ముందుంది అసలైన పాలన

నవరత్నాల హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. మూలనపడ్డ 108 ముస్తాబై ముందుకు దూకింది ప్రాణరక్షణ సేవకోసం. మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ఊపిరిపోసుకున్నాయి. పసికందులను కొరుక్కుతిన్న ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన మొదలైంది. చిరుద్యోగుల జీవితాల్లో చింతలు దూరం అవుతున్నాయి. రాష్ట్రమంతా వెలుగు రేఖలు విస్తరిస్తున్నాయి. పాలన అంటే ఇది మాత్రమే కాదు. పాలన అంటే హామీలు నెరవేర్చడం ఒక్కటే కాదు. ఐదేళ్ల పాలన వెనుక నక్కిన చీకటి నిజాలు బయటకు కక్కించడం కూడా. అవినీతి పెనుభూతాన్ని పట్టి లాగడం కూడా. జరిగిన అన్యాయాలు, అమానుషాలకు న్యాయం దక్కించడం కూడా. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అణాపైసలతో సహా పూడ్చడం కూడా.. అదీ అసలైన పాలన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు వైఎస్ జగన్ మోహన రెడ్డిగారు చేస్తానని మాటిచ్చిన పాలన అచ్చంగా అదే. ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 
నిధులు ఏమయ్యాయి?
కేంద్రం కోట్ల రూపాయిల నిధులు ఇచ్చామని చెప్పింది. అవన్నీ ఎటు పోయాయి? ప్రజలకు ఎంత చేరాయి, ప్రభుత్వాధినేతల జేబుల్లోకెంత చేరాయి? పోలవరం, రోడ్లు, రాజధాని నిర్మానం, వెనుకబడ్డ ప్రాంతాలకు వచ్చిన నిధులు, తుఫాను సహాయాలు, ఉపాధి పనుల సొమ్ములు, గిరిజన, ఎస్సీఎస్టీ నిధులు ఇవన్నీ ఎక్కడ ఖర్చు అయ్యాయి? వీటిని విచారణలో తెలుసుకుని ప్రజల ముందు ఉంచబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు. గత ప్రభుత్వ హాయంలో నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ప్రతిపక్షంలో ఉండగానే అంకెలతో సహా వివరించిన ప్రజానేత నేడు వాటిని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలముందు, చట్టం ముందు ఉంచనున్నారు.
కాంట్రాక్టుల వెనుక కథలేమిటి?
ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి అతిపెద్ద అవకాశం కాంట్రాక్టులే. టీడీపీ నాయకులు, వారి బంధువులు అనుచరుల పేరిట దక్కిన కాంట్రాక్టులే అన్నీ. నీరు చెట్టు మొదలు పోలవరం వరకూ ప్రతి చోటా అంచనా వ్యయం పెంచడం కోట్లకు కోట్లు కాంట్రాక్టర్లకు ధారపోయడం. కమీషన్లు పుచ్చుకోవడం. తెలుగు తమ్ముళ్ల ఆస్తుల పెంపకానికి ఆంధ్ర రాష్ట్రం అప్పనంగా దొరికినట్టైంది. కొన్ని చోట్ల నిబంధనలను కూడా గాలికొదిలి కాంట్రాక్టులు ఇచ్చారంటే ఎంతటి అధికార దుర్వినియోగం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రభుత్వం బిల్లులు పాస్ చేసినా కాంట్రాక్టర్లు పనులు చేయకుండా ఆపేసిన ప్రాజెక్టులెన్నో ఉన్నాయి. అన్నా కాంటీన్లు, పట్టిసీమ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రియల్ టైం గవర్నెన్స్ ఇలా ఒక్కో పేరుతో కాంట్రాక్టులను సొంత వాళ్లకు పంచిపెట్టింది టీడీపీ ప్రభుత్వం. ప్రజల సొమ్మును దోచిపెట్టింది. వాటన్నిటినీ ఆరా తీస్తున్నారు నేటి ముఖ్యమంత్రి. కాంట్రాక్టుల్లో అవకతవకలు జరిగాయనో, అసలు కాంట్రాక్టులు నియమనిబంధనలకు లోబడి లేవనో తెలిస్తే వాటిపై చర్యలు తీసుకోనున్నారు.
రాజధాని రహస్యాలు ఏమిటి?
రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ దోపిడీ . రాజధాని ప్రాంతం గురించి లీకులు ఇస్తూ వేలాది ఎకరాలను ఆ పార్టీ నేతలు హస్తగతం చేసుకున్నారు. రాజధాని భూముల అవినీతి గురించి ప్రత్యేకంగా విచారణ జరిపనుంది నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. 
లెక్కతేలాలి..
దుబారాలు, విదేశీ టూర్లు, విచ్చలవిడి ఖర్చులు, రహస్య జీవోలు ... టీడీపీ హాయంలో అడ్డగోలుగా జరిగిన ఈ దోపిడీ లెక్కలు తేలాలి. ప్రజలకు జవాబుదారుగా ఉంటాను అని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వపు అవినీతి విశ్వరూపాన్ని ప్రజలముందు ఉంచే పనిలో ఉన్నారు. అదే అసలైన పాలన. ప్రజలు మెచ్చే సిసలైన పరిపాలన. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top