చంద్రబాబుకు ఎప్పుడు ‘తెలివి’ వచ్చింది? 

అమ‌రావ‌తి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలూ తనవే అనుకున్నారట. తానెప్పుడూ కులం గురించి మాట్లాడలేదట, ఆలోచించలేదట. ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడు టీడీపీలో చేరిన సందర్భంగా ఈ మాజీ ముఖ్యమంత్రి శ్రావణ శుక్రవారం రోజున చెప్పిన బంగారు పలుకులివి. ఇంత వరకూ బాగానే ఉంది. కులాభిమానం లేదా కుల వివక్ష ఎప్పుడూ మంచిది కాదు. నిజమే. కాని, చంద్రబాబు ఇంకా చాలా ముందుకు వెళ్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తిట్టిపోశారు. జనసేన నేతను కాపులతో, తనను కమ్మలతో తిట్టిస్తున్నారంటూ వాపోయారు. ఏ పార్టీ నేతపై ఏ కులానికి చెందిన నాయకుడితో విమర్శలు చేయించాలో తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు ఒక గ్రంథం రాస్తే బావుంటుంది. ఎందుకంటే, ఏ కులానికి చెందిన నేతను ఏ కులం నేతతో తిట్టిస్తున్నారనే విషయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ ఆలోచించలేదు. ఆ దృష్టితో చూడలేదు. తాను సీఎంగా ఉండగా హైదరాబాద్‌ నగరానికి ఎంతో శ్రమించి కంపెనీల మీద కంపెనీలను రప్పిస్తే ఒక్క కులం వారికే మేలు జరిగిందా? అంటూ చంద్రబాబు గారు అమాయకంగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ రాజధానికి కుప్పలు తెప్పలుగా వచ్చిన పెట్టుబడుల వల్ల ఏఏ కులాలకు చెందిన సంపన్నులు, పేదలు లబ్ధిపొందారో ఆర్థికవేత్తలు, సామాజికశాస్త్రవేత్తలను అడిగితే సరైన జవాబులు లేదా సమాచారం వస్తుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఏ పరిణామం సంభవించినా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలూ ప్రయోజనం పొందితేనే సమ్మిళిత ప్రగతి అవుతుంది. ఈ విషయం నారా వారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయానుభవంతో చెప్పాల్సిన అవసరం లేదు. 
వినేవాళ్లుంటే...ఎన్ని కథలైనా చెబుతారు! 

మరి ఈ కులభేదాలు పోవాలంటే ఏం చేయాలో అన్ని రాజకీయపక్షాలు కలిసి ఆలోచించాలేగాని మాజీ సీఎం మాదిరిగా ఆవేశపడి రంకెలేస్తే ప్రయోజనం ఉండదు. ‘మిమ్మల్ని ఎవరైనా కులం అడిగితే, చెప్పు చూపించండి ,’ అని పిలుపు ఇచ్చిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇదే పని చేసి ఉంటే బావుండేది. కుల నిర్మూలనకు మహానుభావుడు బాబాసాహబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చూపించిన దారి వదిలేసి, బాబు గారు చెప్పిన ‘ చెప్పు చూపించే’ పనిలో పడితే ఆంధ్రదేశం ఎటు పయనిస్తుందో ఊహించడం కష్టంకాదు. ఎంతైనా తనకు ఇష్టమైన ఊరుగా ప్రచారం చేసుకున్న అమరావతి వచ్చినప్పుడల్లా తెలుగుదేశం నేతకు పూనకం వస్తుంది. ఈ పూనకంలో ఆయన ఏమైనా మాట్లాడతారు. వినేవాళ్లుంటే వింత వింత పరిష్కార మార్గాలు వెల్లడిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top