ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కన్నీటి సుడులతో ముంపు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా బాధితులు బయటకు వస్తున్నారు. పాలు, మందులు, నిత్యావసర సరుకుల కోసం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులను ఎత్తుకున్న తల్లులు, వృద్ధులను భుజాలకు ఎత్తుకుని మరికొందరు, వికలాంగులను మోసుకుని కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు పడుతున్న అవస్థలు వర్ణానాతీతం. ఇలా వందలాది మంది బయటకు రావడంతో ముంపునకు సమీపంలోని ప్రాంతాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి. వరద తాకిడితో తల్లడిల్లుతున్న బాధితులపై కూటమి సర్కారు కనీస కనికరం చూపడంలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ముంపు బాధితులు నరకయాతన పడుతున్నారు. మూడు రోజులుగా వరద నీటిలో అల్లాడిన ప్రజలు.. మంగళవారం కొంతమేర ముంపు నీరు తగ్గడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. పీకల్లోతు నీటిని సైతం లెక్కచేయక కర్రల ఊతంతో ముంపు నుంచి ఒడ్డుకు చేరే సాహసం చేశారు. సర్వస్వాన్ని ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతోనే వారంతా పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో ముంపు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రధానంగా మూడు కిలోమీటర్ల పొడవైన సింగ్‌నగర్ ఫ్లయ్‌ఓవర్ సైతం వరద బాధితులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుంటే.. మరికొందరు నిత్యావసర సరుకులు కొనుక్కుని మళ్లీ ముంపులోని ఇళ్లకు చేరుతున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలు పెంచేసి బాధితుల నుంచి ఎక్కువ వసూలు చేశారు. దీనిపై సర్కారు నియంత్రణ కొరవడింది. వరద నీటి గండం నుంచి బయట పడేందుకు ప్రైవేట్ బోట్లు మనిíÙకి రూ. వెయ్యి నుంచి రూ.1,500 డిమాండ్ చేయడంతో.. కొంతమంది లారీ ట్యూబ్‌లు, ధర్మాకోల్ షీట్స్ కొనుగోలు చేసి తెచ్చుకుని దానినే తెప్పలా తయారుచేసి ముంపు నుంచి బయటపడ్డారు. వాటర్ ట్యాంక్ నీళ్లు తాగి బతికాం ఇందిరానాయక్ నగర్‌లో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో రూమ్ కుటుంబంతో కలిసి ఉంటున్నా. వరద నీటితో గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. పిల్లలతో బిల్డింగ్‌పైకి చేరాం. మూడు రోజులు భోజనం లేక వాటర్ ట్యాంక్‌లోని నీళ్లతో ప్రాణాలు దక్కించుకున్నాం. చిన్న పిల్లలతో నరకం చూశాం. పడవలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి తప్ప మావైపు చూడలేదు. మంగళవారం పిల్లలను భుజాలపై ఎత్తుకుని తాళ్ల సాయంతో వరద నీటిలో నడిచొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం. – పాము ధనుంజయ్, హనుమాన్‌వీధి, సింగ్‌నగర్ మంచినీళ్లు కూడా ఇవ్వరా రెండు రోజుల నుంచి పైపుల ద్వారా నీరు రాలేదు. మంగళవారం మాత్రమే కేవలం 10 బిందెలు నీళ్లొచ్చాయి. ఇంట్లో ఉన్న వారికి సరిపోలేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేరా? – పి.మేరీ, రామలింగేశ్వరనగర్ మూడు రోజులు పడవ కోసం చూసినా.. ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త రాములుతో కలిసి ఇందిరానాయక్ నగర్‌లో రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నాం. వరదకు మేం ఉంటున్న ఇల్లు మునిగిపోయింది. సమీపంలోని భవనంలోకి వెళ్లి మూడు రోజులు తలదాచుకున్నాం. మా సామాన్లన్నీ నీట మునిగి తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసినా ఎవరూ పట్టించుకోలేదు. తిండి లేక వాటర్ ట్యాంక్‌లో నీళ్లు తాగి బతికాం. కట్టుబట్టలతో ఎట్టకేలకు రోడ్డుపైకి చేరాం. – దాసరి అచ్చాయమ్మ, ఇందిరానాయక్, సింగ్‌నగర్ తడిసిన బట్టలతోనే పడిగాపులు రెండు రోజులుగా తడిసిన దుస్తులతోనే రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నాం. ఇంట్లో బట్టలన్నీ వదిలి వచ్చాం. అన్నం, నీరు దొరకడం లేదు. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం కట్టుకోవడానికి చీరలైనా పంపిణీ చేయాలి. – శిరీష, విజయవాడ ట్యూబ్ సాయంతో బయటపడ్డాం ఎటు చూసినా వరద నీరే. భోజనం, మంచినీళ్లు అందించేవారే కరువయ్యారు. బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాం. చివరకు మూడు రోజుల తరువాత కర్ర పట్టుకుని నడుచుకుంటూ ఒడ్డుకు చేరా. అక్కడ దొరికిన ఒక ట్యూబ్ ద్వారా 10 మంది కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఎక్కించుకుని తోసుకుంటూ ఒడ్డుకు చేర్చాం. వరద వస్తుందని తెలిసినా ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. – ఎస్.ప్రభాకర్, ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతం, సింగ్‌నగర్ అమ్మాయి పెళ్లి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి మా కుమార్తె వివాహం వచ్చే నెలలో జరుగనుంది. రూ.లక్ష విలువైన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేశాం. వీటన్నింటిని ఇంట్లోనే జాగ్రత్త చేశాం. వరద నీటిలో ఇవన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా కూతురి వివాహం ఎలా చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్నాం. – షేక్ జుబేద, విజయవాడ జగన్ ఆపన్న హస్తం.. బాబు ప్రచార అస్త్రం వరద బాధితులను ఆదుకోవడంలో ఇద్దరు నేతల తీరిదీ.. గద్దెనెక్కిన వారందరూ నాయకులు అవుతారేమోగానీ.. వారిలో కొందరే మనసున్న పాలకులుగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మీడియా ముందు హడావుడి చేసి ప్రచారం కోసం పాకులాడే వారు కొందరైతే.. తాము తెరవెనుక ఉన్నా పర్వాలేదు బాధితులకు తక్షణం సహాయం అందడం ప్రధానం అని భావించే మనసున్న పాలకులు కొందరే. ప్రస్తుతం విజయవాడను భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అందరూ ఈ అంశం ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మీడియా హడావుడి లేకుండా బాధితులకు తక్షణం సహాయం సమర్థంగా అందించడంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనబరిచిన నిబద్ధతను.. ప్రస్తుతం కేవలం మీడియా కోసం హడావుడి చేస్తూ బాధితులను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చిని పోల్చిచూస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో నాడు–నేడు ముఖ్యమంత్రుల తీరు ఎలాగుందంటే.. అధికారులకు వారం గడువు.. బాధితులకు తక్షణ సాయం.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి తదితర వరదలు సంభవించినప్పుడు ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో పరిణతితో వ్యవహరించారు. వరద బాధిత ప్రాంతాలకు తాను తక్షణం వెళ్తే అధికార యంత్రాంగం అంతా తన చుట్టే ఉంటూ బాధితులను పట్టించుకోరని ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగం మధ్య సమన్వయం సాధిస్తూ సహాయ, పునరావాస చర్యలను సమర్థంగా పర్యవేక్షించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడమే కాదు.. అక్కడ వారికి తగిన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రతి కుటుంబానికి తక్షణం నగదు సహాయం చేసి నిత్యావసర వస్తువులు అందేలా చూశారు. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతే బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. ఆ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి ఏమన్నారంటే.. “కలెక్టర్‌కు వారం రోజుల గడువు ఇస్తున్నా. ఆ తరువాతే వరద బాధిత ప్రాంతాలకు వస్తా. ఒక్క బాధితుడు కూడా తనకు సహాయం అందలేదని చెప్పకూడదు’ అని కరాఖండీగా చెప్పారు. దాంతో యావత్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. వారం రోజుల తరువాత జగన్ పర్యటించారు. ఎలాంటి ఇబ్బందుల్లేవని బాధితులంతా ముక్తకంఠంతో చెప్పారు. అంతా నేనే.. అంతటా నేనే.. ఇక వైఎస్ జగన్‌కు భిన్నంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పుడు క్షణాల్లో వాలిపోయారు. యావత్ అధికార యంత్రాంగం ఆయన పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది. మారుమూల ప్రాంతాల్లో బాధితుల గోడును ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విజయవాడ నడిరొడ్డున వరద బీభత్సం సృష్టించినా 72 గంటల తరువాత కూడా బాధితులకు నిత్యావసర వస్తువులు అందించలేదు. తాగునీరు, పాల ప్యాకెట్ల సరఫరా చేయాలనే ధ్యాసే అధికార యంత్రాంగానికి లేకుండాపోయింది. తగినన్ని సహాయ శిబిరాలు ఏర్పాటుచేయలేదు. విజయవాడ వీధుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో తిరుగుతున్న సీఎం చంద్రబాబు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించనూ లేదు. కానీ, ఆయన అంతా నేనే.. అంతటా నేనే అన్నట్లుగా వ్యవహరించారు. మీడియా అంతా తనచుట్టూ ఉండేలా చూసుకుంటున్నారు. మరోవైపు.. వరదలతో ఏకంగా 19 మంది మృత్యువాత పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మనసులేని ముఖ్యమంత్రి చంద్రబాబు, చేవచచి్చన ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకుంటే ఇక లాభంలేదని బాధితులే తమ సామాన్లు పట్టుకుని వరద నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో.. ⇒2019–20లో 1,604 మంది రైతులకు సంబంధించి 653 ఎకరాల్లో పంట నష్టపోతే రూ.90.20 లక్షలు పరిహారం ఇచ్చారు. ⇒2020–21లో 8,441 మంది రైతులకు సంబంధించి 4,084 ఎకరాల్లో పంటలు కోల్పోయారు.రూ.6.03 కోట్లు పరిహారం చెల్లించారు. ⇒2021–22లో వరదల కారణంగా 4,447 మంది రైతులకు చెందిన 1,387 ఎకరాల్లో పంటను కోల్పోయారు. కేవలం నెలరోజుల్లో రూ.2.47 కోట్లు పరిహారం చెల్లించారు. ⇒2022–2023 మధ్య కాలంలో 985 మంది రైతులకు సంబంధించిన 476 ఎకరాల్లోని పంటను కోల్పోయారు. రూ.72.34 లక్షల పరిహారం చెల్లించారు. 2022 జూలైలో వచ్చిన వరదలపై అధికారులతో సమీక్షిస్తున్న అప్పటి సీఎం జగన్ జగన్ సమర్థతకు ఈ ఉదంతాలే నిదర్శనం.. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా అతలాకుతలమైంది. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నగరం, పట్టణాలు, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం స్పందించి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. వలంటీర్లు, సచివాలయ ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు మంచినీరు, భోజనం, అత్యవసర, ప్రాథమిక చికిత్సలు అందించారు. తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు. అంతా అయ్యాక జగన్ బాధితులను పరామర్శించారు. తమకు ప్రభుత్వ సహాయం అందిందని బాధితులు సంతోషంతో చెప్పారు. ఇక పంటలు నష్టపోయిన రైతులకు 25 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు. ⇒2023 డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 60 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆనాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాధితులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సుమారు 60 వేల కుటుంబాలకు రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ ఒక లీటరు, కేజీ ఉల్లిపాయలు, బంగాళా దుంపలు అందించారు. ప్రతి కుటుంబానికి రూ.2,500 ఆరి్థక సాయం చేశారు. ప్రతిరోజూ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్లారు. వారికి కావల్సిన అవసరాలను అందించారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేసింది. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించారు. ⇒డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2022 జూలైలో గోదావరికి రికార్డు స్థాయి వరద వచి్చంది. స్వయంగా నాటి సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో సమీక్షించారు. జిల్లా యంత్రాంగం హుటాహుటిన కదిలింది. వలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ఒక్క తాటిమీదకు వచ్చి బాధితులను ఆదుకుని సమర్థవంతంగా సేవలందించారు. మరోవైపు.. హోంగార్డు, వలంటీర్ల బృందాలతో ఏటిగట్లకు రక్షణ కల్పించారు. దీని ఫలితంగానే వివిధ ప్రాంతాల్లో గట్లకు ఊలలు పడిన విషయాన్ని సకాలంలో గుర్తించి గండ్లు పడకుండా చూశారు. అప్పట్లో 45 వేల కుటుంబాలు వరద బారిన పడగా, వీరిలో 37,128 మందిని తరలించారు. ఇక వరద బాధితులకు రెండు విడతలుగా నిత్యావసరాలు అందించారు. ఇలా 36,801 మందికి అందజేశారు. నగదు సాయం కుటుంబానికి రూ.2వేల చొప్పున సుమారు రూ.6.50 కోట్ల వరకు నేరుగా బాధితుల అకౌంట్లలో జమచేశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున అందించారు. మరోవైపు పాడి రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుంది. 33,570 పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 1,374 మెట్రిక్ టన్నుల దాణాను పంపిణీ చేశారు. 31,295 పశువులకు వ్యాక్సిన్లు అందించారు. ⇒2023 డిసెంబరు మొదటి వారంలో వచి్చన మిచాంగ్ తుపానుతో ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. తీరప్రాంత మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. 46 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. 685 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. ⇒2022 జూలై 11న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వరదలు ముంచెత్తాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల పరిధిలో 217 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో జగన్ స్పందించి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున 37 వేల కుటుంబాలకు తక్షణ ఆరి్థక సహాయంగా రూ.7 కోట్ల 40 లక్షలు అందించారు. వీటిలో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించారు. ఆ నెలంతా కలెక్టర్‌తోపాటు యావత్ అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టింది. జూలై 27న జగన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించగా బాధితులు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు.