తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆకాశమంత ఎత్తయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించుకోనున్నామని, ప్రజాస్వామ్యవాదులంతా తరలిరావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ పిలుపునిచ్చారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: – విజయవాడ నడిబొడ్డున వైయస్ జగన్ గారి చేతుల మీదుగా ఆకాశమంత∙ఎత్తయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించుకోనున్నాం. – ప్రపంచమేధావి, గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దేశ చరిత్రలో ఒక గొప్ప చిహ్నం. – భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉండాలో రూపొందించి, ప్రపంచానికి భారతదేశ రాజ్యాంగాన్ని చాటిన ఒక యోధుడి విగ్రహాన్ని రేపు జగన్ గారు ఆవిష్కరించబోతున్నారు. – అంబేద్కర్ పిలాసఫీని ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేస్తున్న వైయస్ జగన్ గారు అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి ఆదర్శం అని చాటి చెబుతున్నారు. – నేను ఒంటరి యోధుడ్ని అని అంబేద్కర్ చెప్పేవారు. దేశంలో జాతి, కుల, వర్ణ వివక్షను పటాపంచలు చేసే చట్టాలను ఆయన నిర్మిస్తే.. ఆయనిచ్చిన చట్టాలను జగన్ గారు ఏపీలో నిలువెత్తు సాక్షిగా అమలు చేస్తూ, అట్టడుగు వర్గాలకు ఆలంబనగా నిలిచారు. – అణగారిన వర్గాలకు అండగా నేనున్నానని... వైయస్ జగన్ గారు డీబీటీ ద్వారా ఆ వర్గాల పేద ప్రజలకు నేరుగా రూ.2.46 లక్షల కోట్లను అందించిన అంబేద్కర్ వారసుడు. – పేద వర్గాలు వైయస్ జగన్ గారిని భుజానికెత్తుకుని ఈయనే అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చాడు. – అంబేద్కర్ ఆశయాలను తన పాలనలో అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్ గారు. – అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రాష్ట్రమంతా కదులుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు హాజరుకానున్నాను. – ఇది మనకు ఒక పండుగ. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరుపై నిర్వహిస్తున్న పెద్ద పండుగ ఇది. – ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఒక సమానత్వాన్ని అందించే అంకురార్పణగా ఈ కార్యక్రమాన్ని చూడాలి. – మీకు నచ్చిన పండుగను ఎలా చేసుకుంటారో అలానే ఈ విగ్రహావిష్కరణ పండుగను కూడా నిర్వహించుకోవాలని ఒక దళితుడిగా నా సూచన. – పాలకులంతా అంబేద్కర్ ఆలోచనలోకి రావాలనే ఒక రణనినాదాన్ని వైయస్ జగన్ గారు రేపు మోగించబోతున్నారు. – అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకున్న మనకు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం మనమంతా తలెత్తుకునేలా ఉంది. – ఇంతకాలం సమానత్వం, స్వేచ్ఛ కోసం ఉద్యమాలు జరిగాయి. ఈ విగ్రహావిష్కరణ మన వెయ్యేళ్ల భవిష్యత్తుకు అంకురార్పణ కానుంది.