ప్రజలకు భరోసానవుతా...

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నర్సీపట్నంలో పాదయాత్ర జరిగినప్పుడు జోరున వర్షం కురిసింది. అయినా, జనం అంతులేని జనం. ఈరోజు..మార్చి17న, నర్సీపట్నంలో మొదటి ప్రచారసభ జరిగినప్పుడు ఎండమండిపోతోంది. అయినా అదే అంతులేని జనసందోహం. చెక్కుచెదరని జనాభిమానం. జగన్‌ అంటే జనం. జనం అంటే జగన్‌ అన్నది మళ్లీ మరోసారి కళ్లకు కట్టింది నర్సీపట్నంలో ప్రచారసభ దృశ్యం. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్‌ ఉమాశంకర్‌ గణేష్‌ను, అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి వెంకటసత్యవతిని గెలిపించాలని ప్రజలను కోరారు జగన్‌. పార్టీ ఎన్నికల చిహ్నం ఫ్యాను గుర్తును చూపారు. 

ఉదయం ఇడుపుల పాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర ప్రార్థన చేసుకుని, ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎంపీ అభ్యర్థుల పేర్లను నందిగాం సురేష్‌తోనూ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ధర్మానప్రసాదరావులతో చదివించారు. 

జగన్‌ను చూడగానే జనం హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. పాదయాత్ర దారిలో తాను చూసిన ప్రజల కష్టాలు, విన్న బాధలను జగన్‌ ప్రస్తావిస్తూ తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టడం ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఆ మాటల్లోని నిజాయితీ వారిని కదిలించింది. నేను విన్నాను. నేను వున్నాను. నేను చూశాను. సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మనిషికి అండగా వుంటానంటూ గట్టిగా హామీ ఇచ్చారు వైఎస్‌ జగన్‌. 

అధికారపార్టీ ఐదేళ్ల పాలనలోని ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతూనే, శాంతిభద్రతల వైఫల్యంపై మండిపడ్డారు. స్వంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యపై బాధను వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలోని లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులను బాబు ఎంతగా దిగజార్చాడో వివరించారు. 

రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతామని, సుపరిపాలన అందిస్తామని, విద్య,వైద్యం రంగాల్లో, సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ది పనుల్లో రాష్ట్రం ముందంజలో వుండేలా ఐదేళ్లపాలన కొనసాగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కులపిచ్చిలేని పాలన అందిస్తామని, అన్నికులాలకు, మతాలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడం సభికులను ఆకట్టుకుంది. 

స్పష్టంగా, సూటిగా, జనం గుండెల్ని తాకేలా సాగిన జగన్‌ ప్రసంగం... ఎన్నికల జైత్రయాత్రలో ధ్వనించిన తొలి సింహనాదం. 

 

Back to Top