ప్ర‌తి నోటా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ 

‘జగనన్నే మా భవిష్యత్తు’కు 20 లక్షలకుపైగా మిస్డ్‌ కాల్స్‌

నాలుగో రోజూ ప్రతి గ్రామంలో ఘన స్వాగతం

ఆకివీడులో స్వయంగా స్టిక్కర్‌ అతికించిన టీడీపీ సర్పంచ్‌

గుంటూరులో జగనన్నకు మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలీ 

 అమరావతి: జగనన్న సైన్యానికి ప్రతి గడపలో ఘన స్వాగతం లభిస్తోంది. మాట నిలబెట్టుకుంటూ మూడున్న­రేళ్లలోనే 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చిన వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో ఆత్మీయ పలకరింపులు ఎదురవుతున్నాయి. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ నినాదంతో చేపట్టిన ‘జగ­నన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఊరూ­వాడ విస్తృతంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజక­వర్గ సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు, ప్రజాప్రతి­నిధు­లు, సచివాలయ కన్వీనర్లు అందరూ సమష్టిగా ఇంటింటికీ వెళ్తున్నారు. 
ప్రతి గడపకి వెళ్లి 15 నిమిషాలకు పైగా గడు­పుతున్నారు. గత ప్రభుత్వం అనుస­రించిన మోసపూరిత విధానాలు, ఎన్ని­కల హామీలను తుంగలో తొక్కిన వై­నాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడువైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చేకూర్చిన మంచిని వివరిస్తూ మరోసారి ఆశీర్వ­దిం­చాలని కోరుతున్నారు. నాలుగో రోజు సోమవారం కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ సీఎం వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ పాలనపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం 46 నెలలుగా అందిస్తున్న పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని పలువురు లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. గృహ సారథుల నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్లను తీసుకుని ఇంటి తలుపు, మొబైల్‌ ఫోన్‌కు అతికించి తమ నమ్మకం, భవిష్యత్తు, అంతా జగనన్నే అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

20 లక్షలకుపైగా మిస్డ్‌ కాల్స్‌.. 
ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు అడిగినప్పుడు.. ఈ ప్రభుత్వంలో తమకు రూ.లక్షల్లో ప్రయోజనం చేకూరిందని, వైఎస్‌ జగనే మళ్లీ సీఎం కావాలంటూ ప్రజలు తమ మనసులో మాట చెబుతున్నారు. సమాధానాలు నమోదు చేసి రసీదు తీసుకుంటున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియచేస్తూ స్వచ్చందంగా 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తున్నారు. ఆ వెంటనే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మెగా పీపుల్స్‌’ సర్వేకి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా మద్దతు పుస్తకంలో 28 లక్షలకు పైగా కుటుంబాలు పాల్గొన్నాయి. మూడు రోజుల్లో 20 లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి.

గుంటూరులో గళమెత్తిన విద్యార్థిలోకం
 విద్యార్థులకు ఉన్నతంగా, ఉత్తమంగా, ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామని విద్యార్థి లోకం నినదించింది. వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో జగనన్నే మన భవిష్యత్తు అని నినదిస్తూ గుంటూరు వేదికగా విద్యార్థులు గళమెత్తారు. లాడ్జిసెంటర్‌ నుంచి హిందూ కాలేజ్‌ సెంటర్‌ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శంకర్‌విలాస్, ఓవర్‌ బ్రిడ్జి, ప్రభుత్వాసుపత్రి, ఏసీ కళాశాల మీదుగా ర్యాలీ కొనసాగింది. విద్యార్థులంతా జగన్‌ మామే తమ భవిష్యత్తు అని భావిస్తున్నారని పానుగంటి చైతన్య చెప్పారు. కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, రీజనల్‌ కోఆర్డినేటర్‌ విఠల్, విద్యార్థి నేతలు రవి, గంటి, బాజి, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

స్టిక్కర్‌ అతికించిన టీడీపీ సర్పంచ్‌ 
ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడిలో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ సర్పంచ్‌ ముత్యాల అనురాధ ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడంతోపాటు వైఎస్‌ జగన్‌ ఫొటోతో ముద్రించిన స్టిక్కర్‌ను ఓ ఇంటి గోడపై అతికించడం విశేషం. కుప్పనపూడిలో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ప్రారంభించగా వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ ముత్యాల అనురాధ హాజరయ్యారు.

అనంతరం అక్కడ నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్‌ స్వయంగా ఓ ఇంటికి సీఎం వైయ‌స్ జగన్‌ ఫొటోతో ముద్రించిన స్టిక్కర్‌ను అతికించారు. వివక్ష లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌కు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు సైతం మద్దతు తెలియచేస్తున్నారని నరసింహరాజు పేర్కొన్నారు. 

Back to Top