జగనన్న..నీ ఆశయానికి హ్యాట్సాఫ్‌

ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం

పేదల ఆరోగ్య భద్రతకు తండ్రి రెండుగులు వేస్తే..తనయుడివి నాలుగు అడుగులు

సీఎం వైయస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయాలపై ప్రశంసల వెల్లువ

అమరావతి: అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం... ఈ దిశలో  సాగుతున్న ఏపీ ప్రభుత్వ పాలన సామాన్యప్రజల పట్ల ప్రభుత్వాధినేత చిత్తశుద్దిని చాటుతోంది. ఈ విషయంలో తనకు తానే సాటి అన్నట్టుగా సీఎం జగన్‌ ముందడుగులు వేస్తున్నారు. బడిచదువుల విషయంలో అనితర సాధ్యమైన రీతిలో ప్రణాళికలు వేశారు. అదే రీతిలో ప్రజారోగ్యంపై తిరుగులేని శ్రద్దను చూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన నెలల కాలంలోనే ...ప్రజాసంక్షేమం పట్ల ముఖ్యమంత్రి తపన, తాపత్రయం గమనించినవారిని కదిలించేదే. మనసున్నవారిని ఆలోచింపచేసేదే. గతంలో ప్రజలకోసం, ప్రజలందరి కోసం ఈ తీరుగా ఆలోచించిన నేతలు అరుదంటే అరుదు.  ఆ ఆలోచనమార్గంలో తండ్రి చూపిన బాట, తండ్రి నడిచిన బాటే జగన్‌కు ఆదర్శమయింది.
తన సుదీర్ఘపాదయాత్రలో ఆయన చూసిన ప్రజాబాధలెన్నో...ఇంకా మస్తిష్కంలో సుళ్లు తిరుగుతూనే వున్నట్టున్నాయి. తన చెంతకు వచ్చి, కన్నీళ్ల మయమై చెప్పుకున్న బాధలగాధల పల్లవులు...ఆయన చెవుల్లో రింగుమని మోగుతున్నట్టే వున్నాయి. అందుకే, కలనైనా ఏమారని తనంతో...తన అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సోదరులకు, స్నేహితులకు తానిచ్చిన బతుకు భరోసాను మరవలేకపోతున్నారు. హామీలను నెరవేర్చడమే పరమకర్తవ్యంగా పాలన సాగిస్తున్నారు. ప్రతి ఇంటిబిడ్డగా ప్రేమమీర బాధ్యతను మోస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం...వయసులో చిన్నవాడే గానీ, మనసు పెద్దది. ఈ కాలం రాజకీయాల్లో కనిపించనిది.
పదవికోసం కష్టపడి...పదవి వచ్చాక, ఇక స్వీయసంక్షేమం, తన వందిమాగ«ధుల సంక్షేమంపైనే మనసు పెట్టే పాలకులకు విరుద్దంగా కనిపిస్తున్న జగన్‌...పదేళ్ల పాటు కష్టపడ్డదానికి రెట్టింపుగా ఇప్పుడు కష్టపడుతున్నారు. నడక కష్టం తప్పిందేమో గానీ, చిత్తశుద్ది పాలన చేయాలన్న తలంపుతో అనితర సాధ్యమైన బరువులను తలకెత్తుకుంటున్నారు. బాధ్యతలను తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలూ తనకు సమానమేనని, అందరికీ మేలును చేయడమే తన కర్తవ్యమని త్రికరణశుద్దిగా నమ్మారు. మంచి సంకల్పాన్ని వీడక పాలనను సాగిస్తున్నారు.  
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటిరోజు ఆయన ఆర్టీసీ విలీనద్వారా వారి దశాబ్దాల కలను సాకారం చేశారు. ఇక ఈ రోజున కొత్త రూపురేఖలతో ఆరోగ్యశ్రీకి జవసత్వాలు చేకూరుస్తూ, రోగగ్రస్త ప్రజలకు అపరధన్వంతరిని మించిన సాయాన్ని అందించబోతున్నారు. తన తండ్రి హయాంలో పేదవాడి సంజీవనిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆరోగ్యశ్రీ పథకం తర్వాత ... ఐదేళ్ల నవ్యాంధ్రలో ఎలా నడిచిందో అందరికీ తెలిసిన విషయమే. ఆస్పత్రులకు వెళితే పథకం గ్యారంటీ అందుతుందన్న గ్యారంటీ లేదు. అత్యాధునిక వైద్యచికిత్సలు అందరికీ అందుబాటులోకి తేలేని పరిస్థితి. ఓ మాటలో చెప్పాలంటే ప్రజారోగ్యం పట్ల పెద్దగా పట్టింపులేని పాలన సాగించారు సీనియర్‌నాయకులు శ్రీమాన్‌ చంద్రబాబుగారు. అన్ని సంక్షేమ పథకాలలాగానే ...పేదవాడి కంటితుడుపు పథకమైంది ఆరోగ్యశ్రీ. వైయస్సార్‌ హయాంలో దేశానికే ఆదర్శమై, దేశవిదేశీ ప్రశంసలు పొందిన పథకమది. అందకు మించి పేదజనం పాలిట అపర సంజీవనిగా మారి, ప్రాణప్రదాతగా నిలిచింది. ప్రజల పట్ల వైయస్సార్‌కు వున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా వైయస్సార్‌ మరపురాని మహనేతగా నిలిచిపోయారు. ఆయన ఆదర్శాలను ఎత్తిపట్టి నడిచిన జగన్‌ ఇప్పుడు పాలకుడయి తండ్రిలానే ప్రజారోగ్యంపై తపిస్తున్నారు. పేదవాడిని చిదిమేసే, అప్పుల పాలు చేసే అనారోగ్యం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆచరణలోకి తెచ్చారు. ఈ జనవరి మూడున 2059 జబ్బులకు చికిత్సలందించే బృహత్తర పథకంగా రూపుదిద్దుకున్న   డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో మొదలైంది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్‌ నెల నుంచి ప్రతినెలా ఓ జిల్లాను పెంచుకుంటూ, అన్ని జిల్లాలకు విస్తరించబోతున్నారు. ఇదే కాకుండా, ఆపరేషన్ల తర్వాత విశ్రాంతి కాలానికి ప్రభుత్వ సాయం అందబోతోంది. డయాలసిస్‌ రోగులకు ఆర్థిక సాయం అందించబోతున్న ప్రభుత్వం, క్యాన్సర్‌ రోగులకు గొప్ప ఊరటించేలా చికిత్సలు చేయించేందుకు సిద్దమైంది. ఇలా ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీర్చిదిద్దిన తీరుతెన్నులు...ముఖ్యమంత్రి
వైయస్‌ జగన్‌కు ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని పట్టిచూపుతోంది.
నేటి కాలం రాజకీయాల్లో...జగన్‌ పాలన నిజంగానే కొత్తగా ఉంది. ఆదర్శవంతంగా ఉంది. పేదలు, బడుగు బలహీనవర్గాలు... ఇలా సమస్త వర్గాల, సమస్త వృత్తుల ప్రజల పట్ల జగన్‌ ప్రభుత్వం మెచ్చుకోదగ్గ రీతిలో కమిట్‌మెంట్‌ కనబరుస్తూవుంది.
ముఖ్యమంత్రి తరచూ అంటున్నట్టుగా దేవుడి ఆశీర్వాదబలం...ప్రజలందరి ప్రేమాభిమానాలతో...ఆయన అనుకున్నవన్నీ సాధించాలని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ నవశకానికి నాంది కావాలని మనసున్న ప్రతివారి కోరికగా కనిపిస్తున్న సందర్భమిది.
 

తాజా వీడియోలు

Back to Top