వైయ‌స్ జ‌గ‌న్‌కు జైకొట్టిన జ‌నం

ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ సర్వేలో వెల్లడి
 
వైయ‌స్ఆర్‌సీపీకి ప‌ట్టం క‌ట్టిన ఏపీ ప్ర‌జ‌లు
 
22 లోక్‌సభ సీట్లు ఆ పార్టీవే.. టీడీపీకి దక్కేది మూడే

కేంద్రంలో ఎన్డీయేకు సాధారణ మెజారిటీ

బీజేపీకి స్వతహాగా 238 సీట్లు..కాంగ్రెస్‌కు 82

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 14, కాంగ్రెస్‌కు 2 సీట్లు

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ  సత్తా చాటుతుందని మరోసారి తేలింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని తెలిపింది.

2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది.

2014 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 16 స్థానాలు, అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్న ఎస్పీ 18 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ రాష్ట్రంలో 2014లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలుపొందిన బీజేపీ ఈసారి  40 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.  మార్చి 1–7 మధ్య దేశవ్యాప్తంగా 193 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 20 వేల మంది పురుషులు, 18 వేల మంది మహిళల నుంచి సమాచారం సేకరించారు.
  

Back to Top