అనంతపురం : హంద్రీనీవాను వెడల్పు విస్తరణ చేయడంతోనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. సీమ ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని కోరారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ‘‘ రాయలసీమ అంటేనే కరువుకు నిలయం. ఇక్కడ వలసలు ఎక్కువ. రైతుల ఆత్మహత్యలూ ఎక్కువే. సీమ సస్యశ్యామలం కావాలన్నా, బాగు పడాలన్నా నీరు చాలా అవసరం. దశాబ్ధాల క్రితం నుంచి రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తేనే ఉపయోగమని అనేక పోరాటాలు జరిగాయి. ఇక్కడి భూములు సారవంతమైనవి. తుంగభద్ర నుంచి మనకు నీరు వస్తున్నా ఎగువన అనేక డ్యాంలు నిర్మించడం వల్ల ఆ నీరు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే శ్రీశైలం నుంచి కృష్ణా జలాల కోసం పోరాటాలు జరిగాయి. అందరూ మాటలకు పరిమితం అయితే వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా పనులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే 2012 నుంచి జీడిపల్లికి కృష్ణా జలాలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు కావాలని పోరాటలు జరుగుతూనే ఉన్నాయి. హంద్రీనీవా కాలువను 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వితే 2200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు నిర్ణయం తీసుకున్నారు. టెండర్లు కూడా జరిగాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యాక 6300 క్యూసెక్కులకు గానీ, అంతకంటే ఎక్కువకు గానీ చేస్తారనుకుంటే 3850 క్యూసెక్కులకే పరిమితం చేస్తున్నారు. మరోవైపు గోదావరి జలాలను బెనకచెర్లకు తీసుకొచ్చి పోతిరెడ్డి ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అంటున్నారు. ఈ నిర్ణయం సంతోషమే. కానీ బెనకచెర్ల నుంచి డైరెక్ట్‌గా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీళ్లు రావు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీళ్లు తీసుకెళ్లాలంటే ఏకైక మార్గం హంద్రీనీవా మాత్రమే. ఈ హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీలు కాకుండా 70 నుంచి 80 టీఎంసీలకు వరకు తీసుకురావాలంటే తప్పకుండా వెడల్పు చేయాల్సిందే..! మొదటి ఫేజ్‌లో 3850 క్యూసెక్కులకు చేస్తాం.., రెండో ఫేజ్‌లో లైనింగ్ చేస్తాం అంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది. భవిష్యత్‌లో రాయలసీమ జిల్లాలకు నీరు ఎక్కువగా రావాలంటే హంద్రీనీవాను వెడల్పు చేయాలి. గతంలో తుంగభద్ర డ్యాం నుంచి మన బార్డర్‌లోకి 106 కిలోమీటర్ల మేర లైనింగ్ చేయడం వల్ల నేడు హెచ్‌ఎల్‌సీ వెడల్పు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. హంద్రీనీవా విషయంలో అలా చేయొద్దు. ఫస్ట్ ఫేజ్‌లో 3850 క్యూసెక్కులకు కాకుండా 10 వేల క్యూసెక్కులకు చేయండి. రాజకీయాలు ఏమైనా ఉంటే మళ్లీ చూసుకుందాం. ఏ పార్టీ అధికారంలో ఉందని కాకుండా ఈ ప్రాంతం ముఖ్యమని భావించండి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీమ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా వెళ్లి సీఎం చంద్రబాబుతో మాట్లాడండి. లైనింగ్ పనులు చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా మళ్లీ వెడల్పు చేయలేం. దయచేసి సీమకు నష్టం చేయద్దని కోరుతున్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడి ప్రస్తుతం సీఎం రేవంత్, ప్రతిపక్ష నాయకుడు హరీష్‌రావు తీరు మనకు అన్యాయం చేసే విధంగా ఉంది. శ్రీశైలం నుంచి ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ నీరు తీసుకెళ్తే అంత ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అందరూ ఆలోచించి లైనింగ్ కాకుండా హంద్రీనీవాను వెడల్పు చేయండి. లైనింగ్ కోసం వెచ్చిస్తున్న నిధులతోనే వెడల్పు చేయండి. ప్రస్తుతం హంద్రీనీవా నుంచి వస్తున్న నీళ్లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నాం. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయండి. ఆయకట్టును స్థిరీకరించండి. హంద్రీనీవా వెడల్పు, లైనింగ్ విషయంలో ఈఎన్‌సీ, ఇంజనీరింగ్ అధికారులకు వాస్తవాలన్నీ తెలుసు. వాళ్లు సీఎం చంద్రబాబుకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక వేళ చెప్పినా అయన పట్టించుకోవడం లేదా?.. ఇప్పటికైనా హంద్రీనీవాను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసి లైనింగ్ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నా’’ అని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.