పేదింటి..పెద్ద కొడుకులా..

ఆరోగ్య పథకాలతో ఎందరికో పునర్జన్మ కల్పించిన వైయ‌స్ఆర్‌ 
 

అమ‌రావ‌తి:  చాలామంది సీఎంలు వచ్చారు.. పాలించారు.. వెళ్లిపోయారు.. వాళ్లలో ఈయనా ఒకరు అనుకున్నారు అప్పట్లో 8 కోట్ల మంది ఆంధ్రులు అప్పటి ముఖ్యమంత్రి డా.వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గురించి. కానీ వైఎస్‌ మాత్రం నేను అందరిలాగా కాదు అంటూ పేదవాడికి స్వర్ణయుగాన్ని చూపించారు. పెద్ద జబ్బు చేస్తే నేనున్నానంటూ ఆరోగ్యశ్రీకి రూపకల్పన చేశారు. ప్రమాదం జరిగితే బాధితుడి చెంతకే కుయ్‌ కుయ్‌మంటూ వాహనాన్ని పంపించారు.మందుల కోసం టౌన్‌లోని ఆస్పత్రి వరకూ రానక్కరలేదంటూ ఇంటివద్దకే మందులు తీసుకువచ్చేలా 104ను పంపారు. పైన పేర్కొన్న మూడు పథకాల ద్వారా వైయ‌స్ఆర్‌  ఒక చరిత్ర సృష్టించారు. ఆయా పథకాలకు  వైయ‌స్ఆర్‌ అనే మూడు అక్షరాలు ఒక బ్రాండ్‌. దేశానికే రోల్‌ మోడల్‌. ఉమ్మడి ఏపీలో పురుడుపోసుకున్న ఈ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. సంక్షేమ పథకాలంటే పెద్దగా ఆసక్తి చూపని ప్రపంచ బ్యాంకును సైతం ఒప్పించి మెప్పించి ప్రశంసించేలా చేసిన సందర్భమేదైనా ఉందంటే అదొక్క ఆరోగ్యశ్రీ పథకానికే దక్కింది.  

పేదవాడికి పెద్ద జబ్బులొస్తే పరిస్థితేమిటి? వాళ్లు పడే ఇబ్బందులు ఏమిటి?.. ఇవన్నీ చూసిన వైయ‌స్ఆర్‌ పేదవాడి కాళ్లముందుకే కార్పొరేట్‌ వైద్యాన్ని తేవాలని సంకల్పించి ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఆయన మానసపుత్రిక ఈ పథకం. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న తపనతో 2007లో పథకం అమల్లోకి వచ్చింది. రెండేళ్లలో అన్ని జిల్లాలకు పథకాన్ని విస్తరించి చికిత్సల సంఖ్యను 942కు పెంచారు. ప్రమాదకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండెజబ్బులు వంటివన్నీ పథకంలో ఉండటంతో నయాపైసా లేకుండా కూలికి వెళ్లే పేదవాడు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. పథకం ప్రారంభించిన నాటినుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పైగా శస్త్రచికిత్సలు, థెరపీలు చేయించుకున్నారు. దినదినగండంగా బతుకునీడుస్తున్న కిడ్నీ, క్యాన్సర్‌ పేషెంట్లు పథకం కింద ఉచితంగానే చికిత్సలు పొందారు.

ఆపద్బంధు అంటే 108 
అర్ధరాత్రో అపరాత్రో ఆపదొస్తే దిక్కెవరు అనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ నేనున్నానంటూ రోడ్డుమీదకొచ్చిందే ఆపద్బంధు. దీనికంటే కూడా 108గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితం. దేశంలో ఏ రాష్టంలోనూ ఏ సీఎంకీ రాని ఆలోచన వైయ‌స్ఆర్‌ కు వచ్చింది. ఇందులో భాగంగానే 2005 ఆగస్ట్‌ 15న తొలిసారి హైదరాబాద్, విశాఖ, విజయవాడ,  వరంగల్, తిరుపతిలలో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికల్లా రాష్ట్రమంతా విస్తరించారు. ఎక్కడ ఏ మారుమూల పల్లెలో గుండెపోటు లేదా పాముకాటు, జ్వరం ఏదైనా కానీ 108కు ఫోన్‌ చేస్తే చాలు వచ్చి బాధితుణ్ని సురక్షితంగా ఆస్పత్రికి చేరుస్తుంది. ఇక ప్రమాద బాధితులకు ఒకవిధంగా దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. 2005 ఆగస్ట్‌ 15 నుంచి 2014 మే 31 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో 86,61,402 మందిని ఆపదనుంచి కాపాడిన ఘనత 108ది. 2014 జూన్‌ 2న రాష్ట్రం విడిపోయింది. అప్పటినుంచి జూలై 30 వరకూ ఏపీలో 3,06,650 మందినీ, తెలంగాణలో 1,36,995 మందినీ అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కాపాడాయి. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 108 వాహనాల ద్వారా 92 లక్షల మంది పైగా లబ్ధిపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 450, తెలంగాణలో 315 వాహనాలు నడుస్తున్నాయి. ఏపీలో ఈ పథకం ప్రారంభమయ్యాక  20 రాష్ట్రాల్లో ప్రారంభించారు.  

గర్భిణులకూ వరమే 
ఇప్పటి వరకూ గర్భిణులు పురిటి నొప్పులొస్తే ఆస్పత్రికెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. వీరికి కూడా 108 తోబుట్టువుగా నిలబడింది. రాష్ట్రం విడిపోయే నాటికి 18.41 లక్షల మంది గర్భిణులు 108లో ఆస్పత్రులకు వెళ్లి పురుడు పోసుకున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీలో 3 లక్షల మంది, తెలంగాణలో 1.36 లక్షల మంది 108లో సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి ప్రసవమయ్యారు. ఈ పథకాన్ని ప్రపంచ దేశాలే ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. 

పల్లె  గడపకు వైద్యం
మారుమూల పల్లెటూళ్లలో మందులిచ్చే దిక్కుండరు. వైద్యుడు ఉండడు, నర్సు ఉండదు. వృద్ధాప్యం కూడా ఒక శాపం. పట్నమెళ్లేందుకు చేతిలో డబ్బుండదు. ఇవన్నీ నిరుపేదల వైద్యానికి శాపం కాకూడదన్న ఉద్దేశంతో 104 పథకాన్ని వైఎస్‌ ప్రారంభించారు. తొలుత 2008 ఫిబ్రవరిలో శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రారంభించారు. 2009లో అన్ని జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. అప్పట్లో మొత్తం 475 వాహనాలుండేవి. ఈ వాహనాలు నెలకు 26,211 గ్రామాలు తిరిగేవి. సుమారు 20.93 లక్షల మంది రోగులను పరిశీలించి మందులిచ్చేవి. ఈలెక్కన ఈ ఆరేళ్లలో సుమారు 15 కోట్ల మంది (మళ్లీ మళ్లీ మందులు తీసుకున్న వారితో కలిపి) లబ్ధి పొందినట్టు అంచనా. రక్తపోటు, మధుమేహం, నరాలజబ్బులు ఇలా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న బాధితులందరికీ ఉచితంగా మందులు అందేవి. ఇప్పటికీ ఈ వాహనం పల్లెల్లోకి వెళ్లగానే వృద్ధులు, బాలింతలు, మహిళలు మందుల కోసం ఆశగా ఎదురు చూసే దృశ్యాలు కనిపిస్తాయి. కానీ 2010 తర్వాత పథకంపై ప్రభుత్వాలు సరైన దృష్టి సారించకపోవడం సంచార వైద్యం మసకబారింది. 

నా బతుకుకు భరోసా ఇచ్చింది ఆరోగ్యశ్రీనే 
దివంగత సీఎం వైఎస్సార్‌ నా దేవుడు. నేను బతికి ఉన్నానంటే ఆయనే కారణం. గుండె జబ్బుతో బాధపడుతూ 2008లో ఆరోగ్యశ్రీ ద్వారా వైజాగ్‌లో ఉన్న సెవెన్‌æ హిల్స్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నాను. నాకు ఆపరేషన్‌ నిమిత్తం రూ.75 వేలు ఖర్చు కాగా ఆ మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. ప్రస్తుతం నేను ఆర్యోగంగా ఉన్నాను. నాకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2008లో ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కుటుంబ పోషణకు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంక్‌లో రుణం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పులివెందులలో వైయ‌స్ఆర్‌ను నేరుగా కలిసి నా గోడును చెప్పుకుంటే ఆయన వెంటనే రుణాన్ని మంజూరు చేసేలా అక్కడ నుంచే ఆదేశాలు ఇచ్చారు. దీంతో బ్యాంక్‌ రుణం వచ్చిన తర్వాత ఆ డబ్బులతోనే బజ్జీలు, బఠాణి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాను. ఆరోగ్యశ్రీ నాలాంటి ఎందరికో పునర్జన్మ ఇచ్చింది. మళ్లీ ఇలాంటి పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైయ‌స్‌ జగన్‌ వల్లే సాధ్యమవుతుంది.  – పినిశెట్టి వెంకటరామారావు, కొత్తపల్లి, తూర్పుగోదావరి జిల్లా  

ఆరోగ్యశ్రీ అడుగులు ఇలా
2007 ఏప్రిల్‌ 1న మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 163 జబ్బుల చికిత్సకు అనుమతితో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైయ‌స్ఆర్‌ ప్రారంభించారు. 2009 జూలై నాటికి ఉమ్మడి ఏపీలోని మొత్తం జిల్లాలను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్సల సంఖ్య ఏకంగా 942కు పెంచారు. రెండేళ్ల కాలంలోనే వైయ‌స్‌ హయాంలో సుమారు రూ. 2,300 కోట్లు ఆరోగ్యశ్రీకి వెచ్చించారు. గుండెజబ్బులు, కిడ్నీ (డయాలసిస్‌ రోగులు), నరాల జబ్బులు, క్యాన్సర్, కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ లాంటి ఖరీదైన జబ్బులతో బాధపడే వారు ఎక్కువ శాతం మంది ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందారు.

Back to Top