ఫిబ్రవరి : కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కృష్ణాపురం ఉల్లి ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేపీ ఉల్లిపై నిషేధం తొలగించి రైతులను ఆదుకోవాలని కోరుతూ గత నవంబర్‌లోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు కేపీ ఉల్లిపై ఉన్న నిషేధాన్ని తక్షణమే తొలగించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలోని జీరో అవర్‌లో కేపీ ఉల్లి ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు నిషేధం ఎత్తివేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించి ఆ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించారు. కేపీ ఉల్లి రైతులకు అండగా నిలబడి ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు నిర్విరామంగా కృషి చేసినందుకు రైతు సంఘాల నేతలు ఈరోజు ఢిల్లీలో వైఎస్సారీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డిని స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతు సంక్షేమమే మా లక్ష్యం. అదే మా విధానం అని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కృష్ణాపురం ఉల్లిపాయలు రాష్ట్రంలోని కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మాత్రమే రైతులు పండిస్తుంటారు. కేపీ ఉల్లిపాయలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ ఉల్లిపాయలను దేశీయంగా వంటకాల్లో ఉపయోగించరు. కేవలం విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే రైతులు వీటిని పండిస్తుంటారు. ఇటీవల అసాధారణంగా పెరిగిన ఉల్లిధరల కారణంగా అన్ని రకాల ఉల్లిపాయల ఎక్స్‌పోర్ట్సుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ప్రభావం రైతులపై పడడంతో కేపీ ఉల్లిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని సీఎం వైయస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కేపీ ఉల్లిపాయల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.