‘తూర్పు’... మార్పునకు నాంది

నేడు కాకినాడలో వైయ‌స్ఆర్‌సీపీ సమర శంఖారావం 

పార్టీ శ్రేణులకు  దిశానిర్దేశం చేయ‌నున్న వైయ‌స్ జ‌గ‌న్‌

సమర శంఖారావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

తూర్పుగోదావ‌రి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ వేదికగా నేడు  సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బూత్‌ కమిటీ సభ్యులు, నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడలో నేడు జరగనున్న వైయ‌స్ఆర్‌ సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని ఎన్నికల విశ్లేషకులు భావిస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయమేనని గోదావరి ప్రజల నమ్మకం. ఎన్నికల సమర శంఖారావం సభకు కాకినాడ వేదిక కావడం శుభసంకేతమని వైఎస్సార్‌సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం 
కాకినాడలో సోమవారం జరగనున్న వైయ‌స్ఆర్‌ సీపీ సమర శంఖారావం సభతోనే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. 40 లక్షలకు పైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై, వారిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. విశేషం ఏమిటంటే తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఏర్పాటును ప్రకటించారు. తాజాగా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచార సంగ్రామంలో పార్టీ తలపెట్టిన మొదటి కార్యక్రమం కావడంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా ఏర్పాట్లు చేశారు. 
సమర శంఖారావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
వైయ‌స్ఆర్‌ సీపీ సమర శంఖారావం సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరగనుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని సర్పవరం జువెల్‌ మెడోస్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగే సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖీ నిర్వహిస్తారని చెప్పారు. సమర శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేసినట్టు రఘురామ్‌ వెల్లడించారు.  

Back to Top