కరువు నేలకు.. ‘కృష్ణా’భిషేకం

రేపు 77 చెరువులకు కృష్ణా జలాలు.. జాతికి అంకితం చేయనున్న సీఎం వైయ‌స్  జగన్‌

పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలుకు శ్రీకారం

కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 10,394 ఎకరాలకు సాగునీరు

పెరగనున్న భూగర్భ జలమట్టం 

బోరు బావుల కింద విస్తారంగా పంటల సాగు

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగై వలసలకు బ్రేక్‌ 

ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మలుపు అంటున్న సామాజికవేత్తలు

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో 2018లో హడావుడిగా ఆ పథకాన్ని చేపట్టిన టీడీపీ సర్కార్‌

జీవో ఇచ్చి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకున్న వైనం

అధికారంలోకి వచ్చాక రూ.224.31 కోట్లతో ఈ పథకాన్ని పూర్తి చేసిన సీఎం జగన్‌

పచ్చటి పంటలతో కోనసీమను తలపిస్తున్న కరువు నేల

 రాష్ట్రంలో అత్యంత కరువు పరిస్థితులకు, వలస­లకు మరుపేరైన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాలు కృష్ణమ్మ స్పర్శతో పరవశించిపోతున్నాయి. ఇన్నాళ్లూ కరువుతో తల్లడిల్లిన నేలతల్లిని ఇప్పుడు కృష్ణా జలాలు అభిషేకిస్తుండటంతో పులకరించిపోతోంది. ట్రయల్‌ రన్‌ (ప్రయోగాత్మకంగా నడిపించడం) ద్వారా కృష్ణా జలాలను నింపిన చెరువుల కింద రైతులు పంటలు సాగు చేయడంతో నిన్నటి దాకా నోళ్లు తెరిచిన బీడు భూములు ఇప్పుడు కోనసీమను తలపిస్తున్నాయి.

దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతాల ప్రజల దశ మార్చే మహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఆ ప్రాంతంలో 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకం ఫలాలను సీఎం వైఎస్‌ జగన్‌ రైతులకు అందిస్తుండటం కర్నూలు, నంద్యాల జిల్లాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా సామాజిక­­వేత్తలు ప్రశంసిస్తున్నారు. ఈ మహత్తర ఆశయంతో రూ.224.31 కోట్ల వ్యయంతో చేపట్టిన 77 చెరు­వులను నింపే పథకాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతి­పదికన పూర్తి చేసింది.

ఈ పథకం వల్ల డోన్, పత్తి­కొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో నేరుగా 10,394 ఎకరాలకు నీళ్లందించనున్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది. దాంతో బోరు బావుల్లోనూ నీటి లభ్య­త పెరుగు­తుంది. దీని వల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి ఇబ్బందులు తీరతాయి. దుర్భిక్షానికి, వలసలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో జీవనోపాధులు పెర­గడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగు­తా­యి. దాంతో వలసలకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. 

మరో హామీ అమలు 
డోన్, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసిన బోడి కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. కొండలు, గుట్టల మీద కురిసిన వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించడం వల్ల భూమిలోకి ఇంకని పరిస్థితి. ఫీడర్‌ ఛానల్స్‌ (వంకలు, వాగులు) సక్రమంగా లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో చెరువులు నిండని దుస్థితి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీళ్లకూ కరువే.

దాంతో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం బిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను ఇంట్లో వదిలి.. భార్యాభర్తలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆ ప్రాంతంలో నిత్యకృత్యం. పాదయాత్రలో ఆ ప్రాంతాల ప్రజల కష్టాలు కళ్లార చూసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే కృష్ణా జలాలతో చెరువులను నింపి, సుభిక్షం చేయటం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని హామీ ఇచ్చారు.

ఈ హామీతో అప్పటి టీడీపీ సర్కార్‌ ఎన్నికలకు ముందు హడావుడిగా చెరువులను నింపే పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జీవో ఇచ్చి కొబ్బరి కాయ కొట్టి చేతులు దులుపుకుంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.224.31 కోట్లు వ్యయం చేసి.. 77 చెరువులను నింపే పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

రూపు మారుతున్న కరువు ప్రాంతం 
హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసి 77 చెరువులను నింపే పథకం ట్రయల్‌ రన్‌ను 15 రోజుల క్రితం చేపట్టారు. ఇలా డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 35 చెరువులను ఇప్పటికే నింపారు. ఈ చెరువుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేసుకుంటున్నారు. డోన్‌ మండలం వెంకటాపురం చెరువు కింద రెండెకరాల్లో చాలా ఏళ్ల తర్వాత వరి పంట సాగు చేశానని మద్దిలేటి అనే రైతు ‘సాక్షి’కి చెప్పారు.

క్రిష్ణగిరి మండలం కటారుకొండ చెరువు కింద దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకటిన్నర ఎకరాలో మొక్క జొన్న పంట సాగు చేశానని జయరాముడు అనే రైతు సంతోషం వ్యక్తం చేశాడు. వర్షం పడకపోవడం వల్ల కొండల్లో మేత దొరకక.. చెరువుల్లో నీళ్లు లేక గొర్రెలు, మేకలను కర్ణాటకకు తోలుకెళ్లేవాళ్లమని.. ఇప్పుడు చెరువులు నింపుతుండటంతో పుష్కలంగా నీళ్లు దొరుకుతున్నాయని.. మేత కూడా దొరుకుతుండటం వల్ల ఎక్కడికీ వెళ్లాల్సిన పరిస్థితి లేదని కురుబ ఓబన్న అనే గొర్రల కాపరి ఆనందం వ్యక్తం చేశాడు. పంటలు సాగు చేస్తుండటంతో రైతులకు చేతి నిండా పనితో ఆదాయం వస్తోంది. దాంతో ఎక్కడికైనా వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పథకం స్వరూపం 
► కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ 90 కి.మీ సమీపంలో (ఆలంకొండ) రోజుకు 159 క్యూసెక్కులను ఎత్తిపోసేలా పంప్‌హౌస్‌ నిర్మించారు. ఇందులో 3,800 హార్స్‌పవర్‌ సామర్థ్యం కలిగిన మూడు పంప్‌లు, మోటార్లను అమర్చారు. ఒక్కో పంప్, మోటార్‌ ద్వారా 53 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చు.

► హంద్రీ–నీవా ప్రధాన కాలువ 90 కి.మీ వద్ద సముద్ర మట్టానికి 429 మీటర్ల ఎత్తున ఉంటుంది. అక్కడి పంప్‌హౌస్, 5.625 కి.మీల పొడవున నిర్మించిన ప్రెజర్‌ మెయిన్‌ ద్వారా సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తున ఉన్న కటారుకొండ వద్ద నిర్మించిన డెలివరీ చాంబర్‌లోకి 159 క్యూసెక్కులను ఎత్తిపోస్తారు. 

► కటారుకొండ వద్ద నిర్మించిన డెలివరీ చాంబర్‌ నుంచి 43.40 కి.మీల పొడవున వేసిన గ్రావిటీ మెయిన్‌–1(పైపు లైన్‌ ద్వారా గురుత్వాకర్షణపై) ద్వారా 22 చెరువులను నింపి.. నేరుగా 4,217 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 29.40 కి.మీ పొడవున నిర్మించిన గ్రావిటీ మెయిన్‌–2 ద్వారా 16 చెరువులను నింపి.. నేరుగా 3,018 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 47.90 కి.మీ పొడవున నిర్మించిన గ్రావిటీ మెయిన్‌–3 ద్వారా 30 చెరువులు నింపి.. 2,895 ఎకరాలకు నేరుగా నీళ్లందిస్తారు. పైపుల ద్వారా నీటిని తరలిస్తుండటం వల్ల ప్రవాహ నష్టాలు లేనే లేవు. ఆవిరి నష్టాలు కూడా స్వల్పమే. 

► డోన్, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లోని 77 చెరువులను నింపడం ద్వారా నేరుగా 10,394 ఎకరాలకు సాగు నీరు, 57 గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తారు.  

► ఈ పథకం కింద తొలుత ప్రతిపాదించిన 68 చెరువులతోపాటు అదనంగా 9 చెరువులు (డోన్‌ నియోజకవర్గంలో 8, పత్తికొండ నియోజకవర్గంలో 1) కలిపి ప్రస్తుతం 77 చెరువులను నింపుతున్నారు. ఈ పథకం కింద చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులూ చేపట్టారు.

చకచకా పూర్తవుతున్న ప్రాజెక్టులు 
సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.31 లక్షల కోట్లను జమ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. సాగునీటి ప్రాజెక్టులనూ అంతే ప్రాధాన్యతతో పూర్తి చేస్తూ జలయజ్ఞ ఫలాలను రైతులకు అందిస్తున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేసి.. నెల్లూరు డెల్టాను సస్యశ్యామలం చేశారు.

ఇప్పుడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు వరదాయిని వంటి 77 చెరువులను నింపే పథకాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ దాదాపుగా పూర్తికావొచ్చాయి. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ రచించిన ప్రణాళికను అమలు చేస్తున్న అధికారులు పనులను చకచకా చేస్తున్నారు. 

సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు
తీవ్రమైన దుర్భిక్షానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలు పెట్టింది పేరు. ఇక్కడ వలసలు నిత్యకృత్యం. కృష్ణా జలాలతో ఈ ప్రాంతాన్ని అభిషేకించి, సుభిక్షం చేయడం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చెప్పిన 68 చెరువుల కంటే 9 అదనంగా 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణక్షాలతో లిఖిందగ్గది. ఈ పథకంతో కరవు ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. 
- బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి

సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అమలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అతి తక్కువ ఖర్చుతో తీవ్ర కరవు ప్రాంతంలో 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేశాం. చెరువుల కింద ఆయకట్టులో సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల (డ్రిప్, స్పింక్లర్లు)లో పంటలు సాగుచేస్తే నీటి వృథాకు అడ్డుకట్ట వేయొచ్చు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలతో సమన్వయం చేసుకుని ఆ దిశగా రైతులను చైతన్య పరుస్తాం.
- శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ

యాజమాన్య పద్ధతులకు పెద్దపీట 
77 చెరువులను నింపే పథకం ఇంజనీరింగ్‌లో ఓ అద్భుతం. కొండ, గుట్టలతో నిండిన ప్రాంతంలో చెరువులను నింపడం శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. కానీ.. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి 116 మీటర్ల ఎత్తున ఉన్న కటారుకొండపైకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ మెయిన్‌ల ద్వారా 68కి బదులుగా 77 చెరువులు నింపుతున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అతి తక్కువ ఖర్చుతో ఈ పథకం పూర్తి చేశాం. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గ్రావిటీ మెయిన్‌లతో చేపట్టిన మొదటి పథకం ఇది. యాజమాన్య పద్ధతుల్లో ఇది ప్రధానమైనది. దీని వల్ల ప్రవాహ నష్టాలు ఉండవు.
- సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జల వనరుల శాఖ 

ఆరుతడి పంటలే లాభం
సీఎం వైయ‌స్‌ జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన ఆదేశాల మేరకు.. అతి తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేశాం. ఒక క్యూసెక్‌ నీటితో 50 ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 120 నుంచి 150 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయొచ్చు. చెరువుల కింద ఆరుతడి పంటలు, ఉద్యాన వన పంటలు సాగుచేస్తే అధిక ఆయకట్టులో పంటలు సాగు చేసుకోవచ్చు. ఆ దిశగా రైతులను చైతన్యవంతం చేసి.. ఈ పథకం ఫలాలను పూర్తి స్థాయిలో అందేలా చేస్తాం. 
- రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ, కర్నూలు జిల్లా

సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు
తీవ్రమైన దుర్భిక్షానికి కర్నూలు, నంద్యాల జిల్లా­ల్లోని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజ­కవర్గాలు పెట్టింది పేరు. ఇక్కడ వల­సలు నిత్యకృత్యం. కృష్ణా జలాలతో ఈ ప్రాంతాన్ని అభిషేకించి, సుభిక్షం చేయడం ద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చెప్పిన 68 చెరువుల కంటే 9 అదనంగా 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ పథకంతో కరవు ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. 
- బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి 

Back to Top