జ‌గ‌న‌న్న‌కు జన‘కోటి’ ఆదరణ! 

దుమ్మురేపుతున్న రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ పాట‌

యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌ సాధించిన వైయ‌స్ఆర్‌సీపీ పాట

క్షణక్షణానికి పెరిగిపోతున్న వ్యూస్‌..

సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతున్న ప్రచార గీతం

 హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఈ గీతం..  సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతూ,  సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డు అంటున్నారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

 

ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. విడుదలైన అనతికాలంలో ఈ పాట విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్‌నెట్‌లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. గురువారం రాత్రికి 70 లక్షలు దాటిన ఈ పాట.. శనివారం సాయంత్రానికి కోటికిపైగా వ్యూస్‌ సొంతం చేసుకొని.. ఇప్పటికీ దూసుకుపోతోంది.  ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని వైయ‌స్ జగన్‌ అభిమానులను సైతం ఈ ప్రచార గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

Back to Top