కావ్..కావ్..కావ్..!

ఆయన్నలా వదిలేయకండర్రా..!

చంద్రబాబు నాయుడికి చాలా కోపంగా ఉంది.
తానేమో తన పాలన అదిరిపోయిందని..టిడిపికి జనమంతా జైకొడుతున్నారని ప్రచారం చేసుకుంటోన్న టైమ్ లోనే..పార్టీనుండి ఒకరొకరుగా పార్టీనేతలు వెళ్లిపోవడం చూసి చంద్రబాబుకు గుండె తరుక్కుపోతోంది.
అసలే ఎన్నికలు వస్తున్నాయి. ఓ పక్క జాతీయ సంస్థల సర్వేలన్నీ కుట్ర పన్నేశాయి.
^అన్ని సర్వేల్లోనూ టిడిపి ఓటమి ఖాయమని తేల్చి చెప్పేస్తున్నాయి.
టిడిపి ఓడిపోయినా చంద్రబాబుకు ఫర్వాలేదు కానీ..ఆ సర్వేలన్నీ కూడా రాబోయేది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నాయి.
ఇదే చంద్రబాబు నాయుడికి అస్సలు నచ్చడం లేదు.
అసలే ఆ సర్వేలపై కోపంగా ఉంటే..ఇపుడు ఒక్కొక్కరూ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా..పోతూ పోతూ  తనని తనివితీరా తిట్టి పోవడం బాబుకు కోపం తెప్పిస్తోంది.
ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
వెళ్లేవాళ్లని ఎలా ఆపాలో అర్ధం కావడం లేదు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు..ఒక ఎంపీ పార్టీని తన్ని పోయారు.
పార్టీ పెట్టినప్పటి నుంచీ ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా  ఉంటూ వచ్చిన దాసరి జై రమేష్ కూడా టిడిపిని వీడి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిపోయారు. 
మరి కొందరు ఎంపీలు..పాతిక మందిదాకా ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మూటా ముల్లె సద్దుకుని సిద్ధంగా ఉన్నారు.
ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని కర్ణపిశాచులు  పగలూ రాత్రీ తేడా లేకుండా చెవుల్లో గోల పెట్టేస్తున్నాయి.
ఈ గోలతో చంద్రబాబు నాయుడికి ఒకటే ఒళ్లుమండిపోతోంది.
ఎన్నికల ముందు ఇలా నేతలంతా వెళ్లిపోతే పార్టీ పుట్టి మునగడం ఖాయం అన్న ఇంగిత జ్ఞానం వలసపోయే నేతలకు ఉండద్దా అని చంద్రబాబు అనుకుంటున్నారు.
కేవలం స్వార్ధం కోసం ఇలా పార్టీలు మారడం న్యాయమా అని ఆయన నిలదీస్తున్నారు.
తానేమో ఎంతో కష్టపడి ..కోట్లకు కోట్లు డబ్బులు ఖర్చుపెట్టి..కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టి ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలనూ..ఇద్దరు ఎంపీలను నిజాయితీగా ..తాను చెమటోడ్చి సంపాదించిన అక్రమాస్తులతో కొని పార్టీని నడుపుతూ ఉంటే...తనకే టోకరా వేసి ఎమ్మెల్యేలూ ఎంపీలు ప్రతిపక్షంలోకి వెళ్లడం ధర్మమా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
ఎవ్వరికీ విలువలూ ...నీతీ గట్రా ఉండవా అని ఆయన ఆరా తీస్తున్నారు.
అయితే ఆయన నీడ మాత్రం చంద్రబాబును చూసి ఫక్కున నవ్వుతోంది.
తన నీడే తనని వెక్కిరిస్తోంటే చంద్రబాబుకి ఇంకా మండుకొస్తోంది.
ఎన్నికల తరుణంలో కిం కర్తవ్యం అని ఆయన కళ్లు మూసుకుని ఆలోచిస్తున్నారు.
వెనక నుంచి ఎవరో  గట్టిగా నవ్వేసి..ఆయన్ను అలా వదిలేయకండర్రా...ఎవరికైనా చూపించండర్రా అని అరిచారు.
అలా అరిచింది కేవీపీ రామచంద్రరావే అయి ఉంటారని చంద్రబాబు వెనక్కి తిరిగి చూశారు.
వెనక బాబు నీడ తప్ప   ఎవరూ లేరు.
చంద్రబాబుకు కోపం నషాలానికి అంటింది. తన నీడని లాగి తన్నాలని కాలెత్తారు. కసిగా కాలితో తన్నారు.
చంద్రబాబు నీడ కిందపడిపోయింది. 

 

తాజా ఫోటోలు

Back to Top