ఈ రోజుకు ఘటన జరిగి 13 రోజులైంది. మన అధికారులు, సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొన్నారనేది చూడటానికి ముఖ్యమంత్రి హోదాలో నేను ఇవాళ వచ్చాను. ఇంత పకడ్బంధీగా, ఇంత కచ్చితంగా, మోస్ట్ ఎఫీషియెంట్‌గా.. ఆర్భాటం, హంగామా లేకుండా సహాయ కార్యక్రమాలు కొనసాగాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది కాబట్టే అందరికీ మేలు జరుగుతోంది. – సీఎం వైయస్ జగన్ వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు. గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఈ గ్రామంలో 293 ఇళ్లు కొట్టుకుపోయిన పరిస్థితిని కళ్లారా చూశానని చెప్పారు. చాలా నష్టం జరిగిందని, ఆ సమయంలో అధికారులు స్పందించిన తీరు, సహాయం అందించిన విధానం మీ అందరి నోటి ద్వారా విన్నానన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలకు ఐదు సెంట్ల ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అధికారులకు అభినందనలు ► అధికారులు బాగా స్పందించినందుకు అభినందిస్తున్నాను. ఇవ్వాల్సిన సహాయం, చేయాల్సిన పనులను 99 శాతం బాగా చేశారు. మీ గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిటింగ్ కోసం జాబితాలు ప్రదర్శించారు. ఇంకా ఎక్కడైనా ఒకరో, ఇద్దరో మిగిలిపోయి ఉంటే ఆ జాబితాలు చూసుకుని.. గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయండి. మీకు సాయం అందేలా చూస్తారు. ► పింఛా, అన్నమయ్య రిజర్వాయర్లపై ఆధారపడిన వ్యవసాయం పూర్తిగా నీటి పాలైంది. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ప్రభుత్వం ప్రతి హెక్టారుకు రూ.12,500 చొప్పున ఇస్తుంది. ఈ జాబితాలో ఎవరైనా మిస్ అయితే ఫిర్యాదు చేయొచ్చు. ఈ–క్రాప్ ద్వారా ప్రతి రైతుకు పరిహారం ► ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ పరిహారం ఇస్తాం. ఎందుకంటే చాలా కాలం నుంచి సాగు చేస్తున్నా, తమకు టైటిల్ డీడ్ లేదని చాలా మంది ఫిర్యాదు చేశారు. అందుకే ఈ–క్రాప్ డేటా ఆధారంగా అందరికీ పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కూడా సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆసరా ద్వారా ఇప్పటికే సహాయం చేసినప్పటికీ, ఈ పరిస్థితుల్లో పని చేసుకోలేక పోతున్నామని, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నందున సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందువల్ల వీరికి ఏదో ఒక వి«ధంగా మంచి చేస్తాం. పది రోజుల్లో ప్రైవేట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ► ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు కూడా నష్టం జరిగింది. కొందరి వాహనాలు, మరికొందరి ఆటోలు నీళ్లలో కొట్టుకుపోయాయి. వారు తమ వాహనాల నంబర్లు ఇస్తే ఏదో ఒక విధంగా ఆదుకుంటాం. ఇక్కడే జాబ్ మేళాలు పెట్టి.. ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తాం. బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తాం. ఇదంతా పది రోజుల్లో జరుగుతుంది. ► ప్రత్యేకంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారంతా ఆదివారం వరకు ఇక్కడే ఉంటారు. అన్ని పనులు పర్యవేక్షిస్తారు. రాబోయే రెండు నెలలు కూడా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వీరు వారికి కేటాయించిన గ్రామాల్లోనే బస చేస్తారు. అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆ డ్యాముల రీడిజైన్ ► పింఛా, అన్నమయ్య డ్యామ్‌లు కనీవినీ ఎరుగని వర్షాలకు దెబ్బతిన్నాయి. 2.15 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి అన్నమయ్య డ్యామ్ కెపాసిటీ అయితే, ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో దెబ్బతింది. అయినా కలెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి లోతట్టు ప్రాంతాల వారిని ముందు రోజు సాయంత్రమే సురక్షితంగా తరలించారు. అదే జరగకపోతే నష్టం దారుణంగా ఉండేది. అందుకే కలెక్టర్‌ను అభినందిస్తున్నా. ► పింఛా డ్యామ్, అన్నమయ్య డ్యామ్‌లను వెంటనే రీ డిజైన్ చేయాలని ఆదేశించాం. ఇప్పటి కంటే ఎక్కువ వరద వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్ చేసి కడతాం. నందలూరు బ్రిడ్జి వరకు అన్ని చోట్ల నిర్వాసిత ప్రాంతాలకు వరద నీరు రాకుండా రక్షణ గోడ కట్టాలని ఆదేశించాం. ఈ గ్రామాలకు ఏ కష్టం వచ్చినా వేగంగా ఆదుకుంటున్నాం. ఇక్కడి నేతలు మిథున్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఇంకా ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ► ఇంత వేగంగా సహాయ కార్యక్రమాలు గతంలో ఏనాడూ జరగలేదు. గతానికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. ఆర్భాటం, హంగామా లేకుండా పనులు చేసి చూపించగలిగాం. అధికార యంత్రాంగమంతా మమేకమై 10–13 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ మంచి చేయడం సంతోషం కలిగించే విషయం. ► ఇంతటి కష్టంలో కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపించినందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి పేరుపేరున కృతజ్ఞతలు. స్వర్ణముఖిపై వంతెన పరిశీలన ► ఏర్పేడు మండలం పాపానాయుడు పేట – గుడిమల్లం రహదారిలో ఇటీవల కొట్టుకుపోయిన స్వర్ణముఖి నదిపై వంతెనను గురువారం రాత్రి ముఖ్యమంత్రి పరిశీలించారు. 195 మీటర్ల పొడవు ఉన్న బ్రిడ్జి కొట్టుకు పోయిందని అధికారులు వివరించారు. ► పాపానాయుడుపేట – చెన్నంపల్లికి వెళ్లేందుకు స్వర్ణముఖి, నక్కలవాగుపై వంతెనలు లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని చెప్పారు.