వైయస్ఆర్..ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. మహానుభావుడు.. అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. 2009.. సెప్టెంబర్ 2. ఒక దుర్దినం. తెలుగుజనం గుండెమీద బండ పడ్డ దినం. నిరంతరం తమ గురించి, తమ మేలు గురించి ఆలోచించే ఓ పాలకుడిని కోల్పోయిన రోజు. పదమూడేళ్లు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. ఆ నవ్వుల రేడు...సంక్షేమసారధి లేడుగానీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. జోహార్ వైయస్ఆర్ వర్షం గురించి కలవరించే మనిషి. ఊరూరా వర్షం లెక్కలు వేసుకునే ముఖ్యమంత్రి. జలసిరులతో పంటలు బాగా పండాలని, రైతన్నల గడపల్లో సంతోషం వెల్లివిరియాలన్నది నిరంతర తపన. వైఎస్సార్ దగ్గర పనిచేసిన అధికారులు తరచూ గుర్తు చేసుకునే విషయమిది. వర్షం పడుతుంటే కిటికీ పక్కన చేరి హర్షాతిరేకం ప్రకటించే వైయస్ఆర్ కన్నా రైతుబంధువు ఎవరుంటారు? పదమూడేళ్ల క్రితం ఆ సెప్టెంబర్ 2న కూడా అదే రోజు. మేఘాలు పట్టాయి. రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోవాలని బయలు దేరారు. వర్షం మొదలయిందో.. ముందే దుశ్శకునం పలికిందో ఆకాశం భోరుమంది. వైయస్ఆర్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాలగుట్టలో కూలింది. అంతా అన్వేషణ. రాజన్న తిరిగొస్తాడన్న ఆశ. ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదునిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలెన్నో... గుండెలాగిపోయిన బతుకులెన్నో.. కాలం ఆగిపోలేదు. కదలిపోతూనే వుంది. పదమూడేళ్లపోయినా రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా. ఎక్కడ అభివృద్ది జాడలు కనిపించినా...ప్రాజెక్టులు కనిపించినా రాజన్న పేరే తలపుకొస్తుంది. తన ముందు తన తర్వాత కూడా ఏ నాయకుడూ తలపెట్టలేనని పథకాలను ప్రవేశపెట్టిన ఆ ఘన చరిత్ర చరిత్ర పుటల్లో చెరగని ముద్ర. రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైయస్ రాజశేఖరరెడ్డిది బలమైన ముద్ర. ఆయన జీవితం ప్రజలతో ముడిపడిపోయింది. అది విడదీయలేని బంధం. అంతే కాదు, వైయస్ఆర్ హయాంలో ప్రతి పేదకుటుంబానికి జరిగిన మేలెంతో ఉంది. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్యరంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ వైయస్సార్ ప్రజలకు చేసిన మేలెంతో! హిమగిరి ఎవరెస్టే అందుకు ప్రామాణికం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది.. వైఎస్సార్ జీవనసిద్దాంతం. అందుకు అనుగుణంగానే ఆయన జీవించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కలవరించి, పలవరించారు. రాష్ర్టరూపురేఖలను తీర్చిదిద్దే క్రమంలో నిరంతరం శ్రమించారు. హరితాంధ్రప్రదేశ్‌ను స్వప్నించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కోసం అద్భుతాలు చేశారు. ఆదర్శాంధ్రప్రదేశ్ సాధనలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ దార్శనికుడు. పేదబిడ్డల పెద్దచదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైయస్..తన పాదయాత్ర దారిలోనే సంకల్పించారు. చదువులు చదివితే..ఉద్యోగాల్లో స్థిరపడితే, ఆ పేదింట తలరాతే మారిపోతుందన్నది ఆయన దార్శనికత. ఆలోచనను అద్భుతరూపంలో తీర్చిదిద్దారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదింటబిడ్డల పెద్దచదువులకు దీపం వెలిగించారు. వైయస్సార్ హయాంలో లక్షలాది మంది పేదింటబిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. తమ తలరాతలే మార్చుకోవడమే కాదు, కుటుంబాల తలరాతలు మార్చారు. ఆ పథకం లబ్దిపొందిన కుటుంబాల్లో నేటికీ వైయస్సార్‌ను తలచుకోనిదే పొద్దుగడవదు. ఆ మహానుభావుడి చలవే ఇదంతా.. అన్నది లబ్దదారుల గడపల్లో ఓంకారమైన ధ్వనిస్తుంటుంది. నిరుపేదల సంజీవని రాజీవ్ ఆరోగ్యశ్రీ. అనారోగ్యం ఎవరికైనా ఒకే విధమైన బాధ కలిగిస్తుంది. కానీ పేదవాడికి అది పెనుశాపమై పీడిస్తుంది. వైయస్‌కు ముందు పేదల అనారోగ్యబాధల గురించి పెద్దగా ఆలోచించిన నాయకులు లేరు. బీద,బిక్కి, అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. ఒక డాక్టర్‌గా రోగి బాధ తెలిసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, పేదలకు ఆరోగ్యభద్రతపై శ్రద్దపెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట బీదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ధనవంతులతో సమానంగా కార్పొరేటు స్థాయి ఆస్పత్రులలో ఉచితంగా వైద్యసౌకర్యాలు అందగలిగాయి. ఆ పథకం ద్వారా నాడు.. నేడు లబ్దిపొందిన.. పొందుతున్నవారు లక్షలాదిమంది. లక్షలాది కుటుంబాలకు అది పెద్ద భరోసా. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా 104 మొబైల్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ విప్లవాత్మక పథకాలు అనితరసాధ్యమైనవి. అసలు సిసలు ప్రజానాయకుడి మాత్రమే వచ్చే ఆలోచనలవి. ఇలా ప్రజాజీవితాల్లో.. మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకాలెన్నో వైయస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్నవే. ప్రజాసంక్షేమమే శ్వాసగా జీవించినవాడు వైయస్ఆర్ .. ఆయన రాజకీయాల్లో వేసిన ప్రతి అడుగూ.. ఆ దిశగానే సాగాయి. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన సంక్షేమపథకాలు, చేసిన అభివృద్ది పనులు గుర్తు చేసుకుంటే.. ఇదంతా మరొకరి వల్ల సాధ్యమయ్యేదేనా? అనిపించకపోదు. ప్రజాసేవలో అనుక్షణం తపించిపోయిన వైయస్సార్ సంకల్పబలం ఆయనకు మాత్రమే స్వంతమైనది. ఎన్నెన్ని పథకాలు.. ఊరువాడా, పట్టణాల తలరాతలు మార్చేశాయో! రాజశేఖరుడు జననేత. వారికేం కావాలో ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించారు. ప్రజాసంక్షేమమే శ్వాసగా పరిపాలన సాగించారు. అరకొరగా పథకాలను అమలు చేయడం కాకుండా.. సంతృప్తస్థాయిలో అందరికీ అన్నీ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా ఆయన తొలిసంతకం ఉచితవిద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీపై సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు తొమ్మిదేళ్ల కరవు నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకున్నారు. ఆ పాఠాలతోనే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను ఒడిసి పట్టి రిజర్వాయర్లలో నిలిపితే, కరవు సమయంలో రైతన్నలను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు నీరందంచాలన్నదే ఈ అపరభగీరధుడి లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆయన ఇచ్చిన వరం పావలా వడ్డీ. మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకే ఈ పధకాన్ని ఇచ్చినా, ఆ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు కేటాయించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్నది రాజన్న లక్ష్యం. మహిళల ఆర్ధికస్వావలంబనే కుటుంబాల వెలుగు అన్నది ఆయన ఆలోచన. అలాగే ఏ ఆసరాలేని వృద్దులు, వితంతువులు, వికలాంగులు..ఇలా దాదాపు 70లక్షల మందకి ఫించను పథకాన్ని విస్తరించడమే కాదు, నెలనెలా అందేలా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ ,మహిళలకు అభయహస్తం. నిరుపేదలకు రూ.2కే కిలోబియ్యం ఇలా ఎన్నెన్నో పథకాలు విజయవంతంగా అమలు చేసిన వైయస్సార్‌ను ఒకే ఒక్కడు అనక తప్పదు. కలలు అందరూ కంటారు. కానీ అవి సాకారం అయ్యేలా శ్రమించడం కొందరే చేస్తారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఐదేళ్ల పాలనా కాలం పాలకులకుల ఆదర్శప్రాయం. రాజశేఖరరెడ్డికి ప్రజల మనసు తెలుసు. ప్రజలకు ఏం కావాలో తెలుసు. అభివృద్ది ఎంత అవసరమో తెలుసు. దానికోసం ఏ స్థాయిలో కృషి చేయాలో తెలుసు. సమర్ధపాలనకు వైయస్సార్ కేరాఫ్ అడ్రస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షనేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశస్థాయిలో గుర్తింపు పొందారు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించాలో చాటి చెప్పిన రాజకీయ నాయకులలో వైయస్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షనేతగా వైయస్ ప్రజల హృదయాల్లో నాటుకొనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వైయస్ఆర్ జనహృదయనేత.. జనహృదయాలను గెలిచిన నేతలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేందుకు వైయస్ఆర్ ఓ ఉదాహరణ. ఆయన ఓ లెజెండ్ ఆఫ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ఆయనది ఒకే తీరు. ప్రజాసమస్యల పరిష్కారమే ఆయన ప్రధాన ఎజెండా. అనాథలను, అభాగ్యులను ఆదరిస్తూ...అభివృద్ది ఫలాలకు నోచుకోని మట్టిబిడ్డల అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన జనహృదయనేత వైయస్సార్. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని ధృఢమైన వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిది. నమ్మినవారికి ప్రాణాలు అడ్డువేసే ఆయన వ్యక్తిత్వమే కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చింది. అత్యంత జనాకర్షణ ఉన్న నేతగాపేరు సంపాదించిపెట్టింది. పేదలు, రైతులు, చేను, చెట్టు, మట్టి, గ్రామీణం, వ్యవసాయం ఇవి వైయస్‌కు ఇష్టమైన పదాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్తులకు పెద్ద చదువులు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందచేసిన నిజమైన విద్యాధికుడు, డాక్టర్ వైయస్సార్. రెండురూపాయల బియ్యం, వృద్దులకు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు, అర్హులందరికీ తెల్లకార్డులు, బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన అండదండలు, అన్నింటికీ మించి ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ది, నిబద్దత తిరిగి రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా... రైతులు, సేద్యం, పేదలు, అభివృద్ది ప్రాతిపదికగా సాగిన వైఎస్ పాలనకు వరుణుడు మనసారా సహకరించారు. ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మనుషుల్ని ప్రేమించడమెలాగో వైఎస్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. అది ఆయనకు సహజంగా అబ్బిన గుణం. మాటంటే మాటే. పోరాటమంటే పోరాటమే. అంతే....ధైర్యం, సాహసం, పట్టుదల, రిస్క్ తీసుకోవడం, ఆలోచనలతో తాత్సారం చేయకపోవడం.. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడం, జనాన్నినమ్మడం లాంటి ప్రతేక లక్షణాలకు పెట్టింది పేరు.. వైఎస్సార్. నేను ఏ నాటికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలను. ఆ విశ్వాసం నాకుంది అని.. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజుల్లోనే వైయస్ఆర్ ఎక్కువగా అంటూ వుండేవారట. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలని స్వప్నించిన వైఎస్.. అందుకనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలెట్టారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం అలవరచుకున్నారు. ఊరికే కలవడం కాదు, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, తనకు వీలయినంత సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడాలన్న సిద్దాంతం వైయస్సార్‌ది. ఆ విషయంలో రాజశేఖరుడి చిత్తశుద్దిని శంకించలేనిది. మండుటెండాకాలంలో నాటి వైయస్సార్ పాదయాత్ర ఆయన్న జనహృదయాలకు మరింత దగ్గర చేసింది. అది కరువు కాలం. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఆత్మహత్యల స్థాయి దాటి ఆకలిచావులు ముంచుకొచ్చాయి. గ్రామీణులు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులవారు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు..ఇలా అన్ని వర్గాలు, రకరకాల పీడలు, పీడనల్లో నలిగిపోయాయి. సంప్రదాయ గ్రామీణ ఆర్ధికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. మొత్తానికి పల్లెలు కన్నీరు పెడుతున్న వేళ వైయస్సార్ పాదయాత్రికుడయ్యారు. 1400కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆ కష్ణకాలంలో ప్రజలకు నేనున్నానన్న భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని శపథం చేశారు. వైయస్ఆర్ ను జనం నమ్మారు. ఆయన్ను, ఆయన పార్టీని 2004లో అఖండ మెజారిటీతో గెలిపించారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ ప్రజలకు చేయని మేలంటూ లేదు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ వెంటే నిలిచారు జనం. అన్ని రాజకీయపార్టీలు ఒక్కటైనా, ఒకే ఒక్కడుగా వైఎస్సార్ తన పార్టీని గెలిపించారు. రెండోసారి వైయస్ఆర్ ముఖ్యమంత్రి కావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత వందరోజుల పాటే ఆయన పాలన సాగింది. విశాలాంధ్రప్రదేశ్ అదృష్టం అక్కడితో ఆగింది. వైఎస్సార్‌లాంటి ప్రజలమనిషి, ఆత్మీయమూర్తి అరుదుగా ఉంటారు. నూటికో..కోటికో ఒక్కరు అంటారే, అలాగన్నమాట. వ్యవస్థ ఏదైనా కావచ్చు. పాలకుడి విధానాల్లో స్పష్టత, ఆచరణలో చిత్తశుద్ది ఉంటే ప్రజల జీవన స్థితి ఎలా మెరుగుపడుతుందో అన్నదానికి, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఓ ఉదాహరణ. ఆయన దూరదృష్టి, దార్శనికత భవిష్యత్తుకు మార్గదర్శి. ఆయన మహానాయకుడు. మరిచిపోలేని మన రాజన్న చిరస్మరణీయుడు.