పావురాల గుట్ట గుర్తుకొస్తోంది...

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం  దేశంలోనే అతి పెద్ద ఆపరేషన్ 

మహానేత మరణంతో కన్నీటి పర్యంతమైన తెలుగు ప్రజలు

వైయస్‌ఆర్‌ మరణాన్ని నిర్ణించుకోలేక ఆగిన వందలాది గుండెలు

బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన జననేత 

అమరావతి:  సెప్టెంబర్ రెండు... వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతుడైన రోజు. ఆయన అనుచరులకు, అభిమానులకు తీరని వేదనను మిగిల్చిన రోజు.

సెప్టెంబర్ 2, 2009 : ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామాలకు వెళ్లేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి రూపొందించుకున్నవిభిన్న కార్యక్రమం రచ్చబండ. సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా అనుప్పల్లె గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.    
ఆ రాత్రంతా గాలించినా హెలికాప్టర్ జాడలేదు. అధికార పార్టీ నాయకుల్లో ఒకటే టెన్షన్. ఆ రాత్రంతా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. హెలికాప్టర్ ఆచూకీ కోసం అవసరమైన అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 3, 2009, గురువారం
తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో సుఖోయ్ యుద్ధవిమానంతో మరోసారి గాలింపు తీవ్రం చేశారు. ఈసారి ప్రయత్నాలు విఫలం కాలేదు. గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లొనే కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న వెలుగోడుకు సమీపంలో రుద్రంకొండ (పావురాల గుట్ట)పై హెలికాప్టర్ శకలాలను గుర్తించిన వైమానిక సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం చేరవేసింది. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం రేయింబవళ్లు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెతుకుతున్న వేలాది మంది అభిమానులకు ఆర్మీ హెలికాప్టర్ పైలట్ అందించిన చీటితో సమగ్రమైన సమాచారం అందింది. ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాల్వ సమీపంలోని రుద్రకోడు అటవీ ప్రాంతంలో గాలింపు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఆర్మీ హెలికాప్టర్లో నుంచి ఒక పైలట్ ముఖ్యమంత్రి వైయస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఒక చీటిలో రాసి జనం మధ్యలోకి పడవేశారు. పైలట్ భూమి మీదకు పడవవేసిన చీటిలో కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు 90 డిగ్రీస్, 8 కి.మీ అనే అక్షరాలతో పాటు ఆర్మీ కోడ్‌కు సంబంధించిన పలు ఇంగ్లీషు అక్షరాలు, అంకెలు ఉన్నాయి.
ఆ చీటిని అందుకున్న పోలీస్ అధికారులు రుద్రకోడు వైపు కాలి నడకన బయలు దేరారు. ఆ చీటి ప్రజలకు అందిన 30 నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలి పోయిన ప్రాంతం వెలుగు చూసింది.సుఖోయ్ అందించిన సమాచారం మేరకు సంఘటన జరిగిన తీరును బట్టి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా మరో నలుగురు బయటపడే అవకాశాలు లేవని ఒక అంచనాకు వచ్చారు. సంఘటనస్థలం దిశగా సైనిక హెలికాప్టర్లతో ఉపరితల గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా అందులో ప్రయాణిస్తున్న సీఎం కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతాధికారి వెస్లీ, గ్రూప్ పైలెట్ భాటియా, కో పైలెట్ ఎం.సత్యనారాయణరెడ్డిలు మృతి చెందినట్లు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాంధీభవన్‌తో సహా ప్రతివీధిలోనూ సీఎం చిత్రపటాలతో సంతాప సభలు ఏర్పాటు చేసి ప్రజలు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.30లకు ముఖ్యమంత్రి మృతిపై ఆర్థిక మంత్రి రోశయ్య అధికారిక ప్రకటన చేశారు.

మరోవైపు.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి పోలీసులు, మీడియా, రాజకీయ నాయకులు, స్థానికులు, చెంచులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత దట్టమైంది కావడమే అందుకు కారణం.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రదేశం నల్లమల అటవీ ప్రాంతంలోని దట్టంగా ఉన్న ఎత్తైన పర్వతాల్లో ఉంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంది. అక్కడికి ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం. అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, పోలీసులు కూడా దారి తప్పారు. ప్రమాదస్థలం పక్కనే ఉన్నట్లు కనిపిస్తున్నా దట్టమైన అడవిలో కొండదిగితే అక్కడకు చేరుకోవడం కుదరదని స్థానికులు తేల్చారు. వైమానిక సిబ్బంది కూడా 1.30 గంటల వరకు ప్రయత్నించి సాధ్యం కాక, హెలికాప్టర్ల ద్వారా కిందకు దిగి మృతదేహాలను తాళ్లతో కట్టి తరలించాలని నిర్ణయించారు. వైమానిక దళ కమెండోలు, చెంచులు తాళ్ల సహాయంతో కిందకి దిగి మృతదేహాల శకాలను సేకరించారు. చెల్లా చెదురుగా పడివున్న మాంసపు ముద్దలను ఏరి గుడ్డ సంచులలో చేర్చి తాళ్ల ద్వారానే హెలికాప్టర్లలోకి చేర్చారు.

మధ్యాహ్నం 2.20 గంటలకు భారత వైమానిక దళం హెలికాప్టర్లలో ముఖ్యమంత్రి వైఎస్ పార్థివదేహంతో పాటు పైలెట్లు, భద్రతా అధికారుల భౌతికకాయాలను కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ మృతదేహానికి పోస్టుమార్టం, కర్నూలు రెండో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో శవపరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు కర్నూలు నుండి హైదరాబాదుకు బయలుదేరిన ప్రత్యేక హెలికాప్టర్లు ఐదు గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. తరువాత బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మృతదేహన్ని తరలించారు. ఆయన భౌతికకాయానికి కడపలోని ఆయన వ్యవసాయక్షేత్రం ఇడుపులపాయలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన అంతిమయాత్ర, ఖనన క్రియలో పాల్గొన్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక పలువురు అభిమానులూ మరణించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల వరకు వైఎస్ సహా ఐదుగురు బతికే ఉన్నారని, తీవ్ర షాక్ కారణంగా కన్ను మూశారని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు. దుర్ఘటనలో మృతుల శరీర భాగాలు బాగా కాలిపోయినట్లు, కొన్ని నిమిషాలు కొట్టుమిట్టాడి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో ధ్రువీకరించారు. వైద్య పరిభాషలో ఎమరేజ్ షాక్ అంటారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం భారతదేశంలోనే ఇంతవరకు ఎన్నడూ జరగనంత అతి పెద్ద ఆపరేషన్ కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. దేశ చరిత్రలోనే ఆది అతిపెద్ద గాలింపుగా చెబుతారు.
ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ నల్లమల పావురాల గుట్టమీద వాలగానే 120 మీటర్ల దూరం నేలమీద ఈడ్చుకుంటూ వెళ్లిందని సంఘటన స్థలంలో దర్యాప్తు జరిపిన సీబీసీఐడీ ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. ఆ ధాటికి హెలికాప్టర్ తోక, ఇతర భాగాలు ఒక్కొక్కటే ఊడిపోయాయని, చివరగా హెలికాప్టర్ ఒక చెట్టుకు ఢీకొని పేలిపోయిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు హెలికాప్టర్ శకలాలు వేగంగా అన్నిదిక్కులా దూసుకు పోయాయని, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురి దేహాలు వాటితోపాటే తలా ఒకవైపు దూసుకుపోయాయని వివరించారు. శకలాలు గుచ్చుకోవడం వల్లే శరీరాలు ఛిద్రమయ్యాయని వెల్లడించారు. హెలికాప్టర్ కూలిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని సీబీసీఐడీ నిర్ధారించింది. సీబీసీఐడీ బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిఫుణుల విభాగం పేలుడు పదార్థాల అవశేషాల కోసం సంఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించింది. వారికేమీ ఆధారాలు లభించలేదు. దాంతో ముమ్మాటికీ ఇది ప్రమాదమేనని తేల్చారు. 

 వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ కాక్‌ఫీట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) విశ్లేషణను ఆ తరువాత అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి సేకరించిన హెలికాప్టర్ శకలాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు ఢిల్లీకి తరలించి డీజీసీఏ అధికారులు సీవీఆర్‌ను విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలో ఎగురుతున్నది. 9.22 నిమిషాల నుంచి 9.30 వరకు హెలికాప్టర్ పైలెట్లు తమకు దారి కనిపించడం లేదని, సరైన దారి చూపించమని పదేపదే చెన్నై ఏటీసీ అధికారులను బతిమాలుకున్నట్లు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ ద్వారా వెల్లడైనట్లు కొంతమంది అధికారులు మీడియాకు తెలిపారు. 9.30 గంటల తర్వాత సంభాషణ ఆగిపోయినట్లుగా సమాచారం. సంభాషణ మొత్తం హిందీలో జరిగినట్లు ప్రచారం సాగింది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై నాలుగు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కేసును చట్టపరంగా సీబీసీఐడీ దర్యాప్తు చేయగా, సాంకేతిక లోపాలపై డీజీసీఏ పరిశోధించింది. మరోవైపు దేశ భద్రతలో కీలకమైన రాడార్ కేంద్రాల వారిని ప్రశ్నించే అధికారం సీబీఐకి మాత్రమే ఉండడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మూడింటికి తోడు ఇద్దరు నిపుణులతో కూడిన కమిటీని కూడా నియమించారు.
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం భారతదేశంలోనే ఇంతవరకు ఎన్నడూ జరగనంత అతి పెద్ద ఆపరేషన్ కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. దేశ చరిత్రలోనే ఆది అతిపెద్ద గాలింపుగా చెబుతారు. దాదాపుగా 30గంటల పాటు వైఎస్‌ఆర్ ఆచూకీ కోసం నల్లమల ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. దాదాపు 24 గంటల తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను, 27 గంటల తరువాత ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్ మృతదేహాన్ని గుర్తించారు. భారత సైన్యానికి చెందిన 11హెలికాప్టర్లు, కేంద్ర బలగాలు, అత్యంత ఆధునిక పరిజ్ఞానం కలిగిన సుఖోయ్ విమానం, నావికా దళం, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, నల్లమల అడవుల్లోని గిరిజనులు వేలాదిగా వైఎస్‌ఆర్ ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు.

ఇరవైనాలుగు గంటల పాటు ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి లేని పరిస్థితి వైఎస్ మరణంతో ఏర్పడింది.  మహానేత మరణంతో తెలుగు రాష్ట్రం మూగబోయింది. వైయస్‌ఆర్‌ మరణాన్ని జీర్ణించుకోలేక వందల గెండెలు ఆగిపోయాయి. రాష్ట్రమంతా కన్నీటి పర్యాంతమైంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు మాట ఇవ్వడంతో ప్రజలకు ఓ భరోసా కలిగింది. వైయస్‌ఆర్‌ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుంబాలను పరామర్శిస్తారని వైయస్‌ జగన్ నల్లకాల్వ సభలో మాటిచ్చారు. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ పార్టీ అడ్డుచెప్పడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి..ప్రజల బాట పట్టారు. తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన నిలిచారు. ఎట్టకేలకు మహానేత రాజన్న పాలన మళ్లీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ద్వారా వచ్చిందని తెలుగు ప్రజలు సంబరపడుతున్నారు. మహానేత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు విశ్వాసం కలిగింది. అదే స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చారిత్రాత్మక చట్టాలు చేసి దేశానికే దిక్కూచిలా మారారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top