నేడు జగనన్న విద్యాకానుక

కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ

వరుసగా మూడో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ల పిల్లలకు అందజేత

బడులు తెరిచిన తొలిరోజు నుంచే విద్యార్థులకు కిట్లు

1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి లబ్ధి

 అమరావతి: కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమయ్యే తొలిరోజైన మంగళవారం జూలై 5న సీఎం వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయంచేస్తోంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
 
విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి
విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో అందుకోని వారు, ప్రస్తుతం కొత్తగా చేరిన వారికి మాత్రమే ఈ డిక్షనరీలను ఇస్తారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారు.  

మూడేళ్లలో జేవీకే కింద రూ.2,368.33 కోట్లు వ్యయం
జగనన్న విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.931.02 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.రెండువేలు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు తెలిసినవే. వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు ఏటా పెరుగుతున్నాయి.

పలుచోట్ల ‘సీట్లు లేవు’ అన్న బోర్డులు పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్‌ పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్‌ అందిస్తున్నారు.  

విద్యాకానుకలో నాణ్యతకు పెద్దపీట
వస్తువుల నాణ్యతలో రాజీలేకుండా బ్రాండెడ్‌ వస్తువులనే పంపిణీ చేయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, నాణ్యతను ముందుగా తాను స్వయంగా పరిశీలిస్తున్నారు. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. కానీ, ఈసారి అందరికీ ఒకేరకమైన బ్యాగులను అందిస్తున్నారు. అంతేకాక.. జనరల్‌ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్‌ పేజీలతో నోట్‌బుక్స్‌ను అందిస్తున్నారు.

యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా అందిస్తోంది. ఈ విద్యాకానుక వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలుంటే 9908696785 నెంబర్‌కు పనివేళల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే, cmo.apsamagrashiksha@gmail.com లేదా spdapssapeshi@gmail.comకు తెలియచేయాలన్నారు. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలనూ జారీచేశారు.  
 

తాజా వీడియోలు

Back to Top