గుంటూరు: హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని తెలిపారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని అంబటి రాంబాబు విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు. ‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారు. హిందూ సంప్రదాయల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.