి కుటుంబం వైయస్ జగన్‌కి అండగా ఉంటుందన్న కారణంతోనే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్నిఎదుర్కోలేక చంద్రబాబు కక్ష పెంచుకున్నాడు. గతంలోనూ చంద్రబాబు సీఎంగా 2017లో మిథున్‌రెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేసినా తప్పు ఒప్పుకుని విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడూ అదే జరుగుతుంది. చంద్రబాబు హయాంలోనే లిక్కర్ కుంభకోణం 2019-24 మధ్య కాలంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో లిక్కర్ ఆదాయం తగ్గినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ పాలనలో ఆదాయం రూ. 16,500 కోట్లయితే, వైయస్ జగన్ 2024లో దిగిపోయే నాటికి లిక్కర్ ఆదాయం రూ.24 వేల కోట్లకు పెరిగింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులను నడపడంతో ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకి చేరుకుంది. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా సగటున 3 కోట్లకు పైగా కేసుల మద్యం విక్రయం జరగ్గా వైయస్ జగన్ గత ఐదేళ్ల పాలనలో సగటున లిక్కర్ అమ్మకాలు 2.7 కోట్ల కేసులు మాత్రమే. పైగా గత చంద్రబాబు పాలనలో డిస్టిలరీలకు ఎంతైతే చార్జీలు విధించారో అదే చార్జీలను వైయస్ఆర్‌సీపీ హాయంలోనూ వసూలు చేయడం జరిగింది. కానీ గత చంద్రబాబు పాలనలో కన్నా వైయస్ జగన్ పాలనలో ఆదాయం రూ. 8 వేల కోట్లు ఎక్కువగా నమోదైంది. లిక్కర్ షాపుల సంఖ్య పరంగా చూసినా చంద్రబాబు హయాంలో 4 వేలున్న లిక్కర్ షాపులను వైయస్ జగన్ 2 వేలకు తగ్గించారు. చంద్రబాబు హయాంలో 20 డిస్టిలరీలుంటే కేవలం 6 డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు ఇచ్చేవారు. కానీ వైయస్ జగన్ పాలనలో అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అదీకాకుండా 2019-24 మధ్య వైయస్ జగన్ ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు మాత్రం 2019-24 మధ్య 14 కొత్త డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఈ లెక్కలను బట్టి చూస్తే డిస్టిలరీల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి తన జేబులు నింపుకున్నాడని ఎవరికైనా అర్థమైపోతుంది. ఎక్కువ ఆదాయం తీసుకొస్తే పారదర్శకతతో అమ్మకాలు జరిగినట్టా..? తక్కు ఆదాయం వస్తే పారదర్శకత ఉన్నట్టా? దీనిపై నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు నాటి సీఎం చంద్రబాబు మీద వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కక్షతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లేని లిక్కర్ స్కాంను సృష్టించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. లిక్కర్ కేసు దర్యాప్తు చేసేది ఎల్లో మీడియానా? ఇక్కడ విచిత్రం ఏంటంటే లిక్కర్ స్కాం దర్యాప్తును కూడా పోలీసులు చేయడం లేదు. సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్‌ను పిలిపించుకుని ఆయన సలహాతో, ఆయన మార్గదర్శకాలతో వైయస్ఆర్‌సీపీ నాయకులే టార్గెట్‌గా కథలను రూపొందించి అరెస్టులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు లాయర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనిచేస్తోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థనేది లేనట్టు తామే దర్యాప్తు చేసినట్టు ఎల్లో మీడియా ఎవరెవర్ని అరెస్టు చేస్తారో కథనాలు రాస్తుంది. ఎస్పీ స్థాయిలో పోలీసులు అధికారులు సైతం ఈ ప్రభుత్వంలో పనిచేయలేక రాజీనామా చేసి వెళ్లిపోతున్నారంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. కక్షపూరిత రాజకీయాలతో అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన తాత్కాలికంగా ఆనందం పొందొచ్చేమో గానీ వైయస్ఆర్‌సీపీ పోరాటాలను అడ్డుకోలేరు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వైయస్ఆర్‌సీపీ భయపడిపోతుందని అనుకోవడం కన్నా అవివేకం ఉండదు. అధికారం చేతిలో ఉంది కదా అని వైయస్ జగన్ పర్యటనలకు రాకుండా హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు. అంతకుమించి ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పకుండా ఆపలేరని గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.