ఫ్యాన్ ప్ర‌భంజ‌నం

ఏపీలో వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభంజనం.. 

సీపీఎస్‌ సర్వేలో వెల్లడి

121 – 130 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం

21 ఎంపీ సీట్లు కైవసం

45 నుంచి 54 ఎమ్మెల్యే,4 ఎంపీ సీట్లకే టీడీపీ పరిమితం 

అమ‌రావ‌తి: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే స్పష్టం చేసింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్‌ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2006 నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలన్నీ నిజమవుతూ వస్తున్నాయి.

 రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రభంజనం సృష్టించనుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. కాగా, అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది. జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్‌ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2009 నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలన్నీ నిజమవుతూ వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీపీఎస్‌ సర్వే ఫలితాలు పూర్తిగా నిజమయ్యాయి. 

తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉండనుందనే అంశంపై సీపీఎస్‌ సంస్థ రెండు దశల్లో సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి దశ సర్వేలో 4,37,642 మంది అభిప్రాయాలను సేకరించింది. మార్చి 27 నుంచి 31వ తేదీ మధ్య రెండో దశ సర్వేలో 3,04,323 మంది అభిప్రాయాలను సేకరించింది. అంటే మొత్తం 7,41,965 శాంపిల్స్‌ సేకరించి శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. అనంతరమే సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు సుధీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రజల అభిప్రాయాలు, ఇక్కడ ఎన్నికల ఫలితాలపై తమ సర్వే వివరాలను వేణుగోపాలరావు వెల్లడించారు. 

ఏపీలో ఎన్నికల ఫలితాలపై మీ సర్వే ఏం చెబుతోంది? 
ఏపీలో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించనుంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. మేము ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో టీడీపీ కంటే  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 4 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ కంటే  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 8 శాతం అధికంగా ఓట్లు సాధించనుందని స్పష్టమైంది. 2014లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 1.60 శాతం ఓట్లతో వెనుకబడి అధికారానికి దూరమైంది. ఇప్పుడు ఏకంగా 8 శాతం ఓట్లు అధికంగా సాధించనుందంటే ఆ పార్టీకి ఎంత భారీ మెజార్టీ రానుందో ఊహించుకోవచ్చు. 

మీ సర్వే ప్రకారం ఏపీలో ప్రధాన పార్టీలు ఎంత ఓట్ల శాతం సాధించనున్నాయి? 
 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 48.1 శాతం ఓట్లు రానున్నాయి. టీడీపీకి 40.1 శాతం ఓట్లు వస్తాయి. జనసేన 8 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. 

ప్రత్యేక హోదాను ఈ ఎన్నికల్లో కీలక అంశంగా ఎవరూ పరిగణించడం లేదనిపిస్తోంది కదా? 
అది కొంతవరకు నిజమే. కానీ ప్రత్యేక హోదా విషయంలో  వైయ‌స్‌ జగన్, చంద్రబాబుల  వైఖరిని ప్రజలు పోల్చిచూస్తున్నారు. ఆ విషయంలో జగన్‌ పట్లే విశ్వసనీయత వ్యక్తమవుతోంది. ఆయనకు 90 శాతం ప్రజామోదం లభిస్తుండగా, చంద్రబాబు పట్ల కేవలం 10 శాతమే ఉంది. 

వైయ‌స్ జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది ప్రజలపై ప్రభావం చూపించడం లేదా? 
చంద్రబాబు చేస్తున్న ఆ ప్రచారం క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ ఏపీలో పోటీ చేయడం లేదు. ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు. తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఏపీలో లేదు. అక్కడ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. అక్కడ టీడీపీ–కాంగ్రెస్‌ తరపున చంద్రబాబు ప్రచారం చేశారు. అందుకే కాంగ్రెస్‌కు ఓటేస్తే అమరావతికి ఓటేసినట్లేనన్న కేసీఆర్‌ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆ పరిస్థితి ఏపీలో లేనేలేదు. ఏపీ ప్రజలు జగన్‌కు ఓ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు మా సర్వేలో వెల్లడైంది. జగన్‌  పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. 

వైయ‌స్ జగన్‌ అవినీతిపరుడని టీడీపీ ప్రచారం చేస్తోంది కదా? 
అది ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధానాంశంగా లేదని మా సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఐదేళ్లలో భారీగా అవినీతికి పాల్పడిందని ప్రజలు గుర్తించారు. అదేవిధంగా జగన్‌ వస్తే రౌడీయిజం వస్తుందంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. అవే ఆరోపణలు 2014లో టీడీపీకి  కొంత లాభించాయి. మళ్లీ అలాంటి ఆరోపణలనే చంద్రబాబు ఎన్నిసార్లు, ఎన్ని ఎన్నికల్లో చేస్తూ ఉంటారని ప్రజలే తిరిగి ప్రశ్నిస్తున్నారు. 

జనసేన ప్రభావం ఎలా ఉండనుంది? 
పవన్‌ కల్యాణ్‌ 8 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఆ ఓట్లు కూడా  ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచే వచ్చే వీలుంది. ఆ పార్టీ ప్రభావం ఆ మూడు జిల్లాలకే పరిమితం. జనసేన ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకునే అవకాశం మాత్రమే ఉందని మా అంచనా. 

ఏపీలో ఏ పార్టీ ఎన్నిసీట్లు గెల్చుకోవచ్చని మీ సర్వేలో తేలింది? 
 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 121 నుంచి 130 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుంది. టీడీపీ 45 నుంచి 54 సీట్లకు పరిమితమవుతుంది. జనసేన ఒకట్రెండు సీట్లు మాత్రమే దక్కించుకుంటుంది.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ 4 ఎంపీ సీట్లు గెల్చుకుంటుంది. జనసేనకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదు.  

నాయకత్వంలో జగన్, చంద్రబాబు పట్ల ప్రజాభిప్రాయం ఏమీటి ? 
ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుల నాయకత్వ పటిమే ప్రధానాంశం కానుంది. రాష్ట్రంలో 46 శాతం మంది ప్రజలు జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు పట్ల 39 శాతం మంది మొగ్గు చూపుతున్నారు.  

చివరి మూడునెలల్లో సంక్షేమ పథకాలా ?
గత రెండు వారాల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్ల శాతం భారీగా పెరగడానికి కారణమేమిటి? 
జగన్‌ విస్తృతంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ఎన్నికల ప్రచారమే ప్రధాన కారణం. అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పూర్తిగా తేలిపోతున్నారు. ఆయన చేతులెత్తేశారు. అసలు చంద్రబాబు ఎన్నికల ప్రచార వ్యూహమే తప్పు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల, టీడీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని అందరికీ తెలుసు. కానీ, ఆయన ఆ విషయాన్ని వదిలేసి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్, నరేంద్ర మోదీ ఒక్కటేనని చెప్పి, ఏపీ సమస్యలకు వారిద్దరే కారణమనే ప్రచార వ్యూహాన్ని అనుసరించడమే పెద్ద తప్పు. ఇక చివరి ప్రయత్నంగానే చంద్రబాబు మూడు నెలల్లో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అవి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ప్రత్యేక హోదా అంశంలో ఆయన యూటర్న్‌ తీసుకోవడం కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన యూటర్న్‌ బాబుగా మరింత అపఖ్యాతిపాలయ్యారు. 

డ్వాక్రా సంఘాల మొగ్గు వైఎస్సార్‌సీపీ వైపే
డ్వాక్రా సంఘాల మొగ్గు ఎటువైపు ఎంతగా ఉంది? 
డ్వాక్రా సంఘాల మహిళల్లో 45.2 శాతం మంది వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. టీడీపీ పట్ల 44 శాతం మంది అనుకూలంగా ఉన్నారు.

Back to Top