ప్రజాభిప్రాయం మేరకు నూతన ఇసుక విధానం

ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలి.. 

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైయ‌స్‌ జగన్‌ 

తవ్వకాలు, సరఫరాలో అవినీతికి తావుండరాదు 

పూర్తి పారదర్శక విధానం ఉండాలి 

రీజనబుల్‌ ధర ఉండాలి.. నిర్ణీత ధరకే అమ్మాలి 

చలాన కట్టి ఎవరైనా ఇసుక తీసుకుపోయేలా ఉండాలి 

ప్రభుత్వ నిర్మాణాలు, పేదల ఇళ్లకు సబ్సిడీపై సరఫరా 

ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయి 

ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి.. ప్రజల సూచనలు, సలహాలు పొందాలి. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండరాదు. పూర్తి పారదర్శక విధానం ఉండాలి. ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి. సరఫరాలో సమర్థతను పెంచాలి. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్‌ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి, సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి. 
    –సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 అమరావతి: నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుంది. రవాణా వ్యయం ఎక్కువగా ఉంది. అది రీజనబుల్‌గా ఉండాలి. 
నూతన ఇసుక విధానంపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు 

– చలాన కట్టి, ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) రంగ ప్రవేశం చేస్తుంది. 
– స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూడా కూపన్లు ఇచ్చి.. సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి. 
– ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top