పేదింటికి మంచి ఘడియలు

నేడు సీఆర్‌డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం

శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రూ.1,829.57 కోట్లతో 50 వేల మందికి పైగా పేదలకు సర్కారు స్థిర నివాసాలు

ఎల్లో ముఠా కుట్రలు అధిగమించి ఇప్పటికే అమరావతిలో 1,402.58 ఎకరాల్లో 50,793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ

అమ‌రావ‌తి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్‌ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 
ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.

అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.

ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి..
ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్‌ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది.  

మహిళా సాధికారతే లక్ష్యంగా..
నిజానికి.. సీఎం జగన్‌ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్‌ విలువైన భూములను పంపిణీ చేశారు.

ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్‌నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు.

రూ.లక్షల కోట్ల సంపద సృష్టి
మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం  సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్‌ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది.

మోడల్‌ హౌస్‌ చాలా బాగా వచ్చింది
లేఅవుట్‌లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్‌ హౌస్‌ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం  

 

వరాల రేడు వస్తున్నట్టు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందో ఏమో.. ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పేదింటికి మంచి ఘడియ రాబోతున్నట్టు మంగళాద్రి వేదంలా ఘోషిస్తుందో ఏమో.. శాసన రాజధాని సంతోషగానం చేస్తోంది. ‘ఇంటి’వేల్పు కరుణించినట్టు మోడల్‌ హౌస్‌ మురిసిపోతుందో ఏమో.. కోటి ఆశలతో కృష్ణాయపాలెం నిరీక్షిస్తోంది. కొంగొత్త కలలతో జననేతకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ ఆహ్వానం పలుకుతోంది.

 
మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు సోమ వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు మంగళగిరి నియోజకవర్గం పెదకాకాని మండలంలోని మొత్తం 53 వేల మంది పేదలకు ప్రభుత్వం ఇక్కడ ఇళ్లస్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. దీనికోసం కృష్ణాయపాలెంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు లబ్ధిదారులు, స్థానిక ప్రజలు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఫలితంగా పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ 53 వేల మందికి ఇళ్ల నిర్మాణం పూర్తయితే కొత్తగా 25 ఊళ్లు ఆవిర్భవించనున్నాయి. దాదాపు 2.50 లక్షల మంది జనాభాకు ఆవాసం కానున్నాయి.

బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
తాడికొండ: పేదల ఇళ్లకు శంకుస్థాపన అనంతరం తుళ్లూరు మండలం వెంకటపాలెం తిరుమల తిరుపతి ఆలయం సాక్షిగా జరగనున్న బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పనులను పలువురు నాయకులు, అధికారులు ఆదివారం పరిశీలించారు. సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, వైఎస్సార్‌ సీపీ తాడికొండ సమన్వయకర్త కత్తెర సురేష్‌తోపాటు పలువురు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభా వేదిక, గ్యాలరీ, సందర్శకులు, వీఐపీ, మీడియా పాయింట్‌ పనులపై సూచనలు చేశారు. బందోబస్తు కోసం భారీగా పోలీసులు తరలివచ్చారు.

పరిశీలించిన మంత్రులు
బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రులు ఆదిమూలపు సురేష్‌, విడదల రజిని, జోగి రమేష్‌, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కూడా పరిశీలించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్‌, మోడల్‌ హౌస్‌ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మొక్కలు నాటే పనుల ఏర్పాట్లు, హెలీప్యాడ్‌ పనులనూ పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ శా, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పేదల కష్టం తెలిసిన సీఎం
జగనన్న కాలనీలో జరుగుతున్న పనులతో మరికొద్ది రోజుల్లోనే సొంతిల్లు యజమాని కాబోతుండటం ఆనందంగా ఉంది. ఇక్కడ నిర్మించిన మోడల్‌ హౌస్‌ బాగుంది. నాలాంటి పేదలు స్థలం కొని ఇల్లు కట్టుకోవడం గగనమే. పేదల కష్టం తెలిసిన జగనన్న మాకు సొంతిల్లు ఏర్పరచడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రుణం తీర్చుకోలేం.
– శంకవరపు కోమలి, కృష్ణాయపాలెం

జగనన్న మేలు మర్చిపోలేం
ఎంతో విలువైన ప్రాంతంలో స్థలం ఇవ్వడమే కాకుండా వెంటనే ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయం. పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వనుండటంతో పేదలంతా ఎంతో ఆనందంగా జీవిస్తారు. జగనన్న మేలు మర్చిపోలేం.

– దానబోయిన శ్రీనాగజ్యోతి, ఉండవల్లి

వసతులు బాగున్నాయి
జగనన్న కాలనీలో వసతులు చాలా బాగున్నాయి. రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం ఇప్పటికే పూర్తి కావొచ్చాయి. అతి కొద్దికాలంలోనే సొంతింటి కల నెరవేరనుండటంతో చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు జీవితాంతం అండగా ఉంటాం. ఆయన రుణం తీర్చుకుంటాం.
– అల్లం కృష్ణకుమారి, ఉండవల్లి


అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. సీఎం సంకల్పానికి తార్కాణం 
 
  రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. అమరావతి రాజధానిలో అది మరొక ఎత్తని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పానికి ఇది తార్కాణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని జగనన్న లేఅవుట్‌లో ‘నవరత్నాలు–పేదలందరికే ఇళ్లు’ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని ఆదివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ పరిధి అమరావతి రాజధానిలో పేద, బడుగు, బలహీనవర్గాలు ఉండటానికి వీల్లేదని.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు, ఆయన సామాజికవర్గం మాత్రమే ఇక్కడ నివసించాలని కుట్రతో కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా..  ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాక అక్కడ ఇళ్లను సైతం నిర్మించి ఇచ్చేందుకు చేస్తున్న కృషి ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనమని మంత్రులు కొనియాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగదని, పేదలకు ఇళ్లు రావని టీడీపీతో పాటు ఆయన తోక పారీ్టలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతున్నామన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రక ఘట్టమని, రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో రగలిపోతున్నాడన్నారు.   

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు.. 

ఇక అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజతో పాటు సామాజిక మౌలిక వసతులకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, డిజిటల్‌ లైబ్రరీ, ఈ–హెల్త్‌ సెంటర్ల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. గ్రీన్‌ సోషల్‌ ఫారెస్ట్‌లో భాగంగా లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన చెరువు వద్ద, ఇతర ప్రాంతాల్లో 30వేల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని 25 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను అతి త్వరలోనే పూర్తిచేసేందుకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన షీర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో దాదాపు 35వేల ఇళ్లను ఈ టెక్నాలజీతో నిర్మిస్తారని వారు చెప్పారు. ఇక్కడ ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్‌ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయిలో రహదారులు, డ్రైనేజి వ్యవస్థలను ఏర్పాటుచేసి గేటెడ్‌ కమ్యూనిటీ లేఅవుట్లుగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతామన్నారు.  

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top