రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే

రాజధాని ముసుగులో బాబు విషప్రచారం

 మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) 

 గుంటూరు:  రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిందేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే సోమవారం పెనుమాక నుంచి ర్యాలీకి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాజధాని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములు ఇచ్చిన వారికి కూడా ప్లాట్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని ముసుగులో 25 రోజులు విషప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులను, దళితులకు చేసిన అన్యాయాన్ని బయటకు రానీవకుండా చూసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కలిసి రాజధాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడులో గతంలో జరిగిన ఘటన వీడియోను సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి రాజధానిలో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం​ చేశారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ తమ నిర్ణయాన్ని ఇంకా వెలువరించలేదన్నారు. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ అధికార ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా గత 25 రోజులుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. 
 

తాజా వీడియోలు

Back to Top