అమరావతి: కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్‌ను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్–1, జనవరి 2024లో టన్నెల్–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైయస్ఆర్ కలలను సాకారం చేశాం. ఇంకా ఆర్ అండ్ ఆర్ (రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లోనే దానికి కావాల్సిన సుమారు రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చు. ఆర్ అండ్ ఆర్ కోసం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్ అండ్ ఆర్‌పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ, నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించ లేదు. గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి, నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ.1000 కోట్లు చెల్లించి, పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ.250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. బ్రహ్మసాగర్‌కు కూడా రూ.60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగు గంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగాం. తద్వారా 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగాం. ఎప్పుడో పూర్తైన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్‌ను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదు. దాని కోసం కూడా రూ.140 కోట్లను మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం 46 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ప్రస్తుతం కరవు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ మీదుగా కడలిపాలు అవుతున్న నేపథ్యంలో వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై దృష్టి పెట్టాలని, వెంటనే ఈ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కింద చెల్లింపులు చేసి ఈ సీజన్‌లోనే నీటిని నింపి సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.