ఆధారాల్లేకుండా అరెస్టులా? 

వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా? 

దర్యాప్తు చేయరు.. ఆధారాలు సేకరించరు.. 

నిందితులను మాత్రం నెలల తరబడి జైళ్లలో ఉంచుతారా? 

పైగా బెయిల్‌ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా? 

మీ వైఖరి ఏం బాగోలేదు.. రాష్ట్రం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి 

నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేస్తున్నారు 

ఆ తర్వాత ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటున్నారు 

పేపర్‌ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తున్నారు 

వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్‌లు చేసి నెలల తరబడి జైళ్లలో మగ్గబెడుతున్నారు 

దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరం 

వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి ప్రజా ధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు? 

దర్యాప్తులో పురోగతి లేనప్పుడు బెయిల్‌ ఇవ్వొద్దని ఏ కారణంతో కోరతారు? 

పోలీసుల తీరుతో పుంఖాను పుంఖాలుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలవుతున్నాయి 

వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం మా వద్దకు వస్తున్నారు.. నవ్వులాట కోసం వాళ్లు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారా అని పోలీసులపై మండిపాటు

అమరావతి :  పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. 

ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. 

వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్‌ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. 

వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది.  

చాలా కేసుల్లో ఇంతే.. 
ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. 

వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమి­ట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్‌ వాంగ్మూలం ఆ­ధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చే­ర్చి, అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎ­లాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నె­ల­­లుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. 

అతనికి బె­యిల్‌ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చే­సింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్య­­తిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆ­ధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది.

 ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ శుక్రవారం ఉత్త­ర్వులు జారీ చేశారు. ఈ సంద­ర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ కృపా­సాగర్‌ రాష్ట్రం తీరును తీ­వ్రంగా గర్హించారు. పీపీ వా­ద­న­పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాని­ని తన ఉత్తర్వుల్లో రికార్డ్‌ చేశారు.  
 

Back to Top