తలెత్తిన పాలన...తలకిందులవుతున్న ప్రతిపక్షం

 వ్యవసాయరంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ అన్నింటా ముందు ఉంది. రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ...ఏపీ ప్రభుత్వం ఆదర్శప్రాయమైన నిర్ణయాలే తీసుకుంటోంది. ఇది జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వానికి దక్కిన కితాబు. సామాజికరంగంలోనూ ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ దిశలో గట్టి అడుగులే వేస్తోంది. ఏడునెలల పాలనను పూర్తి చేసుకుని, ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టిన కొత్త ప్రభుత్వం...చెప్పాలంటే, చాలా తక్కువకాలంలోనే ప్రజాసంక్షేమానికి సంబంధించి చాలా పథకాలను అమలులోకి తెచ్చింది. ఆ విషయంలో దేశంలోనే మరే రాష్ట్రం ఇంత వేగంగా, ఇంత ఎక్కువగా పనిచేసింది లేదనే చెప్పవచ్చు అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. 
కొత్త సంవత్సరం మొదటి రోజున ...ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్టుగానే ఆర్టీసిని ప్రభుత్వంలోకి విలీనం చేసిందీ గవర్నమెంటు. దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కలను సాకారం చేసింది. ఆర్టీసీలోని 51, 488మంది ఉద్యోగులకు ఉద్యోగభద్రత వచ్చింది. ప్రజారవాణా వ్యవస్థగా మారిన ఈ సంస్థను అత్యంత సమర్ధంగా నడపాలని, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మంచిని అందించాలన్నది రాష్ట్రప్రభుత్వం సంకల్పం. అదే సమయంలో రైతుభరోసాకు సంబంధించి ఈ సంవత్సరానికి ఆఖరు విడత సాయం కూడా అందించింది. అది సంక్రాంతి పండుగ కానుకగా అన్నదాతలు భావిస్తున్నారు. జనవరి 9 అమ్మ ఒడి పథకం అమలులోకి రాబోతోంది. మొదటి సంవత్సరం ఆర్థిక సాయం అర్హులందరికీ అందబోతోంది. ఇక కేవలం రెండువందల పది రోజుల్లోనే నవరత్నాలకు సంబంధించిన అన్ని హామీలను ఏకబిగిన అమలు పరిచిన ఈ ప్రభుత్వం తన చిత్తశుద్దిని గట్టిగానే చాటుకుంది. కోట్లజనం ఆశల్ని...ఆకాంక్షల్ని ప్రతిఫలించింది. ప్రజాశ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్న ఏకైక కర్తవ్యదీక్షతో ముందుకు సాగుతున్న యువముఖ్యమంత్రి సారధ్యంలోని ప్రభుత్వం...అభివృద్దికి సంబంధించిన విషయాల్లోనూ చాలా ఫోకస్‌గానే వ్యవహరించాలని నిర్ధారించుకుంది. అభివృద్ది దిశలో రాష్ట్రం ప్రగతి సాధించాలని, ఆర్థికంగా బలపడాలని అందుకు తగ్గ ప్రణాళికల కసరత్తు చేస్తూ..గొప్ప దార్శనికతతో ముందుకు తీసుకుపోవాలని తపిస్తోంది. స్థిరమైన అభివృద్ది విషయంలోనే దేశంలోనే మూడోస్థానాన్ని సంపాదించగలిగింది. 
ఐదుకోట్ల మందికి పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విషయంలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం...ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ..వాటిని అమలుచేస్తూపోతూ వుంటే, మరోవైపు రాష్ట్రరాజధాని పేరిట అలజడి నిజంగా ఆలోచింపచేసేదే. ఇందులో అసలు విషయం కోసం జరుగుతున్న ఆరాటం, పోరాటం కన్నా, ఒక రాజకీయ అవకాశంగా ఉపయోగించుకోవాలన్న ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం దుర్నీతే స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ...వైయస్‌ జగన్‌పై వెల్లువెత్తిన ప్రజాభిమానం దెబ్బకు కుదేలైపోయిన తెలుగుదేశం పార్టీ, కొన్ని నెలలపాటు దిమ్మతిరిగి, తలవాల్చేసి ఉండిపోయింది. ఎన్నికల్లో ఓటమిని సరిగ్గా విశ్లేషించుకోవడం పక్కన పెట్టి, తనదైన దుర్మార్గపు రాజకీయ ఆలోచనలతో ఇప్పుడు మెల్లగా తల ఎత్తుతోంది. బుసకొట్టడం మొదలైంది. అసలు ప్రజాతీర్పే తప్పని చెబుతోంది. తప్పుచేసిన ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారని, కాపాడడానికే తాను తరలివచ్చినట్టు సీనియర్‌ పొలిటీషియన్‌ చంద్రబాబుగారు వాగుతుంటే, చేసిన పాపం వెనకాల నీడలా పాకుతోందని నిజం ఈయనకెప్పుడు తెలియాలబ్బా అనిపిస్తోంది.  
వర్షాలు అపారమై...జలరాశులతో అటు నదులు పరవళ్లు తొక్కితే...నిండిన నీటితో రిజర్వాయర్లు కళకళలాడిపోతున్నాయి. సేద్యరంగం మరోసారి పాడిపంటల సిరులకు గ్యారంటీగా నిలిచింది. ఓవైపు వ్యవసాయరంగం అభివృద్ది పట్ల ప్రభుత్వం శ్రద్దకు,   ప్రకృతి కరుణింపు తోడయింది. జలవనరుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో మరింత పకడ్బందీగా ఆలోచించేందుకు, ఈ కాలం అవకాశం కల్పించింది. రాష్ట్రప్రభుత్వమూ ఆ పనే చేస్తోంది. దిక్కుతోచని దివాళాకోరు రాజకీయాలతో అటు టీడీపీ, ఇటు జనసేన వీధులకెక్కి రచ్చచేయడం మినహా, నిర్మాణాత్మక కార్యక్రమాలేవీ చేపట్టకపోవడం విషాదం. ఆ పార్టీలను, ఆ నేతలను మరింతగా వీధిపాలు చేసే బాగోతం. 
పాదయాత్ర నాడు ప్రజాసంకల్పాన్ని తలపెట్టిన వైయస్‌ జగన్, తన పాలనా కాలంలో ప్రజాసంక్షేమమే మహాసంకల్పంగా తలకెత్తుకున్నారు. ఆయనది తిరుగులేని దీక్ష అని...రాబోయే రోజుల్లో వచ్చే మంచి ఫలితాలే ప్రకటించబోతున్నాయి. ప్రజల ఆశీర్వాదబలం మెండుగా ఉన్న ప్రభుత్వమిది. అనుకున్నది సాధించి తీరుతుంది. 
 

Back to Top