ఆక్వా యూనివర్శిటీ మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది

పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 

న‌ర‌సాపురం:  ఆక్వా యూనివర్శిటీ మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంద‌ని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్  శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

అందరికీ నమస్కారం, ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎంగారు ఇక్కడికి వచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం. గతంలో ఏ నాయకుడు కూడా మత్స్యకారుల జీవితాల్లోకి తొంగిచూసిన పరిస్ధితి లేదు. సముద్రంలోకి వెళ్ళి ఉప్పునీటి మీద తిరిగొస్తామో లేదో అన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు నేను విన్నాను, నేను ఉన్నాను అనే వరకూ సాగింది. సీఎం హోదాలో మత్స్యకారుల తోలు తీస్తాం, ఫినిష్‌ చేస్తామన్న వారి నుంచి మత్స్యకారులను అక్కున చేర్చుకున్న ప్రతి అంశంలో కూడా వారిని ముందుపెడుతున్న ఈ సీఎం వరకూ చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన సీఎం మన ముందు ఉన్నారు. మత్స్యకార భరోసా, డీజిల్‌ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా ఇలా ప్రతి మత్స్యకారుడికి అన్ని పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం ఇది. ఏ మత్స్యకారుడు కూడా వలస వెళ్ళకూడదని హార్బర్‌లు మంజూరు చేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో, బాపట్ల జిల్లా నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో హార్బర్‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగానే ఈ రోజు బియ్యపుతిప్ప హార్బర్‌ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రాంట్‌ ఇవ్వలేమంటే సీఎంగారు ఒక్క మాట చెప్పారు. కేంద్రం సహకరిస్తే వారి సహకారంతో చేద్దాం లేదంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేద్దామన్నారు. ఆక్వారంగంలో ఒడిదుడుకులు చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్ధితి, సీఎంగారు స్ధిరమైన సంకల్పంతో రైతుకు మంచి జరగాలి, కచ్చితమైన ధర నిర్ణయించి రైతుకు మంచి జరగాలని, నష్టం జరగడానికి వీల్లేదని కచ్చితమైన ధరను నిర్ణయించిన ప్రభుత్వం మనది, ప్రతి రైతు మొహంలో ఆనందం చూస్తున్న ప్రభుత్వం ఇది. ఈ జిల్లాలో ఆక్వా యూనివర్శిటీ మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ప్రపంచానికే దిక్సూచిగా మారబోతుంది. ప్రతి మత్స్యకారుడి తరపునా మీకు ధన్యవాదాలు.

Back to Top