వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్ర

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

వివేకానందరెడ్డి హత్య వెనుక చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డి హస్తం

సిట్‌పై నమ్మకం లేదు..అందుకే సీబీఐతో విచారణ జరపాలి 

రాజారెడ్డి హత్యలో టీడీపీ ప్రమేయం 

 వైయస్‌ఆర్‌ను ఫినీష్‌ అవుతావని బాబు అన్నారు..రెండు రోజులకే దుర్మారణం

వైయస్‌ జగన్‌పైనా హత్యాయత్నం జరిగింది

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్రపన్నిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1998 నుంచి వైయస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఇది దారుణమైన హత్యగా తేలిందన్నారు. కుటుంబ సభ్యులు  దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. 1998లో వైయస్‌రాజారెడ్డి హత్యలో టీడీపీ ప్రమేయం ఉందని స్పష్టమైందన్నారు. నిందితులకు టీడీపీ ఆఫీస్‌లో రక్షణకల్పించారని గుర్తు చేశారు. ఆగస్టు 31, 2009వ సంవత్సరంలో చంద్రబాబు అసెంబ్లీలో ఏం మాట్లాడరో చూశామన్నారు. ఏం జరుగబోతుందో చూడండి..అన్నారని, ఆ తరువాత రెండు రోజుల్లోనే దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దుర్మారణం పొందారన్నారు.

వైయస్‌ జగన్‌పై కూడా విశాఖ ఏయిర్‌ పోర్టులో హత్యాప్రయత్నం జరిగిందన్నారు. ఈ ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని స్పష్టంగా తేలిందన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి బయటకు రాకుండా మేనేజ్‌ చేసుకున్నారన్నారు. వివేకానందరెడ్డి జమ్ములమడుగు నియోజకవర్గానికి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్నారని, నిన్న రాత్రి ప్రచారంలో పాల్గొని పులివెందులకు వెళ్లారన్నారు. తెల్లవారకముందే ఆయన్ను హత్య చేశారన్నారు. 2014లో వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎన్నికైన ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి నీతి, విలువలకు కట్టుబడకుండా నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి మనిషి జాతిలో పుట్టాల్సిన వ్యక్తి కాదన్నారు. దుర్మార్గుడు అన్నారు. ఈ హత్యలో చంద్రబాబు, లోకేష్‌ అని పేర్కొన్నారు. అమలు పరిచింది మంత్రి ఆదినారాయణరెడ్డి అని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని అంతం చేయాలనే దుర్భుద్ధి వీరికి ఉందన్నారు.

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ ఎలాంటి ప్రకటన చేశారో..ఆ తరువాత చంద్రబాబు ఎలా హేళనగా మాట్లాడారో చూశామన్నారు. గతంలో పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా హత్య చేశారన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్య వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు. వివేకానందరెడ్డి హత్య ఘటనను సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ డీజీ పరిధిలో పని చేస్తుందని, ఈ విచారణతో నిజాలు వెలుగులోకి రావన్నారు. సీబీఐకి కేసు అప్పగించాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని తెలిపారు. వైయస్‌ వివేకానందరెడ్డి భౌతికాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 

Back to Top